జలమండలిని వణికిస్తున్న నకిలీ ఏసీబీలు
ఆందోళనకు గురవుతున్న అధికారులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
నకిలీ ఏసీబీ అధికారులు జలమండలిని వణికిస్తున్నారు. హైదరాబాద్ మహా నగరంలో తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ చేపట్టే వాటర్‌బోర్డులో కొందరు అవినీతి అధికారులు ఏసీబీ అధికారులకు చిక్కుతున్న విషయం తెలిసిందే. ఏసీబీ అధికారుల దాడుల్లో రూ.కోట్ల ఆస్తులు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో సందెట్లో సడేమీయాగా నకిలీ ఏసీబీ అధికారులు రెచ్చిపోతున్నారు. గత నెలలో వాటర్‌బోర్డు రెడ్‌హిల్స్ డివిజన్ ప్రాజెక్టు-8కు జనరల్ మేనేజర్‌గా ఉన్న సగ్గం అనంత లక్ష్మీకుమార్ ఇంటిపై ఏసీబీ దాడి చర్చనీయాంశంగా మారింది. జీఎం స్థాయి అధికారి ఇండ్లపై పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తే రూ.1.10 కోట్ల నగదు, 2.1 కిలోల బంగారం బయటపడటం ఆసక్తికరంగా మారింది. గతంలోనూ పలువురు అధికారులు కాంట్రాక్టర్ల నుంచి నేరుగా డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. బోడుప్పల్‌లో కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఓ జనరల్ మేనేజర్ ఏసీబీకి పట్టుబడ్డారు. మరికొందరు నల్లా కనెక్షన్ల మంజూరులో డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండ్‌గా దొరికారు. ఆరు నెలల కిందట మణికొండలో మేనేజర్‌గా ఉన్న మహిళా ఇంజినీరు నల్లా కనెక్షన్ కోసం రూ.30వేలు లంచం తీసుకుంటూ చిక్కారు. అదేవిధంగా వాటర్‌బోర్డు ప్రధాన కార్యాలయంలో కూడా ట్యాంకర్ బిల్లులను విడుదల చేయడానికి మొదటి విడతగా లక్ష రూపాయలు లంచ తీసుకుంటుండగా సీనియర్ అసిస్టెంట్, మరో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి చిక్కారు. ఇలా పలువురు ఏసీబీకి చిక్కిన ఘటనలున్నాయి. కిందిస్థాయి అధికారుల ఆస్తులే ఈ స్థాయిలో ఉంటే ఇక అవినీతికి పాల్పడే ఉన్నతస్థాయి అధికారుల ఆస్తులు ఏ స్థాయిలో ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకుని కొంతమంది నకిలీలు ఏసీబీ అధికారులుగా ఫోన్ చేస్తూ బెదిరిస్తుండటంతో అధికారులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
ఫోన్‌లో నకిలీ ఏసీబీ అధికారుల బెదరింపులు
జలమండలిలో కొందరు అధికారులు వరసగా ఏసీబీ అధికారులకు చిక్కుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇదే అదనుగా నకిలీలు రెచ్చిపోతున్నారు. కొందరు నకిలీ టేకుగాళ్లు జలమండలి అధికారులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్టు సమాచారం. ఫోన్ రిసీవ్ చేసుకోగానే ముందుగా తాము ఏసీబీ అధికారులమంటూ పరిచయం చేసుకుంటున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించినట్టు తమ వద్ద అన్ని ఆధారాలున్నాయని, మీపై తమకు ఫిర్యాదులు సైతం వచ్చాయని భయాందోళనకు గురిచేస్తున్నారు. మీకు ముందుగా సమాచారం అందిస్తున్నామని, మీ మంచికే చెబుతున్నాను వచ్చి సెటిల్ చేసుకోమంటూ ఫోన్‌లోనే ఒత్తిడి చేస్తున్నారు. మేము చెప్పిన చోటుకు వచ్చి సెటిల్ చేసుకోకపోతే మీ ఇష్టం.. దాడులు తప్పవని బెదిరిస్తున్నారు. నకిలీల బెదిరింపులకు తాళలేక కొందరు జలమండలి అధికారులైతే ఎంతోకొంత ముట్టజెప్పాలని ప్రయత్నించినట్టు తెలిసింది. ఒక్కరిద్దరు ఉన్నతాధికారులు మాత్రం భారీగా డబ్బులు ముట్టజెప్పినట్టు బాహాటంగా చర్చజరుగుతోంది. ఇదిలావుండగా ఫోన్‌కాల్స్ నకిలీవిగా తేలడంతో మరికొందరు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.



