Wednesday, September 16, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురైతాంగ సమస్యలు పరిష్కరించాలి

రైతాంగ సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -

సాగర్ జలాలు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి
యాప్‌‌ను రద్దు చేసి అన్నదాతలకు సరిపడా యూరియా అందించాలి
మార్క్ ఫెడ్ ద్వారా పెసలు కొనుగోలు చేయాలి : రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌‌రావు డిమాండ్
తహసీల్దార్‌ ‌కార్యాలయం ఎదుట ధర్నా

నవతెలంగాణ-చింతకాని
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సమస్యను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు డిమాండ్ చేశారు. ‌యూరియా యాప్‌‌ను రద్దు చేయాలనీ, మార్క్ ఫెడ్ ద్వారా పెసలు కొనుగోలు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ మంగళవారం ఖమ్మం జిల్లా చింతకానిలో సీపీఐ(ఎం), రైతు సంఘం మండల కమిటీల ఆధ్వర్యంలో తహసీల్దార్‌ ‌కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగంపై ఎనలేని భారాలు మోపుతూ వారి శ్రమను దోచుకుంటూ, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం లేదన్నారు. ఎల్‌‌నినో ప్రభావంతో ఎండుతున్న పంటలకు సాగర్ జలాలు విడుదల చేయకపోవడం సిగ్గుచేటన్నారు. సాగర్‌‌లో 533 అడుగుల నీటిమట్టం ఉన్నప్పటికీ నీళ్లు విడుదల చేయకుండా ఎల్‌‌నినో ప్రభావం.. సాకుతో రైతులను ఈ ప్రభుత్వం మోసం చేస్తోందని తెలిపారు. ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారతదేశం ఆహారం పంటలు పండించడంలో ముందుండేదని, కానీ.. ఇప్పుడున్న ప్రభుత్వాలు ప్రపంచ దేశాల నుంచి ధాన్యాలను దిగుమతి చేసుకునే స్థాయికి దిగజార్చే విధంగా రైతన్నను మోసం చేస్తున్నాయని విమర్శించారు. దేశంలో తెలంగాణ.. వ్యవసాయానికి మొదటి ప్రాముఖ్యత ఇస్తోందని, ఈ సంవత్సరం అన్ని పంటల్లో రాష్ట్రం ముందంజలో ఉందని తెలిపారు.

అందులోనూ ముఖ్యంగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు సుమారు 15 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్నలు పండించారని గుర్తుచేశారు. వాటిని కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించిన ఘనత రైతు సంఘం, సీపీఐ(ఎం)కే దక్కిందన్నారు. యూరియా కట్టలు కావాలంటే యాప్ పేరుతో రైతాంగాన్ని అనేక కష్టాలు పెడుతున్నారని, దాన్ని రద్దు చేసి రైతులకు నేరుగా సొసైటీల ద్వారా అందించేలా చూడాలన్నారు. రైతులు పండించిన పెసలు కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్‌ కరుణశ్రీకి వినతి పత్రం అందజేశారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తహసీల్దార్‌ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్, సీపీఐ(ఎం) మధిర డివిజన్ కార్యదర్శి గోపాల్ రావు, మండల కార్యదర్శి దేశబోయిన ఉపేందర్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వత్సవాయి జానకి రాముడు, రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -