Wednesday, September 16, 2026
E-PAPER
Homeఆటలుఛాంపియన్‌‌ జ్వెరెవ్‌

ఛాంపియన్‌‌ జ్వెరెవ్‌

- Advertisement -

కెరీర్‌ రెండో గ్రాండ్‌‌స్లామ్‌ 
టైటిల్‌ వశం
ఫైనల్లో బెన్‌ షెల్టన్‌‌పై ఘన విజయం
యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌‌స్లామ్‌ 2026

న్యూయార్క్‌ (‌యుఎస్‌ఏ) : యుఎస్‌ ఓపెన్‌‌కు కొత్త ఛాంపియన్‌. మహిళల సింగిల్స్‌‌లో ఎలెనా రిబకినా తొలిసారి ‌ఛాంపియన్‌‌గా అవతరించగా, పురుషుల సింగిల్స్‌‌లోనూ నయా చాంపియన్‌ ‌వచ్చాడు. టాప్‌ సీడ్‌, జర్మనీ స్టార్‌ అలెగ్జాండర్‌ ‌జ్వెరెవ్‌ ‌మెన్స్‌ ‌సింగిల్స్‌ ‌విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన టైటిల్‌ ‌పోరులో అమెరికా ఆటగాడు, ఎనిమిదో సీడ్‌ ‌బెన్‌ ‌షెల్టన్‌‌పై అలెగ్జాండర్‌ ‌జ్వెరెవ్‌ 6-3, 7-6(7-2), 5-7, 6-2తో ఘన విజయం సాధించాడు. నాలుగు సెట్ల పోరులో అలెగ్జాండర్‌ ‌జ్వెరెవ్‌ ఆరంభం నుంచి ఛాంపియన్‌ ఆటతీరు కనబరిచాడు. తొలిసారి గ్రాండ్‌‌స్లామ్‌ ‌టోర్నమెంట్‌ ‌ఫైనల్‌‌కు చేరుకున్న బెన్‌ ‌షెల్టన్‌ ‌రన్నరప్‌‌తో సరిపెట్టుకున్నాడు. కెరీర్‌ ‌రెండో గ్రాండ్‌‌స్లామ్‌ ‌టైటిల్‌ ‌సాధించిన జ్వెరెవ్‌‌కు.. ఈ ఏడాదిలో ఇది రెండో విజయం. ఈ ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ ‌విజయంతో జ్వెరెవ్‌ ‌గ్రాండ్‌‌స్లామ్‌ ‌టైటిళ్ల ఖాతా తెరిచిన సంగతి తెలిసిందే.

