Thursday, August 6, 2026
E-PAPER
Homeజాతీయంజమ్మూ-కశ్మీర్ లో నిరసనలు

జమ్మూ-కశ్మీర్ లో నిరసనలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ఆర్టికల్‌ 370 రద్దు ఏడో వార్షికోత్సవాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం జమ్మూ-కశ్మీర్‌ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సీపీఐ(ఎం), పాలక నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సి), పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) సహా పలు పార్టీలు ఆందోళనలు చేపట్టాయి. 2019, ఆగస్టు5న కేంద్రం జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే ఆర్టికల్‌ 370ని కేంద్రం ఏకపక్ష‍ంగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. 2019 ఆగస్టు 5న జరిగిన ఘటన, కేంద్ర ప్రభుత్వం, జమ్మూకాశ్మీర్ల మధ్య ఉన్న సంబంధంపై జరిగిన ఒక వ్యవస్థీకృత దాడిగా సిపిఐ(ఎం) ఎమ్మెల్యే తరిగామి అభివర్ణించారు. ఏడేళ్లు గడిచినా, రాజకీయ కార్యకలాపాలు, ప్రజాస్వామ్యం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛపైన కఠినమైన ఆంక్ష‍లు, అణచివేత చర్యలు కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు.

విచిత్రమైన పరిణామం ఏమిటంటే .. ఈ అణచివేతను బిజెపి ప్రభుత్వం తాము సాధించిన అత్యంత గొప్ప విజయాలలో ఒకటిగా ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. వ్యతిరేకతను వ్యక్తం చేసే అవకాశాన్ని, పత్రికా స్వేచ్ఛను అణచివేయడానికి ప్రభుత్వం ఇప్పటికీ కఠినమైన, బలవంతపు చర్యలు చేపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్టికల్‌ 370 రద్దు ప్రకటనను గుర్తు చేసుకుంటూ జమ్ముకాశ్మీర్‌ ఒమర్‌ అబ్దుల్లా మాట్లాడుతూ.. ఏడేళ్లయినా తాము మర్చిపోలేమని అన్నారు. ఇప్పటికీ పరిస్థితులను అంగీకరించలేని స్థితిలో ఉన్నామని అన్నారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేసి కేంద్రం తమ హక్కులను, తమ గుర్తింపును లాక్కుందని మండిపడ్డారు. పలువురు ఎన్‌సి నేతలు కూడా ఆందోళనలు చేపట్టారు. శ్రీనగర్‌లోని పార్టీ ప్రధానకార్యాలయం ఎదుట సీనియర్‌ నేత సకీనా ఇటూ ఆందోళన చేపట్టారు.

ప్రత్యేక హోదాను పునరుద్ధరించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఆగస్టు 5వ తేదీ ఎప్పటికీ తమకు ‘బ్లాక్‌ డే’ అని మరో ఎన్‌సి ఎమ్మెల్యే అషన్‌ పరదేశి పేర్కొన్నారు. కాలం గడుస్తున్న కొద్దీ, తమ రోజులు గడుస్తున్నాయని, తమ డిమాండ్‌ ఇంకా బలంగా రూపుదిద్దుకుందని ఎన్‌సి మంత్రి జావేద్‌ రానా అన్నారు. ఆరోజులను ఎప్పటికీ మర్చిపోలేము, అంగీకరించనూ లేమని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గౌరవం, ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగ హామీ, ప్రజల విశ్వాసాన్ని తిరిగి చట్టబద్ధంగా, శాంతియుతంగా పునరుద్ధరించాలని కోరుకుంటున్నామని అన్నారు.

తమ సందేశం స్పష్టమైందని పిడిపి అధ్యక్ష‍ురాలు మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. కృత్రిమంగా నెలకొల్పిన సాధారణ పరిస్థితులు, కల్పితంగా అల్లిన కథనాలు జమ్మూ-కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలను చెరిపివేయలేవని అన్నారు. గౌరవం, న్యాయం, ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం తమ డిమాండ్ ఎప్పటికీ బలంగా ఉంటుందని అన్నారు. పిడిపి పిలుపు మేరకు జిల్లాల వారీగా పలువురు నేతలు ఆందోళనలు చేపట్టారు. పలువురు పిడిపి నేతలపై గృహనిర్బంధం విధించారని పిడిపి పేర్కొంది. పోలీసు స్టేషన్‌లో నిర్బంధించిన, గృహనిర్బంధం విధించిన నేతల వీడియోను పిడిపి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -