నాడు జీఎస్టీ.. నేడు యూపీఐ
రూ. 2వేలు దాటితే
యూపీఐ లావాదేవీలపై త్వరలో
చార్జీల వసూలుకు కేంద్రం సన్నద్ధం
బ్యాంకర్లతో కమిటీ ఏర్పాటు
నాడు..వినియోగదారులపై ఎలాంటి భారాలు పడవంటూ జీఎస్టీని తెరపైకి తెస్తున్నప్పుడు మోడీ సర్కార్ బుకాయించింది. అంతా ఉత్పత్తి చేసే కంపెనీ యాజమాన్యమే భరిస్తుందనటంతో దేశ ప్రజలు గుడ్డిగా నమ్మారు. కానీ జరిగిందేంటీ..? యాజమాన్యంతో కేంద్రం లాలూచీ పడింది. జీఎస్టీ భారమంతా వినియోగదారుని నెత్తిన రుద్దేసింది. అచ్చం అదే విధంగా ఇప్పుడు యూపీఐ లావాదేవీలపైనా కేంద్రం ఇలాంటి ఎత్తుగడే వేస్తున్నది. డిజిటల్ చెల్లింపుల రూపంలో వేలకోట్ల లావాదేవీలు జరుగుతుండడంతో.. వినియోగదారులను బాదేసి ఖజానా నింపుకుందామనే ఆలోచన చేసింది. ఉపాధి, ఆదాయాల్లేక నానా ఇబ్బందులు పడుతున్న జనాన్ని పీల్చిపిప్పి చేసేలా చార్జీల భారాన్ని అమల్లోకి తేనున్నది. మరోవైపు ఈ నిర్ణయం అమెరికా ఒత్తిడి మేరకే చేపడుతున్నట్టు స్పష్టమవుతోంది.
న్యూఢిల్లీ : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగే పలు డిజిటల్ చెల్లింపులపై ఇప్పటివరకు ఉన్న ఉచిత విధానానికి మోడీ సర్కార్ స్వస్తి చెప్పాలని నిర్ణయించింది. రూ.2,000 కంటే తక్కువ మొత్తంలో జరిగే లావాదేవీలకు ఎటువంటి చార్జీలు ఉండవని చెబుతున్నప్పటికీ.. అంతకంటే ఎక్కువ మొత్తంలో జరిగే వ్యాపార చెల్లింపులపై (పీ2ఎం), మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) లేదా ప్రాసెసింగ్ చార్జీలను ప్రవేశపెట్టేందుకు చట్టపరమైన మార్గం సుగమం చేస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పార్లమెంటులో ఇటీవల ‘టాక్సేషన్ అండ్ అదర్ లాస్ (అమెండ్మెంట్) బిల్లు-2026’ ద్వారా ‘పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్-2007’లోని సెక్షన్ 10ఎకు సవరణ చేశారు. దీని ప్రకారం రూ.2,000 వరకు చేసే యూపీఐ, రూపే డెబిట్ కార్డ్ చెల్లింపులకు ఎలాంటి చార్జీలు వర్తించవు. అయితే ఈ పరిమితిని దాటిన వ్యాపార లావాదేవీలపై చార్జీలు విధించేందుకు వెసులుబాటు కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, వివిధ సంఘాల ప్రతినిధులతో కూడిన 22 మంది సభ్యుల ‘యూపీఐ అండ్ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ’ త్వరలోనే సమావేశమై తుది నిర్ణయం తీసుకోనుందని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం దేశంలో 55 కోట్లకు పైగా ప్రజలు యూపీఐని ఉపయోగిస్తున్నారు. జులై 2026 ఒక్క నెలలోనే ఏకంగా 2,366 కోట్ల లావాదేవీలు జరిగి రూ. 29.9 లక్షల కోట్ల విలువైన బదిలీలు నమోదయ్యాయి.
ట్రంప్ ఒత్తిడికి తలొగ్గిన మోడీ : కాంగ్రెస్
రూ.2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై ఫీజులు లేదా ఎండీఆర్ విధించడానికి కేంద్ర ప్రభుత్వం నిశ్శబ్దంగా మార్గం సుగమం చేసిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా పేమెంట్ కంపెనీల ఒత్తిడికి తలొగ్గి ప్రధాని నరేంద్ర మోడీ భారత్‌లోని జీరో ఎండీఆర్ విధానాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. యూపీఐ లావాదేవీల పరిమాణం పరంగా రూ.2,000 దాటినవి కేవలం 5 శాతమే అయినప్పటికీ.. మొత్తం లావాదేవీల విలువలో అవి దాదాపు 65 శాతం వాటాను కలిగి ఉన్నాయని రాహుల్ గాంధీ వెల్లడించారు. వినియోగదారుల నుంచి నేరుగా చార్జీలు వసూలు చేయకపోయినా.. వ్యాపారులు ఈ భారాన్ని చివరికి పెరిగిన ధరల రూపంలో సాధారణ ప్రజల పైనే రుద్దుతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో పెద్ద నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని, ఇప్పుడు డిజిటల్ చెల్లింపుల పన్ను పేరుతో ప్రజల పొదుపును హరిస్తున్నారని మండిపడ్డారు. రూ.5,000 లావాదేవీలపై రూ.25, రూ.10,000 లావాదేవీలపై రూ.50 వరకు అదనపు భారం పడే అవకాశం ఉందన్నారు. ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కల్పించక పోగా మోడీ ప్రభుత్వం ప్రజల జేబులు ఖాళీ చేయడానికి కొత్త మార్గాలను వెతుకుతోందని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో ఏదైనా ఎండీఆర్ వర్తిస్తే అది కేవలం నిర్దిష్ట వర్గానికి చెందిన పెద్ద వ్యాపార లావాదేవీలపై మాత్రమే ఉంటుందని.. వినియోగదారులు నేరుగా ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి సీతారామన్ పేర్కొన్నారు.
గూగుల్‌పే, ఫోన్‌పేకు భారీగా లబ్ది
భారతదేశపు యూపీఐ మార్కెట్లోనూ అమెరికా సంస్థలైన గూగుల్ పే, వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫోన్‌పే ఇప్పటికే 80 శాతానికి పైగా లావాదేవీలను నియంత్రిస్తున్నాయి. ఏ ఒక్క యాప్ కూడా 30 శాతానికి మించి మార్కెట్ వాటా కలిగి ఉండకూడదన్న ఎన్పీసీఐ నిబంధనను కూడా అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో ఈ నిబంధన అమలును ప్రభుత్వం డిసెంబర్ 2026 వరకు వాయిదా వేస్తూ వచ్చింది. దీనికితోడు డేటా లోకలైజేషన్ నిబంధనలను కూడా అమెరికా కంపెనీలు తప్పుబడుతున్నాయి.
సార్వభౌమత్వానికి దెబ్బ..
భారత ప్రజాధనంతో నిర్మితమైన డిజిటల్ మౌలిక సదుపాయాలలో విదేశీ కంపెనీలు ఇంతటి ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నప్పటికీ.. అమెరికా మాత్రం తమ వీసా, మాస్టర్‌కార్డ్ కంపెనీల లాభాల కోసం భారత్‌పై ఒత్తిడి పెంచుతూనే ఉంది. అమెరికా వాణిజ్య ఒత్తిళ్లకు తలొగ్గి ఉచిత సేవలకు స్వస్తి పలకడం లేదా నిబంధనలను సడలించడం భారత డిజిటల్ సార్వభౌమత్వానికి మంచిది కాదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఒత్తిళ్లకు కాకుండా భారత వినియోగదారులు, వ్యాపారులు, బ్యాంకులు, ఎన్పీసీఐ ప్రయోజనాలను కాపాడేలా కేంద్ర విధానాలు ఉండాలని సూచిస్తున్నారు.
