Friday, June 5, 2026
E-PAPER
Homeక్రైమ్వీడిన హత్య కేసు మిస్టరీ..

వీడిన హత్య కేసు మిస్టరీ..

- Advertisement -

స్నేహితుడిని బలితీసుకున్న వివాహేతర సంబంధం
నవతెలంగాణ – పరకాల
నమ్మిన స్నేహితుడే కాలయముడయ్యాడు. భార్యతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కక్ష్యతో, అతి కిరాతకంగా స్నేహితుడిని హతమార్చిన ఘటన పరకాల పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఈనెల 3న స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం ప్రకారం..

హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ఎం.డి. షరీఫుద్దీన్ (38) తన కుటుంబంతో కలిసి పరకాలలోని సాగర్ వీధిలో నివాసం ఉంటున్నారు. అదే ప్రాంతానికి చెందిన టీ స్టాల్ నిర్వాహకుడు జిట్టబోయిన సందీప్ (31)తో షరీఫుద్దీన్‌కు స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలో సందీప్ తరచుగా షరీఫుద్దీన్ ఇంటికి వెళ్లేవాడు. ఈ పరిచయం కాస్తా షరీఫుద్దీన్ భార్య అజీరా బేగంతో సందీప్‌కు వివాహేతర సంబంధానికి దారితీసింది.

ఈ వ్యవహారం బయటపడితే తన పరువు పోతుందని భావించిన సందీప్, షరీఫుద్దీన్‌ను అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా జూన్ 2న రాత్రి ఫోన్ చేసి షరీఫుద్దీన్‌ను వెల్లంపల్లి రోడ్డులోని నజరేతు చర్చి సమీపానికి పిలిపించాడు. ఇద్దరూ కలిసి అక్కడ మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉండగా తన భార్యతో ఎందుకు మాట్లాడుతున్నావని షరీఫుద్దీన్ ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన సందీప్, వెంట తెచ్చుకున్న కర్రతో షరీఫుద్దీన్ తలపై బలంగా కొట్టాడు. దీంతో షరీఫుద్దీన్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

ప్రమాదంగా చిత్రీకరించే యత్నం..
హత్య తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా, మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి వెల్లంపల్లి రోడ్డు పక్కన పడేశాడు. దీనిని రోడ్డు ప్రమాదంగా నమ్మించేందుకు నిందితుడు ప్రయత్నించాడు. అయితే, షరీఫుద్దీన్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు, సాంకేతిక ఆధారాలు, విచారణ ద్వారా అసలు నిజాన్ని బయటపెట్టారు.

నిందితుడు సందీప్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఘటనా స్థలంలో రక్తపు మరకలున్న కర్ర, మద్యం బాటిళ్లు, బాధితుడి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై హత్యతో పాటు, సాక్ష్యాలను తారుమారు చేసినందుకు కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు పరకాల ఏసిపి సతీష్ బాబు, సిఐ క్రాంతికుమార్ వెల్లడించారు. హత్య కేసు మిస్టరీని చేదించిన ఎస్ఐ క్రాంతి కుమార్, ఎస్సైలు పవన్, రమేష్ లను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించడంతో పాటు తగిన రివార్డును అందించనున్నట్లు ఏసిపి వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -