సీఎం, నేను సమన్వయంతో పని చేస్తున్నాం..
గాంధీ భవన్ నుంచి గ్రామస్థాయి వరకు పార్టీని బలోపేతం చేస్తున్నాం రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తాం
కొండా సురేఖను ఎందుకు బర్తరఫ్ చేశామో అందరికీ తెలుసు : ‘నవతెలంగాణ’తో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ సారధిగా తాను… జోడెడ్లలా కలిసి పని చేస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. సీఎంకు, తనకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆర్నెల్ల తర్వాత తాను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించానని, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏఐసీసీ రాష్ట్ర ఇంఛార్జీలైన దీపాదాస్ మున్షీ, మీనాక్షి నటరాజన్ లు తనకు ఎంతగానో సహకరించారని తెలిపారు. వారిచ్చిన ప్రోత్సాహంతో గాంధీ భవన్ నుంచి గ్రామస్థాయి వరకు పార్టీని బలోపేతం చేస్తున్నామని వివరించారు. పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టి మంగళవారం నాటికి రెండేండ్లు పూర్తయ్యయి. ఈ సందర్భంగా ఆయన నవతెలంగాణ బ్యూరో చీఫ్ బి.వి.యన్.పద్మరాజుతో పలు అంశాలపై ముచ్చటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను సంస్థాగతంగా బలోపేతం చేయటం, పార్టీ బలాలు, బలహీనతలు, జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ)ల నియామకం, మంత్రివర్గ విస్తరణ, రెండున్నరేండ్లలో ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు, కొండా సురేఖ బర్తరఫ్ తదితరాంశాలను ఆయన ఈ సందర్భంగా ఏకరువు పెట్టారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే… ‘నేను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి రెండేండ్లు పూర్తయింది. ఈ రెండేండ్ల ప్రయాణం ఎంతో ఉత్సాహంగా, సంతృప్తికరంగా సాగింది. వాస్తవానికి పీసీసీ అధ్యక్ష పదవి అనేది భాద్యత కంటే ఎక్కువ. ఆ బాధ్యతను నా శాయశక్తులా నెరవేరుస్తున్నాను. ఈ క్రమంలో గాంధీ భవన్తో బూత్ స్థాయి వరకు క్యాడర్ ను కనెక్ట్ చేయగలిగాం. ఏ పిలుపునకు సంబంధించి అయినా ఒక్క మెసేజ్ కొడితే చాలు.. లక్షలాది మందికి చేరేలా ప్రణాళికలు రూపొందించాం…’
మా ఇద్దరి మధ్య ఎంతో సఖ్యత…
‘సీఎం రేవంత్ రెడ్డికి, నాకు మధ్య గొడవ జరిగిందనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. మా ఇద్దరి మధ్య సఖ్యత ఎంతో బాగుంది. ఏ పార్టీలోనైనా భిన్నాభిప్రాయాలు సహజమే. సీఎంతో ఏ విషయంలోనైనా అభిప్రాయ బేధాలు వస్తే.. వాటిపై మాట్లాడుకుని సాయంత్రానికల్లా సరిచేసుకుంటాం. పార్టీకి సంబంధించిన ఏ విషయంలోనూ ముఖ్యమంత్రి ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు…’
అదో మైలురాయి…
‘దేశంలో ఏ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేపట్టని విధంగా మేం టీపీసీసీ ఆధ్వర్యాన హైదరాబాద్లోని గాంధీ భవన్లో ప్రతీ వారం మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది రాష్ట్ర కాంగ్రెస్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. దీనిపై కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా ఆరా తీసి, ప్రశంసించారు. ముఖాముఖి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి.. సంబంధిత మంత్రులు, శాఖలకు పంపుతున్నాం. వాటిలో చాలా వరకు పరిష్కారమవుతున్నాయి…’
అదే మా ఇద్దరి లక్ష్యం…
‘దేశంలో ఇప్పుడు ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. రాజ్యంగా విలువలు ధ్వంసమవుతున్నాయి. అందువల్ల వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కచ్చితంగా గెలిచి తీరాలి. అలా గెలిచిన తర్వాత మా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నది మా ఇద్దరి (రేవంత్ రెడ్డి, మహేశ్ కుమార్) లక్ష్యం. దాన్ని సాధించాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ కచ్చితంగా 15 ఎంపీ సీట్లు గెలవాలి. ఆ విధంగా గెలిపించటమే మా లక్ష్యం…’
నా హయాంలోనే కులగణన…
