నవతెలంగాణ-హైదరాబాద్ : విదేశీ ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ నందన, గడువు కంటే ఒకరోజు ముందే మరోసారి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో మంగళవారం సాయంత్రం అధికారులు ఆమెను విచారించారు. వాస్తవానికి, ఆమె సెప్టెంబర్ 16వ తేదీలోగా విచారణకు హాజరుకావాల్సి ఉండగా, ఒకరోజు ముందుగానే న్యాయవాదులతో కలిసి రావడం గమనార్హం.
సుమారు మూడు గంటల పాటు కొనసాగిన ఈ విచారణలో పోలీసులు ఆమెకు 20 ప్రశ్నలు సంధించారు. కన్సల్టెన్సీ వ్యవహారాలన్నీ తన భర్త పర్యవేక్షించేవారని, ఆ లావాదేవీలతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆమె పోలీసులకు తెలిపినట్లు సమాచారం. తనపై జారీ చేసిన లుక్ అవుట్ నోటీసులను ఉపసంహరించుకోవాలని ఆమె ఈ సందర్భంగా పోలీసులను కోరారు. విచారణకు తాము పూర్తిస్థాయిలో సహకరిస్తామని ఆమె హామీ ఇవ్వగా, ఆ విన్నపాన్ని పరిశీలిస్తామని పోలీసులు వెల్లడించారు.
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామనే నెపంతో నందన, ఆమె భర్త పలువురిని మోసం చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆ దంపతులిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లగా, ఆంధ్రప్రదేశ్ పోలీసులు వారిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు.
ఇటీవల బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో విదేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న నందనను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె పాస్పోర్ట్, వీసా తనిఖీ చేసిన అధికారులు, ఆమెపై ఎల్ఓసీ ఉన్నట్లు గుర్తించి వెంటనే ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందించి అప్పగించారు. ఆ సమయంలో ఆమెను ప్రాథమికంగా విచారించి, మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆమె నిర్దేశిత గడువు కంటే ముందే పోలీసుల విచారణకు హాజరయ్యారు.



