తాజా దాడులతో రియాద్ ఉక్కిరిబిక్కిరి హార్ముజ్‌పై నిలిచిపోయిన చర్చలు
రియాద్ : సౌదీ అరేబియాపై హౌతీలు దాడులను ముమ్మరం చేశారు. ఎర్ర సముద్రం పశ్చిమ తీరం వెంబడి ఉన్న తమ సైనిక స్థావరాలను బలోపేతం చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. యెమెన్ ప్రభుత్వ దళాల నుంచి వ్యూహాత్మక రేవు పట్టణమైన మొఖాతో పాటు బాబ్ అల్-మందెబ్ జలసంధి ముఖద్వారంలో ఉన్న అత్యంత కీలకమైన పెరిమ్ ద్వీపాన్ని వారు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే దాడుల నుంచి రక్షణ పొందడానికి తీర ప్రాంతాలలో, ద్వీపాలలో బంకర్లను ఏర్పాటు చేసుకుంటూ తమ రక్షణ స్థావరాలను పటిష్టపరచుకుంటున్నారు. తాజాగా సౌదీ అరేబియాలోని ముషైత్ విమానాశ్రయంపై డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించారు. హౌతీల దూకుడుకు ఎలా స్పందించాలనే విషయంపై సైనికాధికారులు రియాద్‌లో అత్యవసర సమావేశం నిర్వహించి చర్చలు జరుపుతున్నారు.
ఇదిలావుండగా హార్ముజ్ జలసంధిపై ఇరాన్‌తో చర్చలను గల్ఫ్ దేశాలు వాయిదా వేసుకున్నాయి. దీంతో మధ్యప్రాచ్య ఘర్షణలు అంతర్జాతీయ చమురు సరఫరాలకు మరింత విఘాతం కలిగిస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దక్షిణ అరేబియాలోని ఖమిష్ ముషైత్ సైనిక వైమానిక స్థావరంపై డజన్ల కొద్దీ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించామని హౌతీలు తెలిపారు. విమాన హ్యాంగర్లు, రాడార్ వ్యవస్థలు, రన్‌వేలు, పేలుడు పదార్థాలను నిల్వ ఉంచే డిపోలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని వివరించారు. యెమెన్‌పై సౌదీ దాడులకు ప్రతీకారంగా తాము ఈ చర్యకు పాల్పడ్డామని చెప్పారు. హౌతీల దాడుల నేపథ్యంలో సౌదీ అధికారులు ఆ వైమానిక స్థావరంతో పాటు మరో మూడు దక్షిణ నగరాలలో అత్యవసర అప్రమత్తత ప్రకటించారు. హౌతీల దాడులలో 13 మంది పౌరులు గాయపడ్డారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
జోక్యంపై అమెరికా వెనుకంజ
యెమెన్ తాజా ఘర్షణలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో సవాలు తెచ్చిపెట్టాయి. ఈ ఘర్షణల్లో నేరుగా జోక్యం చేసుకోవాలంటూ సౌదీ అభ్యర్థిస్తున్నప్పటికీ అమెరికా అందుకు ఇష్టపడడం లేదు. తాను సౌదీ యువరాజుతో చర్చించానని, హౌతీలు అమెరికాను సంప్రదించి ఘర్షణలకు దూరంగా ఉండాలని కోరారని ట్రంప్ చెప్పారు. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ సోమవారం జెడ్డాలో అమెరికా ప్రాంతీయ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్‌ను కలిసి తాజా పరిణామాలపై చర్చించారని సౌదీ ప్రభుత్వ మీడియా తెలియజేసింది.