​జ్వెరెవ్‌ ‌జయహో..
గ్రాండ్‌‌స్లామ్‌ ‌టైటిల్స్‌ ‌నెగ్గని ప్రతిభావంతుడు’గా అలెగ్జాండర్‌ ‌జ్వెరెవ్‌‌పై టెన్నిస్‌ ‌వర్గాల్లో ఓ ముద్ర పడింది. రోజర్‌ ‌ఫెడరర్‌, రాఫెల్‌ ‌నాదల్‌, నొవాక్‌ ‌జకొవిచ్‌ ‌త్రయం జోరులో పెద్దగా వెలుగులోకి రాని జ్వెరెవ్‌.. ఆ తర్వాత అల్కరాస్, సినర్‌ ‌దూకుడుతో వెనుకంజ వేశాడు. ఈ ఏడాది ఏకంగా మూడు గ్రాండ్‌‌స్లామ్స్‌‌లో ఫైనల్‌‌కు చేరిన జ్వెరెవ్‌ ‌రెండు టైటిల్స్‌‌తో సత్తా చాటాడు. గతంలో జ్వెరెవ్‌ ‌మూడు సార్లు గ్రాండ్‌‌స్లామ్ ఫైనల్స్‌‌కు చేరినా.. టైటిల్‌‌కు అడుగు దూరంలో ఆగిపోయాడు. ఆదివారం న్యూయార్క్‌‌లో పురుషుల సింగిల్స్‌ ‌ఫైనల్లో జ్వెరెవ్‌ ‌ఫేవరేట్‌‌గా బరిలోకి దిగాడు. ప్రత్యర్థి తొలిసారి ఫైనలిస్ట్‌ ‌కావటంతో.. జ్వెరెవ్‌ అనుభవంతో పాటు వరల్డ్‌ ‌క్లాస్‌ ఆటతీరుతో పైచేయి సాధించాడు. తొలి సెట్లోనే బ్రేక్‌ ‌సాధించిన జ్వెరెవ్‌ 6-3‌తో ముందంజ వేశాడు. రెండో సెట్లో షెల్టన్‌ ‌నుంచి ప్రతిఘటన ఎదురైనా.. టైబ్రేకర్‌‌లో 7-2తో జ్వెరెవ్‌‌దే పైచేయిగా నిలిచింది. కీలక మూడో సెట్లో షెల్టన్‌ ‌పుంజుకున్నాడు. జ్వెరెవ్‌ ‌సర్వ్‌‌ను బ్రేక్‌ ‌చేసి 7-5తో సెట్‌‌ను సొంతం చేసుకున్నాడు. కానీ నాల్గో సెట్లో మరోసారి పైచేయి సాధించిన జ్వెరెవ్‌ 6-2తో నాల్గో సెట్‌‌తో పాటు యుఎస్‌ ఓపెన్‌‌ గ్రాండ్‌‌స్లామ్‌‌ను ఎగరేసుకుపోయాడు. అలెగ్జాండర్‌ ‌జ్వెరెవ్‌ 9 ఏస్‌‌లు, నాలుగు బ్రేక్‌ ‌పాయింట్లు సాధించగా.. బెన్‌ ‌షెల్టన్‌ 10 ఏస్‌‌లు, ఓ బ్రేక్‌ ‌పాయింట్‌‌తో సరిపెట్టుకున్నాడు. పాయింట్ల పరంగా 125-113తో జ్వెరెవ్‌ ఆధిపత్యం చూపించాడు. జ్వెరెవ్‌ 24 గేములు గెలుపొందగా, షెల్టన్‌ 18 గేములే నెగ్గాడు.

​ఛాంపియన్‌ ‌భావోద్వేగం
యుఎస్‌ ఓపెన్‌ ‌టైటిల్‌ ‌సాధించిన అనంతరం అలెగ్జాండర్‌ ‌జ్వెరెవ్‌ ‌భావోద్వేగానికి లోనయ్యా డు. నాలుగేండ్ల వయసులోనే మధుమే హంతో బాధపడుతున్న తనని.. తన తల్లి ఏ విధంగా చాంపియన్‌‌గా తీర్చిదిద్దిందో జ్వెరెవ్‌ ‌గుర్తు చేసుకున్నాడు. ‘4 ఏండ్ల కొడుకు డయాబెటిస్‌‌తో బాధపడుతున్నాడు. సాధారణ జీవితం, స్పోర్ట్స్‌ ఆ పిల్లవాడికి ఎంతో పరిమితమని వైద్యులు చెప్పారు. అయినా, నా కొడుకు టెన్నిస్‌ ‌ప్లేయర్‌ ‌కావాలని అనుకుంటే, టెన్నిస్‌ ‌ప్లేయర్‌ అవుతాడు. జీవితంలో ఇంకేదైనా సాధించాలని అనుకుంటే అదీ సాధిస్తాడు అనే దీమాతో అమ్మ నన్ను పెంచింది. వెన్నంటి నిలిచి టెన్నిస్‌ ‌ప్లేయర్‌‌గా, గ్రాండ్‌‌స్లామ్‌ ‌చాంపియన్‌‌గా నిలబెట్టింది’ అని జ్వెరెవ్‌ ‌కన్నీటి పర్యంతమవుతూ తన విజయంలో అమ్మ పాత్రను అభిమానులతో పంచుకున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -