అమెరికా సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వు…
డొనాల్డ్‌కు మరో ఎదురు దెబ్బ
వాషింగ్టన్ : మెయిల్-ఇన్ బ్యాలెట్‌ను లక్ష్యంగా చేసుకున్న ఓ నిబంధనను అమలు చేయడానికి యూఎస్ పోస్టల్ సర్వీసుకు అమెరికా సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించింది. నవంబరులో జరిగే కీలక మధ్యంతర ఎన్నికలకు ముందు మెయిల్ ద్వారా జరిగే ఓటింగును పరిమితం చేయాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలకు ఇది ఎదురు దెబ్బగా చెప్పవచ్చు. నిబంధనను అమలు చేయకుండా బోస్టన్లోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి ఇందిరా తల్వానీ పోస్టల్ సర్వీసును నిరోధించిన విషయం తెలిసిందే. రాష్ట్రాలు, ఓటింగ్ హక్కుల బృందాలు చేస్తున్న న్యాయపోరాటం కొనసాగినంత కాలం తన రూలింగ్ అమలులో ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. అయితే తల్వానీ తీర్పును రద్దు చేయాలంటూ న్యాయశాఖ దాఖలు చేసిన అప్పీలును సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సోమవారం తోసిపుచ్చారు. మెయిల్ ఓటింగ్‌ను నియంత్రించే ఉద్దేశంతో నిబంధనలను కఠినతరం చేస్తూ ట్రంప్ మార్చిలో కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేశారు. ‘డిస్ట్రిక్ట్ కోర్టు జారీ చేసిన ప్రాథమిక ఉత్తర్వును సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ఆమోదం పొందే అవకాశం లేదు’ అని సుప్రీంకోర్టు తన సంక్షిప్త ఉత్తర్వులో వ్యాఖ్యానించింది. మెజారిటీ ఉత్తర్వుతో కన్సర్వేటివ్ న్యాయమూర్తులు జస్టిస్ శామ్యూల్ అలిటో, జస్టిస్ క్లారెన్స్ థామస్ విభేదించారు. కోర్టులో కన్సర్వేటివ్ న్యాయమూర్తులు 6-3 మెజారిటీతో ఉన్నప్పటికీ ఇతర జడ్జిలు తీర్పుతో విభేదించలేదు. మధ్యంతర ఎన్నికలలో విజయం కోసం ట్రంప్, ఇతర రిపబ్లికన్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే వివిధ సర్వేల ప్రకారం మెయిల్-ఇన్ బ్యాలెట్లో డెమొక్రాట్ ఓటర్ల సంఖ్య అధికంగా ఉండడంతో ఆ విధానంపై ఆంక్షలు విధించాలని ట్రంప్ యోచిస్తుండగా న్యాయస్థానాలలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.



