Wednesday, September 16, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంభూ కక్ష్యలో అంతరిక్ష ఆయుధాన్ని మోహరించాం : అమెరికా

భూ కక్ష్యలో అంతరిక్ష ఆయుధాన్ని మోహరించాం : అమెరికా

- Advertisement -

స్పేస్‌లో ఆయుధ పోటీ వద్దు : చైనా హెచ్చరిక
వాషింగ్టన్‌ : భూమి కక్ష్యలో ఓ అంతరిక్ష ఆయుధాన్ని మోహరించామని అమెరికా అంగీకరించింది. ఈ తరహా దాడి చేసే సామర్ధ్యాలు తనకు ఉన్నాయని అమెరికా అంగీకరించడం ఇదే మొదటిసారి. అమెరికా వైమానిక దళ కార్యదర్శి ట్రారు మీంక్‌ సోమవారం వైమానిక, అంతరిక్ష, సైబర్‌ సదస్సులో ప్రసంగిస్తూ శత్రువుల చర్యల నుంచి అమెరికాను కాపాడుకోవడానికి ఈ ఆయుధం అవసరమని చెప్పారు. శత్రు దేశాల నుంచి ఎదురవుతున్న ప్రమాదాలను ఎదుర్కోవడానికి అమెరికా సిద్ధంగా ఉన్నదని తెలిపారు. అయితే ఈ ఆయుధం సామర్ధ్యం ఏమిటి, దానిని ఎప్పుడు కక్ష్యలోకి ప్రవేశపెట్టారు అనే వివరాలనుఆయన వెల్లడించలేదు. భవిష్యత్తులో జరితే సంఘర్షణలో అమెరికా ఉపగ్రహాలపై దాడి చేయడానికి, వాటి కార్యకలాపాలను అడ్డుకోవడానికి రష్యా, చైనా దేశాలు కొన్ని కార్యక్రమాలను అభివృద్ధి చేస్తున్నాయని అమెరికాకు చెందిన సీనియర్‌ సైనికాధికారులు గతంలోనే ఆరోపించారు. అందుకే అంతరిక్షంలో సైనిక సామర్ధ్యాలను పెంచుకోవాలని భావిస్తున్నామని వారు తెలిపారు. అంతరిక్షంలో ప్రత్యర్థి సామర్ధ్యాలను దెబ్బతీయడం ఈ మిషన్‌లో భాగమని అమెరికా స్పేస్‌ ఫోర్స్‌ ప్రతినిధి ఒకరు చెప్పారు. యుద్ధ కమాండ్‌ల ఆదేశాల మేరకు అంతరిక్ష సామర్ధ్యాలను దాడికి, రక్షణ ప్రయోజనాలకు వినియోగించుకోవచ్చునని అన్నారు. కాగా అంతరిక్షం వెలుపలి ప్రదేశాన్ని సైనిక అవసరాల కోసం ఉపయోగించుకునే సాంకేతికతపై చాలా తక్కువ సమాచారం మాత్రమే అందుబాటులో ఉన్నదని ఓ నిపుణుడు చెప్పారు. అమెరికా తాజా ప్రకటనపై చైనా స్పందిస్తూ అంతరిక్షంలో ఆయుధ పోటీకి దిగవద్దని హెచ్చరించింది. బాహ్య అంతరిక్షం వెలుపల సైనిక సామర్ధ్యాల విస్తరణను నిలిపివేయాల్సిందిగా అమెరికాను కోరుతున్నామని చైనా విదేశాంగ ప్రతినిధిని ఉటంకిస్తూ ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలియజేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -