Wednesday, September 16, 2026
E-PAPER
Homeజాతీయంకాంగ్రెస్‌లో సంస్థాగత ప్రక్షాళనకు కసరత్తు

కాంగ్రెస్‌లో సంస్థాగత ప్రక్షాళనకు కసరత్తు

- Advertisement -

​ఏఐసీసీ కార్యదర్శులతో రాహుల్‌, వేణుగోపాల్‌ భేటీ
​రాష్ట్రాలపై పట్టు పెంచుకునే వ్యూహం
​పార్టీ బలోపేతంపై అధిష్టానం దృష్టి

​నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
​ కాంగ్రెస్‌ పార్టీలో సంస్థాగత ప్రక్షాళనకు కసరత్తు ప్రారభమైంది. వరుస పరాజయాలు, రాష్ట్రాల్లో బలహీనపడుతున్న పార్టీ యంత్రాంగం, రానున్న ఎన్నికల నేపథ్యంలో అధిష్టానం సంస్థాగత వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరించే పనిలో పడింది. అందులో భాగంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ మంగళవారం నాడిక్కడ 10 జనపథ్ లో ఏఐసీసీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. రాష్ట్రాల వారీగా పార్టీ పరిస్థితి, సంస్థాగత నిర్మాణం, నాయకత్వ పనితీరు, క్షేత్రస్థాయిలో పార్టీకి ఎదురవుతున్న సమస్యలపై సమీక్షించినట్టు సమాచారం.

​ మార్పుల వెనుక వ్యూహం
​ ఇటీవల కాంగ్రెస్‌ అధిష్టానం చేపట్టిన వరుస నియామకాలు పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగానే కనిపిస్తున్నాయి. పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జిలను నియమించడంతోపాటు, ఇప్పటికే సంస్థాగత బాధ్యతలు నిర్వహించిన నేతలకు మరింత కీలకమైన బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా నిరంతరం ప్రజల్లో ఉండేలా పార్టీ వ్యవస్థను రూపొందించాలన్న లక్ష్యంతో నాయకత్వం ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సచిన్‌ పైలట్‌కు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పంజాబ్‌ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించగా, గతంలో ఆ బాధ్యతలు నిర్వహించిన భూపేష్‌ బఘేల్‌ను అసోం ఇన్‌చార్జిగా నియమించారు. రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలాకు గుజరాత్‌ బాధ్యతలు అప్పగించారు. కర్నాటక అదనపు బాధ్యతలను ఆయన కొనసాగించనున్నారు. సుఖ్‌దేవ్‌ భగత్‌కు ఛత్తీస్‌గఢ్‌, సిరివెళ్ల ప్రసాద్‌కు మహారాష్ట్ర, పివి మోహన్‌కు ఆంధ్రప్రదేశ్‌ బాధ్యతలు అప్పగించారు.

​ క్షేత్రస్థాయిలో పార్టీని కదిలించే ప్రయత్నం
​ ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే ప్రచార రాజకీయాలను దాటి, గ్రామస్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడమే కాంగ్రెస్‌కు ప్రధాన సవాలు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ కార్యదర్శులతో జరిగిన సమావేశంలో క్షేత్రస్థాయి పార్టీ కార్యకలాపాలు, రాష్ట్రాల వారీగా సంస్థాగత పరిస్థితి, పార్టీ శ్రేణుల సమన్వయం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఏఐసీసీ కార్యదర్శి బివి శ్రీనివాస్‌ను కాంగ్రెస్‌ సేవాదళ్‌ చీఫ్‌ ఆర్గనైజర్‌గా నియమించడం కూడా సంస్థాగత వ్యవస్థను చురుగ్గా మార్చే ప్రయత్నంలో భాగంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సంజయ్‌ దత్‌కు హర్యానా బాధ్యతలు అప్పగించారు.

​​ఎన్నికలే లక్ష్యంగా పునర్వ్యవస్థీకరణ
​రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాల్లో పార్టీకి రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా నిలిచే సామర్థ్యాన్ని పెంచుకోవడం కాంగ్రెస్‌ ముందున్న ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. పార్టీ యంత్రాంగాన్ని క్రియాశీలం చేయడం, ప్రజా సమస్యలను రాజకీయంగా ముందుకు తీసుకెళ్లడం, ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడం, పార్టీ శ్రేణులను ఉద్యమాల వైపు మళ్లించడం వంటి అంశాలపై అధిష్టానం దృష్టి సారించినట్లు సమాచారం. ఇటీవల కొందరు ఏఐసీసీ కార్యదర్శులకు రాజ్యసభ అవకాశాలు కల్పించడం కూడా నాయకత్వం సంస్థాగతంగా పనిచేస్తున్న నేతలకు ప్రాధాన్యత ఇస్తున్న సంకేతంగా భావిస్తున్నారు. ప్రణవ్‌ ఝా, క్రిస్టోఫర్‌ తిలక్‌, మన్సూర్‌ అలీ ఖాన్‌ పేర్లు ఈ సందర్భంగా తెరపైకి వచ్చాయి.

​సామాజిక సమీకరణలపై దృష్టి
తాజా నియామకాల్లో సామాజిక ప్రాతినిధ్యానికి కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. వివిధ సామాజిక వర్గాలకు చెందిన నాయకులను కీలక రాష్ట్రాల బాధ్యతల్లోకి తీసుకురావడం ద్వారా ఆయా వర్గాల్లో పార్టీకి ఉన్న దూరాన్ని తగ్గించుకోవాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సంస్థాగత మార్పులు కేవలం పదవుల మార్పిడిగా కాకుండా పార్టీ సామాజిక పునాదిని విస్తరించే ప్రక్రియగా ఉండాలని నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.

​​మరిన్ని మార్పులకు సంకేతాలు?
​తాజా సమావేశంతో కాంగ్రెస్‌లో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రాల వారీగా పనితీరును సమీక్షించి, అవసరమైన చోట నాయకత్వ మార్పులు, కొత్త బాధ్యతలు, సంస్థాగత పునర్‌వ్యవస్థీకరణ చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే నాయకత్వ మార్పులతో మాత్రమే పార్టీకి పూర్వ వైభవం వస్తుందా? లేక క్షేత్రస్థాయిలో నిరంతర రాజకీయ పోరాటం, ప్రజా సమస్యలపై ఉద్యమాలు, బలమైన సంస్థాగత నిర్మాణం అవసరమా? అన్నది కాంగ్రెస్‌ ముందున్న అసలు సవాలు. తాజా సమావేశాలు ఈ సవాలును అధిగమించేందుకు అధిష్టానం చేస్తున్న కసరత్తుకు సంకేతంగా కనిపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -