నవతెలంగాణ-హైదరాబాద్: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) భవిష్యత్‌పై వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కీలక ప్రకటన చేశారు.రాజకీయ పార్టీగా మారే ఆలోచన తమకు లేదని.. ప్రజా సమస్యలపై ఒత్తిడి తీసుకొచ్చే ‘ప్రెజర్ గ్రూప్’గానే పనిచేస్తామని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో జరుగుతున్న రెండు రోజుల ఆ పార్టీ సమావేశాల సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.CJP ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించే దిశగా వ్యూహాలు రూపొందిస్తున్నట్లు దీప్కే తెలిపారు. యువత అభిప్రాయాలను తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా ‘లిజనింగ్ టూర్’ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. “దేశంలోని ఏ ప్రాంతంలో విద్యార్థులు సమస్యలపై పోరాడినా.. వారికి అండగా ఉంటాం” అని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం జార్ఖండ్‌లో జేపీఎస్సీ సివిల్స్ పరీక్షలో అక్రమాల ఆరోపణలపై కొనసాగుతున్న విద్యార్థి ఉద్యమానికి మద్దతు ఇచ్చే అంశాన్ని కూడా సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. అవసరమైతే అక్కడికి వెళ్లి మద్దతు ఇస్తామని చెప్పారు.
నీట్ పేపర్ లీక్ ను వ్యతిరేకిస్తూ ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా జరిగిన విద్యార్థి ఆందోళనలకు 30 ఏళ్ల అభిజిత్ దీప్కే నాయకత్వం వహించారు. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. ఆ నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.