రూ.2,000 దాటితే 0.4 శాతం చార్జీలు
గరిష్టంగా రూ.300 వరకు వసూలు
భారతదేశంలో కోట్లాది మంది వినియోగిస్తున్న యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించాలని కేంద్ర ప్రభుత్వం, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటివరకు పూర్తిగా ఉచితంగా కొనసాగుతున్న యూపీఐ లావాదేవీల విధానంలో కీలక మార్పులు చేస్తూ ఎన్పీసీఐ మంగళవారం ఒక సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం రూ.2,000 కంటే ఎక్కువ మొత్తంలో జరిగే వ్యాపార చెల్లింపులపై 0.4 శాతం మేర మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) వర్తించనుంది. ఈ కొత్త నిబంధనలు వచ్చే నెల అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. రూ.2,000 దాటిన వ్యక్తి నుంచి వ్యాపారికి (పీ2ఎం) చెల్లింపులపై మాత్రమే ఎండీఆర్ చార్జీలు వర్తిస్తాయని ఎన్పీసీఐ తెలిపింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే (పీ2పీ) లావాదేవీలపై చార్జీలుండవు.
యూపీఐ క్యూఆర్ కోడ్ల ద్వారా నెలకు రూ.1 లక్ష వరకు టర్నోవర్ కలిగిన చిన్న వ్యాపారులకు ఈ చార్జీల నుంచి పూర్తి మినహాయింపునిచ్చారు. అలాగే రూ.2,000 లోపు ఉండే అన్ని వ్యాపార చెల్లింపులు, రూపే డెబిట్ కార్డ్ లావాదేవీలు కూడా యథావిధిగా ఉచితంగానే జరగనున్నాయి. ఒకవేళ లావాదేవీల విలువ రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే ఎండీఆర్‌ను గరిష్టంగా రూ.300కు పరిమితం చేశారు. కొన్ని ప్రత్యేక రంగాలకు భిన్నమైన విధానాన్ని ప్రకటించారు. రైల్వేలు, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధన రంగాలు, వ్యవసాయ ముడి సరుకులకు సంబంధించి రూ.2,000 దాటిన లావాదేవీలపై శాతం లెక్క కాకుండా కేవలం రూ.5 ఎండీఆర్ వసూలు చేస్తారు. అలాగే మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీస్, స్టాక్ బ్రోకర్ల చెల్లింపులకు గరిష్టంగా రూ.300 వరకు పరిమితం చేస్తూ కేవలం 0.02 శాతం మాత్రమే ఎండీఆర్ విధించనున్నారు. వసూలైన ఎండీఆర్‌లో 5 శాతాన్ని చిన్న వ్యాపారుల్లో డిజిటల్ సేవలను మరింత విస్తరించేందుకు ప్రత్యేక నిధిగా కేటాయించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
వీసా, మాస్టర్‌కార్డ్ ల కోసమే.. సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్
యూపీఐ, రూపే వ్యవస్థల వల్ల తమ దేశానికి చెందిన విసా, మాస్టర్‌కార్డ్ వంటి దిగ్గజ సంస్థల వ్యాపారం దెబ్బతింటోందని అమెరికా మరో ప్రధాన ఆరోపణ. ఉచిత యూపీఐ సేవలు, రూపే కార్డులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాల వల్ల తమ కార్డ్ నెట్‌వర్క్‌లు భారీగా ఫీజు ఆదాయాన్ని కోల్పోతున్నాయని వాషింగ్టన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బ్రెజిల్ దేశానికి చెందిన ఉచిత చెల్లింపు వ్యవస్థ పిక్స్ పై కూడా అమెరికా ఇలాగే ఒత్తిడి తెచ్చి.. మాట వినకపోవడంతో ఆ దేశ ఉత్పత్తులపై 25 శాతం దాకా అదనపు సుంకాలను విధించిన సంగతి విదితమే. ఆ తరహాలోనే భారత్‌పైనా ఒత్తిడి పెంచుతోందని ఇటీవల సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ ఆందోళన వ్యక్తం చేశారు.



