– ఎండాకాలం కావడంతో ముందుకు రాని దాతలు
– అలాంటి అనుమానాలు అక్కర్లేదంటున్న వైద్య నిపుణులు
– గ్రేటర్ హైదరాబాద్‌లో 50కి పైగా బ్లడ్ బ్యాంకుల్లో సమస్య
– తలసేమియా బాధితులకు తప్పని తిప్పలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
రక్తదానం చేయడం గొప్ప దానంగా పరిగణిస్తారు. ఒకరు రక్తదానం చేయడం వల్ల ముగ్గురి ప్రాణాన్ని కాపాడవచ్చు. అందుకే రక్తదానం చేసే వారిని ప్రాణదా తలుగా పేర్కొంటారు. అయితే, గ్రేటర్ హైదరాబాద్‌లో రక్తం నిల్వలు పడిపోయాయి. రక్తం అవసరమయ్యే వారి సంఖ్య పెరుగుతుండగా.. ఇందుకు అనుగుణంగా రక్త సేకరణ లేకపోవడంతో రక్తం నిల్వలు తగ్గుతున్నాయి. దీంతో తలసేమియా బాధితులకు ఇబ్బందులు తప్పడం లేదు. మార్చి నుంచి రక్తదానం చేసే వారి సంఖ్య తగ్గింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 14న జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో రక్తం దానం చేసే వారి సంఖ్య తగ్గడానికి కారణాలపై కథనం..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 85 వరకు రక్తనిధి కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 22 ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులు కాగా.. మిగతావి ప్రయివేటు, రెడ్‌క్రాస్ తదితర స్వచ్ఛంద సంస్థల ఆధీనంలో పని చేస్తున్నాయి. దాదాపు 50కి పైగా బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు లేవని సమాచారం. రక్తం కొరత కారణంగా కొన్ని ప్రభుత్వాస్పత్రుల్లో అత్యవసర లేదా ఎంపిక చేసిన సర్జరీలే చేస్తున్నారు. ప్రతి ఏడాదీ గ్రేటర్ హైదరాబాద్‌లో దాదాపు 3.40 లక్షల యూనిట్ల వరకు రక్తం అవసరం ఉంటుంది. ప్రస్తుతం కొరత ఏర్పడటంతో బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు పడిపోయాయి. నగరంలో తలసేమియా బాధితులతో కలుపుకుని ఇతర రోగులకు రోజుకు 5-7 వేల యూనిట్ల రక్తం అవసరం ఉండగా.. ప్రస్తుతం సకాలంలో రక్తం అందించలేని పరిస్థితి ఏర్పడింది.
ప్రతి వేసవిలో బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు పడిపోవడం సర్వసాధారమే. కానీ ఈ ఏడాది కొరత తీవ్రంగా ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. నారాయణగూడలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో సాధారణ రోజుల్లో 100 యూనిట్ల వరకు సరఫరా చేసేవారు. ప్రస్తుతం 70-80 యూనిట్లకు మించి ఇచ్చే పరిస్థితి లేదు. ఇక్కడి నుంచి నిత్యం నిలోఫర్, ఉస్మానియా, ప్లేట్లబుర్జు ఆస్పత్రులకు రక్తం సరఫరా చేస్తుంటారు. ప్రస్తుతం రక్తం కొరతతో వీటికి కూడా అత్యవసరమైతే తప్ప బల్క్‌గా సరఫరా చేయడం లేదు.
వేసవిలో శిబిరాలు తక్కువ
వేసవిలో కాలేజీలకు సెలవుల వల్ల రక్తదాన శిబిరాలు తక్కువయ్యాయి. దీనికితోడు ఎండాకాలంలో రక్తదానం చేస్తే అనారోగ్యాల బారిన పడతామనే భావనతో చాలా మంది డోనర్లు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఈ పరిస్థితులన్నీ బ్లడ్ బ్యాంకుల్లో నిల్వలు తగ్గడానికి కారణం అయి ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి సంవత్సరంలో మూడు నెలల వ్యవధిలో గరిష్టంగా నాలుగు సార్లు రక్తదానం చేయొచ్చని వైద్య నిపుణులు తెలిపారు.
