Wednesday, September 16, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుబీజేపీ, ఆర్ఎస్ఎస్‌ కుట్రలను తిప్పికొట్టాలి

బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ కుట్రలను తిప్పికొట్టాలి

- Advertisement -

ఐలమ్మ భూ పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకం
నిజాం నవాబులు, విసునూర్ దేశ్‌ముఖ్ ల ఆగడాలను ఎదిరించిన ధైర్యశాలి : ఐద్వా జాతీయ కార్యదర్శి కనినిక ఘోష్
పాలకుర్తిలో ప్రారంభమై.. బైరాన్‌‌పల్లి చేరుకున్న ‘వీరవనితల స్ఫూర్తి యాత్ర’

నవతెలంగాణ-పాలకుర్తి/మద్దూరు
​భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం వీరోచితంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయిధ పోరాటాన్ని వక్రీకరిస్తూ దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్రలను మహిళలు తిప్పి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఐద్వా జాతీయ కార్యదర్శి కనినిక ఘోష్ పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ఐద్వా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘వీరవనితల స్ఫూర్తి యాత్ర’ మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తిలో ప్రారంభమై సిద్దిపేట జిల్లా బైరాన్‌‌పల్లికి చేరుకుంది. పాలకుర్తిలోని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ విగ్రహానికి ఐద్వా జాతీయ ఉపాధ్యక్షురాలు ఎస్ పుణ్యవతి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి షబానా అధ్యక్షతన నిర్వహించిన సభలో కనినిక ఘోష్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పాలకుర్తి గడ్డ పురుడు పోసిందని తెలిపారు. రైతాంగ సాయుధ పోరాటంలో వీరవనిత చిట్యాల ఐలమ్మ భూ పోరాటం ప్రపంచానికే స్ఫూర్తినిచ్చిందని కొనియాడారు. నిజాం, నవాబుల ఆగడాలతో పాటు విసునూర్ దేశ్‌‌ముఖ్‌ ఆగడాలను ఎదిరించేందుకు ఐలమ్మ చేసిన సాహసం మరువలేనిది అన్నారు. ఐలమ్మ చేసిన సహాసంతో పల్లెలన్నీ విసునూరు దే‌శ్‌‌ముఖ్‌ ఆగడాలను ఎదిరించేందుకు నడుం బిగించాయని వివరించారు.

ఐలమ్మ సాగు చేసుకున్న పంటను ధ్వంసం చేసేందుకు నిజాం, నవాబు గూండాలు యత్నించగా ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు నాయకుల అండదండలతో నిజాం గాండాలను ఎదిరించి పంటను కాపాడుకున్న ఘన చరిత్ర ఐలమ్మకు దక్కిందన్నారు. తనను చంపితే తన వారసులు ఉన్నారని, ఒకరిని చంపితే మరొకరు ఉంటారని, నిన్ను చంపితే నీ గడీలో గడ్డి మొలుస్తుంది తప్ప వారసులెవ్వరూ లేరని విసునూరు దేశ్‌‌ముఖ్‌‌కు సవాల్ విసిరిన ధైర్య శీలి ఐలమ్మ అని తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని పక్కదోవ పట్టించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రలు చేస్తూ ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు పోరాడారని దుష్ప్రచారం చేస్తూ సాయిధ పోరాటాన్ని వక్రీకరిస్తుందని విమర్శించారు. నిజాం, నవాబుల, విసునూరు దేశ్‌‌ముఖ్‌ ఆగడాలను ఎదిరిస్తూ, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా కుల మతాలకు అతీతంగా సామాన్య ప్రజలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భాగస్వాములు అయ్యారని స్పష్టం చేశారు. ముస్లింలు, హిందువుల మధ్య జరిగిన పోరాటంగా ‌బీజేపీ, ఆర్ఎస్ఎస్ వక్రీకరించడం ఆ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. సాయిధ పోరాటాన్ని వక్రీకరిస్తూనే దేశ సంపదను అధాని, అంబానీ లాంటి బడా బాబులకు దోచి పెట్టేందుకు బీజేపీ యత్నిస్తోందని విమర్శించారు. బీజేపీ పాలనను అంతమొందించేందుకు మహిళా శక్తి ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఐద్వా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన వీర వనితల స్ఫూర్తి యాత్ర సందర్భంగా ప్రపంచానికే స్ఫూర్తినిచ్చిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట గడ్డకు రావడం ఆనందంగా ఉందని అన్నారు.

మహిళా శక్తి ఐక్యం కావాలి
వీర వనితల పోరాట స్ఫూర్తితో హక్కులను సాధించుకునేందుకు మహిళా శక్తి ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. మహిళల్లో వీర వనితల పోరాట స్ఫూర్తిని నింపేందుకు వీరవనితల స్ఫూర్తి యాత్ర చేపట్టామని తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిన ముఖ్యమైన ప్రదేశాల్లో స్ఫూర్తి యాత్ర కొనసాగుతుందని వివరించారు. వెట్టి చాకిరి నుంచి ప్రజలను విముక్తి చేసేందుకు సాగిన రైతాంగ సాయుధ పోరాటం ప్రజలకు వెన్నంటి ఉందని వివరించారు. చరిత్ర పుటలలోనే సాయుధ పోరాటం ప్రత్యేకగా నిలిచిందన్నారు. సాయుధ పోరాట వీరవనితల స్ఫూర్తితో తెలంగాణలోని మహిళలు ఇళ్ల స్థలాల కోసం, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి, జాతీయ నాయకులు పి జ్యోతి, బత్తుల హైమావతి, రాష్ట్ర సహాయ కార్యదర్శి బుగ్గవీటి సరళ, కె ఆశాలత, నలిగంటి రత్నమాల, రాష్ట్ర కోశాధికారి మాచర్ల భార్గవి, జిల్లా అధ్యక్షురాలు ఇర్రి అహల్య, మండల నాయకులు సంపూర్ణ, పద్మ, ఉపేంద్ర, మంజుల, సంధ్యారాణి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మాచర్ల సారయ్య, జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న, మండల నాయకులు సోమసత్యం, ఎదునూరి మదర్, ముస్కు ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -