రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. ఏ ప్రయోగశాలలోనూ తయారు చేయలేం. ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వేళ, పలు తీవ్ర అనారోగ్య సమయాల్లో, ప్రసవ సమయాల్లో, సంక్లిష్ట శస్త్రచికిత్స చేసే క్షణాల్లో, ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడే వ్యక్తులకు సురక్షిత రక్తం లేదా రక్తఉత్పత్తులు అందించుట అత్యవసరంగా జరిగితేనే ప్రాణాలు నిలుస్తాయి. రక్తదాతలు మాత్రమే ఇలాంటి అమూల్య ప్రాణాలు పోయగలరు. ఉదాహరణకు ఇటీవల ఒడిషాలో జరిగిన రైలు ప్రమాదం అందరికీ తెలిసిందే. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఎక్కువ మంది క్షతగాత్రు లయ్యారు. వెంటనే స్పందించిన ప్రజలు చాలామందికి రక్తం ఇచ్చి వారి ప్రాణాలను కాపాడి మానవత్వం చాటుకున్నారు. ఇలాంటి అనుకోని ఘటనలు జరిగినప్పుడే కాదు, రక్తం అవసరమైన వారు మనచుట్టూ ఎక్కడో ఒక దగ్గర తారసపడుతూనే ఉంటారు. వారి విలువైన ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం చేయడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. రక్తదాన యజ్ఞం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం, దాతలను సముచితంగా గుర్తించి ప్రోత్సహించడం, రక్తదానం పట్ల అపోహలను తొలగించడం కోసం ”ఐరాస – రెడ్‌క్రాస్ సొసైటీ”లు సంయుక్తంగా ప్రతి యేటా14 జూన్ రోజున ‘ప్రపంచ రక్తదాతల దినం (వరల్డ్ బ్లడ్ డోనార్ డే)’గా పిలుస్తున్నది. రక్తం ఏ, బి, ఏబి, ఓ అనబడే నాలుగు రకాలుగా ఉంటుందని కనుగొన్న ప్రఖ్యాత శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ‘కార్ల్ లాండ్ స్టేనర్’ జన్మదినం (14 జూన్ 1868) సందర్భంగా ఈ ”ప్రపంచ రక్తదాతల దినం” నిర్వహించకోవడం ఆనవాయితీగా వస్తున్నది. 2005లో ప్రారంభమైన ప్రపంచ రక్తదాతల దినం వేదికగా 192 దేశాలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రచారం ప్రారంభించాయి. సకాలంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోయే అభాగ్యుల పట్ల సహానుభూతిని ప్రదర్శిస్తూ, ప్రతి యేటా కనీసం 2-3సార్లు అయినా రక్తదానం చేసే అలవాటును ప్రతి ఒక్కరు, ముఖ్యంగా యువత ముందుకు చేసుకోవాలని అన్ని స్వచ్ఛంద సంస్థలు విన్నవిస్తున్నాయి. ప్రభుత్వాలు, వైద్యరంగం, స్వచ్ఛంధ సంస్థలు రక్తదాన శిబిరాల ఏర్పాటు చేసేందుకు చొరవ చూపాలి. రక్తం నిలువ చేయడం, రక్త పరీక్షల నిర్వహణ, రక్తనిధి కేంద్రాల స్థాపన, రక్త సేకరణ, అందరికీ అందుబాటులో ఉంచడం లాంటి అంశాలకు అధిక ప్రాధాన్యతలు ఇవ్వాలి. రక్తదాతలు సేవా గుణంతో మిలియన్ల ప్రాణాలు నిలపడం, సరైన జీవనాన్ని గడిపేలా సహకరించడం జరుగుతున్నది. ప్రపంచ దేశాలన్నింటిలో రక్తదానం అత్యవసరం అయ్యింది. విశ్వమంతటా రక్త కొరత ఉన్నది వాస్తవం. అధిక జనాభా గల అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాల్లో రక్త కొరత తీవ్రంగా ఉంది.
ప్రపంచ రక్తదాతల దినం-2023 నినాదంగా ‘గివ్ బ్లడ్, గివ్ ప్లాస్మా, షేర్ లైఫ్, షేర్ ఆఫెన్’ అనే అంశాన్ని తీసుకొని ప్రచారం చేస్తున్నారు. స్వచ్ఛంధ రక్తదాతలకు కృతజ్ఞతలు తెలుపడం, కొత్త దాతలను ఆహ్వానించడం, డబ్బు కోసం రక్తదానం చేసే వారిని నిరోధించడం, రక్తదాన ప్రాముఖ్యతను వివరించడం, యువత రక్తదాతలుగా ప్రజారోగ్య పరిరక్షణలో మానవీయతను చాటడం లాంటి పలు ప్రచారాలు ప్రస్తుతం ఎక్కువ అవసరం. రక్తంతో పాటు రక్త ఉత్పత్తులైన ప్లేట్లెట్లు, ప్లాస్మా, క్రయో, తెల్ల, ఎర్ర (ఎరిత్రోసైట్స్, ల్యూకోసైట్స్) రక్తకణాలు-గ్రాన్యులోసైట్స్ లాంటివి కూడా రోగులకు అత్యవసరంగా అందించడం జరుగుతుంది. భారతదేశంలో 5కోట్ల యూనిట్ల రక్తం అవసరం ఉండగా 3కోట్ల యూనిట్ల మాత్రమే రక్తదాతల ద్వారా లభిస్తున్నది. ప్రతి రోజు 38,000 రక్తదానాలు జరగాల్సి ఉంది. సంపూర్ణ ఆరోగ్యం, 50కిలోలు మించి బరువు, 18-65 ఏండ్ల వయస్సు, డెసిలీటర్ రక్తంలో 12.5గ్రామ్‌ల హిమోగ్లోబిన్ లాంటి అర్హతలు కలిగిన ప్రతి ఒక్కరు ప్రతి 3మాసాలకు ఒకసారి రక్తదానం చేయ వచ్చు. హెచ్‌ఐవి, గుండె జబ్బులు, హెపటైటిస్ బి, రాబిస్, గర్భిణులు, నిత్యం ఆల్కహాల్ సేవించే వారు, రొమ్ముపాలు ఇచ్చే తల్లులు, తీవ్ర ఆనారోగ్యం నుంచి కోలుకున్నవారు, ఫిట్స్, టిబి, ఎలర్జీ, అస్తమా లాంటి లక్షణాలు ఉన్నవారు రక్తదానం చేయకూడదు. రక్తదానంతో ప్రాణాలనే కానుకగా ఇవ్వవచ్చు. మరే ప్రత్యామ్నాయంలేని అత్యంత విలువైన రక్తాన్ని దానం చేయడానికి 10-15నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. స్వచ్ఛందంగా కనీసం ఏడాదికి మూడుసార్లు అయినా రక్తదానం చేస్తూ, అవసరార్థుల ప్రాణాలను కాపాడుదాం. రక్తదానమే మహాదానమని నినదిద్దాం. (14 జూన్ ‘ప్రపంచ రక్తదాతల దినోత్సవం’)
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి, 9949700037