‘నేను పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టాం. ఇది నాకు సంతృప్తికరమైన అంశం. గతంలో కర్ణాటక,బీహార్ రాష్ట్రాల్లో కుల సర్వే చేసినా వాటిని టేబుల్ చేయలేదు. కానీ తెలంగాణలో కుల గణన పూర్తి చేసి, సంబంధిత నివేదికను కేంద్రానికి పంపాం. కానీ మోడీ సర్కార్ దాన్ని తొక్కిపట్టింది…’
ఆ బాధ నిజమే…
‘ఇన్ని చేసినా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను భర్తీ చేయలేకపోయాం. కార్పొరేషన్ పదవులను సకాలంలో నింపలేకపోయాం. పదేండ్లపాటు పార్టీ జెండా మోసి, కష్టపడిన వారికి పదవులు కట్టబెట్టలేదనే బాధ వెంటాడుతూనే ఉంది. అయితే సాధ్యమైనంత త్వరగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను భర్తీ చేస్తాం. డిసెంబరు నాటికి నామినేటెడ్, కార్పొరేషన్ పదవులను భర్తీ చేస్తాం. ఆ మేరకు కసరత్తులు చేస్తున్నాం…’
క్రమశిక్షణే కీలకం…
‘కాంగ్రెస్ లో అన్నిస్థాయిల్లోని నాయకులు, కార్యకర్తలకు పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఉంటాయి. కానీ వాటిని దుర్వినియోగం చేయకూడదు. అన్నింటికంటే ఇక్కడ క్రమశిక్షణే కీలకం. అది ఉల్లంఘించినందుకే కొండా సురేఖను అధిష్టానం బర్తరఫ్ చేసింది. అయితే ఒక బీసీ బిడ్డను తొలగించినందుకు నేను బాధపడ్డ మాట వాస్తవం. కానీ అలా ఆమెను ఎందుకు బర్తరఫ్ చేయాల్సి వచ్చిందో అందరికీ తెలిసిన విషయమే…’
ఆ డ్యామేజ్ నిజమే…
‘22-ఏ అంశంపై ఎవరు పడితే వారు స్పందించొద్దనే ఆదేశాలున్నాయి. అందుకే సీఎం, రెవెన్యూ మంత్రితోపాటు నేను మాత్రమే దానిపై స్పందిస్తున్నాం. దానికి సంబంధించిన పూర్వాపరాలన్నీ ఒక్కోటిగా బయటకు వస్తున్నాయి. ఇది మా ప్రభుత్వం తెచ్చిందేమీ కాదు. 30 ఏండ్ల క్రితం నుంచే అది మనుగడలో ఉంది. అయితే నిషేధిత భూముల విషయంలో ప్రజలు భయాందోళనలకు గురైన మాట వాస్తవమే. దీంతో ప్రభుత్వానికి, పార్టీకి డ్యామేజ్ జరిగిన మాట వాస్తవమే…’
అది వాస్తవమే…
‘ప్రభుత్వపరంగా మేం చేసింది కూడా చెప్పుకోలేకపోతున్న మాట వాస్తవమే. ఈ విషయంలో వెనుబడిపోయాం. కానీసోషల్ మీడియాను నెగిటివ్ గా వాడటంలో బీఆర్ఎస్,బీజేపీ ముందు వరుసలో ఉన్నాయి. తద్వారా ఆ రెండు పార్టీలు ప్రభుత్వం మీద బురదజల్లుతున్నాయి. అయితే కేవలం సోషల్ మీడియా ఆధారంగానే ప్రజల మనసులను గెలుచుకోలేం. సామాజిక మాధ్యమాల్లో బీ.ఆర్.ఎస్, బీజేపీ చేస్తున్న విమర్శలకు జవాబివ్వటానికి మేం సిద్ధంగా ఉన్నాం. సంక్షేమ పథకాలపై చర్చకు రావాలంటూ ఆ రెండు పార్టీలకు నేను సవాల్ విసరుతున్నా. కేసీఆర్ హయాంలో రూ.8 లక్షల కోట్ల అప్పు చేశారు. ఆ పదేండ్లలో ఒక్క రేషన్ కార్డూ ఇవ్వలేదు. వీటన్నింటినీ మేం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి…’
ఎమ్మెల్యేగా పోటీ చేస్తా…
‘వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఎమ్మెల్యేగా, అదీ నిజామాబాద్ జిల్లా నుంచే పోటీ చేస్తా. నన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారంటూ చాలా మంది మాట్లాడుతున్నారు. నాకు నేనుగా అనుకుంటే మంత్రిని, డిప్యూటీ సీఎంను కాను. ఆ విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్. ప్రస్తుతం సీఎంగా రేవంత్ రెడ్డి సమర్ధవంతంగా భాద్యతలు నిర్వరిస్తున్నారు. కానీ భవిష్యత్తులో తెలంగాణకు ఒక బీసీ సీఎం అయ్యే అవకాశం మాత్రం కాంగ్రెస్ లోనే సాధ్యమవుతుంది. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కావడానికి 40 ఏళ్ళు పట్టింది. ఇక్కడ ఓపిక, సహనం చాలా అవసరం…’
మేమే నెంబర్వన్…
‘ఏఐసీసీ ఇచ్చే కార్యక్రమాలను అమలు చేయడంలో టీపీసీసీ మొదటి స్థానంలో నిలిచింది. అమిత్ షా అంబేద్కర్ ను అవమానిస్తే జై బాపూ జై సంవిధాన్ కార్యక్రమాలను చేపట్టాం. గతానికి భిన్నంగా ఏఐసీసీ పరిశీలకుల ద్వారానే డీసీసీ అధ్యక్షులను ఎన్నుకున్నాం. నూతనంగా ఎన్నికైన డీసీసీ అధ్యక్షులకు 11 రోజుల పాటు శిక్షణా తరగతులను నిర్వహించాం. ఈ సమయంలోనే జరిగిన కంటోన్మెంట్,జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు బావుటా ఎగరేసింది. ఇవన్నీ పీసీసీ చీఫ్ గా నాకు సంతృప్తినిచ్చే అంశాలు…’



