ఇరాన్ యుద్ధంతో సైనిక, ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం : పెంటగాన్ నివేదిక
అధునాతన క్షిపణులు, ఇంటర్‌సెప్టర్లను తిరిగి సమకూర్చుకునేందుకు
అమెరికా రక్షణరంగ సంస్థలకు కనీసం మూడేండ్లు పడుతుందని వెల్లడి
వాషింగ్టన్ : ఇరాన్‌ను చావుదెబ్బ కొట్టామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు గొప్పలు చెప్పినప్పటికీ టెహ్రాన్‌పై ఆ ప్రభావం ఎంతుందో తెలియదు కానీ అగ్రరాజ్యంపై మాత్రం తీవ్రంగానే ఉందని తెలుస్తోంది. ఇరాన్ యుద్ధం వల్ల అమెరికా సైనిక, ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడినట్టు పెంటగాన్ నివేదిక వెల్లడించింది. అధునాతన ఆయుధాల కొరత ఏర్పడటమే కాకుండా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలకు భారీ నష్టం వాటిల్లిందని తేల్చింది. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30వరకు జరిగిన పరిణామాలపై పెంటగాన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఓ నివేదిక రూపొందించారు. రక్షణ, విదేశాంగ శాఖలు, ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీలు వెల్లడించిన విషయాలను అందులో పేర్కొన్నారు. గల్ఫ్ దేశాల్లో ఆస్తి నష్టం 184 మిలియన్ డాలర్లు కాగా, దౌత్యపరమైన ఖర్చుల కోసం 113 మిలియన్ డాలర్లు, అత్యవసర చర్యల కోసం 80 మిలియన్ డాలర్లు వెచ్చించినట్టు తెలిపింది. గల్ఫ్, ఐరోపా దేశాల్లో అమెరికన్లను స్వదేశానికి తరలించేందుకు 11 మిలియన్ డాలర్లు ఖర్చయినట్టు పేర్కొంది. ఇరాన్ యుద్ధం కోసం మొత్తంగా 37.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్టు జులైలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. అదే విధంగా గల్ఫ్‌లోని అమెరికా సైనిక, దౌత్య కార్యాలయాలపై ఇరాన్ దాడుల తీవ్రత కూడా ఎక్కుగానే ఉన్నట్టు పెంటగాన్ నివేదిక స్పష్టం చేసింది.
కువైట్, బహ్రెయిన్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాక్, ఒమన్, జోర్డాన్ దేశాల్లోని అమెరికా స్థావరాల్లో ఉన్న వందలాది భవనాలు ధ్వంసమైనట్లు తెలిపింది. డజన్లకొద్దీ అమెరికా విమానాలు, డ్రోన్లు దెబ్బతిన్నట్లు పెంటగాన్ నివేదిక స్పష్టం చేసింది. యుద్ధం మొదలైన తర్వాత పశ్చిమాసియా, యూరప్ దేశాల నుంచి 9 వేలమంది అమెరికన్లను ట్రంప్ సర్కార్ స్వదేశానికి తరలించింది. ఈ ఆపరేషన్ కోసం జూన్ నాటికి 11 మిలియన్ డాలర్లకుపైగా ఖర్చు చేసింది. భారత కరెన్సీలో ఆ మొత్తం రూ. 105 కోట్లతో సమానం. ప్రయాణ ఖర్చులకు సంబంధించిన పత్రాలు సేకరించటం ఆచరణ సాధ్యంకానందున ఆ మొత్తాన్ని ప్రజల నుంచి వసూలు చేయబోమని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.మరోపక్క ఇరాన్ యుద్ధం కారణంగా అమెరికా వద్ద ఉన్న అధునాతన ఆయుధాల నిల్వలు కూడా భారీగా తగ్గిపోయినట్లు పెంటగాన్ వేదిక తెలిపింది. ఆయుధాల తయారీ, సరఫరాలో ఉన్న లోపాలను బట్టబయలు చేసింది. యుద్ధానికి ముందు ఉన్న స్థాయిలో అధునాతన క్షిపణులను, ఇంటర్‌సెప్టర్లను తిరిగి సమకూర్చుకోవటానికి అమెరికా రక్షణరంగ సంస్థలకు కనీసం మూడేండ్లు పడుతుందని సైనిక నిపుణులు అంచనావేశారు. మిత్ర దేశాలకు ఆయుధాలు సరఫరా చేస్తూనే తమ సైనిక సంసిద్ధతను చాటుకోవటం ఇప్పుడు వాషింగ్టన్‌కు పెద్ద సవాల్‌గా మారింది.