తలసేమియా బాధితులకు ఇబ్బందులు
తలసేమియా వ్యాధి బారినపడిన వారికి 20 రోజులకోసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. సకాలంలో రక్తం అందకపోతే ప్రాణం పోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి వారికి దాతల నుంచి సేకరించిన రక్తం చాలా ఉపయోగపడుతుంది. శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీ ఎదురుగా ఉన్న భవనంలో ‘తలసేమియా సెకిల్ సొసైటీ బ్లడ్ బ్యాంకు’ను ఏర్పాటు చేసి తలసేమియా రోగులకు ఉచితంగా రక్తం అందిస్తున్నారు. ప్రస్తుతం 3,085 మంది రోగులు ఈ సొసైటీలో తమ పేర్లను నమోదు చేసుకుని సేవలు పొందుతున్నారు. వీరిలో చిన్నారులే అధికంగా ఉండటం గమనార్హం. జంట నగరాల నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ రక్తం ఎక్కించుకుంటారు. ఇక్కడికి వచ్చే రోగులకు రోజూ 50-70 యూనిట్ల రక్తం అవసరం అవుతుందనీ, నెలకు సుమారు 2వేల యూనిట్ల రక్తం అవసరం ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చే వారికి తలసేమియా, సికెల్ సెల్, అనీమియా సొసైటీ తరపున 50శాతం, ప్రభుత్వ రక్తనిధి కేంద్రాల నుంచి 50శాతం రక్తం సరఫరా చేస్తుంటారు. ఇటీవల సరఫరా తగ్గడంతో తలసేమియా బాధితులు ఇబ్బందులు పడుతున్నారు.
దాతల నుంచి సేకరణ
స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు, విద్యా సంస్థలు, యువజన సంఘాల సహకారంతో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ రక్తాన్ని సేకరించి బ్లడ్ బ్యాంకుల్లో నిల్వ చేస్తారు. ప్రస్తుతం రక్తం కొరతతో కొంత మందికి అందించలేని పరిస్థితి ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. అత్యవసర సమయంలో తమ వద్ద ఉన్న రక్తదాతల జాబితా నుంచి అవసరమైన గ్రూపు వారికి సమాచారం ఇచ్చి రక్తం సేకరించాల్సి వస్తుందంటున్నారు.
రక్తదాతలు ముందుకు రావాలి
రక్తం కొరత ఏర్పడింది. గతంలో పోలీసులు, విద్యా సంస్థల వారు రక్తదాన శిబిరాలు నిర్వహించి సేకరించేవారు. కరోనా తర్వాత కొన్ని సాఫ్ట్‌వేర్ సంస్థలు ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హౌం ఇవ్వడం, విద్యా సంస్థలకు సమ్మర్ సెలవులు కావడంతో రక్తం దొరకడం లేదు. గత నెలలో పోలీసు డిపార్టుమెంట్ వారు రక్తదానం చేయాలని సీఎం సూచిస్తే చాలా మంది ఫోన్ చేసి రక్తదానం చేస్తామని చెప్పారు. ఇంకా ఎవరైన దాతలు ఉంటే ముందుకొచ్చి రక్తదానం చేయాలి.
– పిచ్చిరెడ్డి, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, విద్యానగర్
దాతలు ముందుకొచ్చి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలి. ఎండాకాలంపై అపోహలు వీడి రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. రక్తదానం చేయాలనుకునే వారు శివరాంపల్లిలోని సొసైటీ బ్లడ్ బ్యాంక్‌కు వచ్చి రక్తం ఇవ్వొచ్చు. ఇతర వివరాలకు 8885534913, 04029885658 నెంబర్లలో సంప్రదించగలరు.
– అలీమ్ బేగ్, జాయింట్ సెక్రెటరీ, తలసేమియా సికిల్ సొసైటీ, శివరాంపల్లి.