Monday, September 14, 2026
E-PAPER
Homeజిల్లాలుకొత్త గ్యాస్ కనెక్షన్ కు మోక్షమెప్పుడో.?

కొత్త గ్యాస్ కనెక్షన్ కు మోక్షమెప్పుడో.?

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు
కొత్త కనెక్షన్ల మంజూరు ప్రక్రియ నిలిచిపోవడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వెంటనే కొత్త కనెక్షన్ ఇచ్చేవారు. దీంతో పాటు డబుల్ సిలిండర్ కూడా సులభంగా మంజూరయ్యేది. కానీ కొద్ది నెలలుగా పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు, ఎల్పీజీ దిగుమతుల్లో నెలకొన్న అనిశ్చితి కారణాలతో చమురు సంస్థలు కొత్త కనెక్షన్ల జారీ పూర్తిగానిలిచిపోయింది. దీనికి తోడు అధికారిక పోర్టల్ సర్వర్లు సాంకేతిక లోపాలతో మొరాయించడంతో గ్యాస్ ఏజెన్సీలు కొత్త దరఖాస్తులను స్వీకరించలేక చేతులెత్తేస్తున్నాయి. ప్రస్తుతం మండలంలో మొత్తం గ్యాస్ కనెక్షన్లు 5,974 ఉన్నాయి.

ఏజెన్సీల చుట్టూ ప్రదక్షిణలు..
గ్యాస్ కనెక్షన్ల కోసం రోజూ ఏజెన్సీ కార్యాలయాల చుట్టూ తిరిగే వారి సంఖ్య పెరుగుతోంది. డీలర్లు సైతం వారికి సమాధానం చెప్పలేకపోతున్నారు. పై నుంచి కొత్త కనెక్షన్లకు సంబంధించిన ప్రస్తుతం ఎలాంటి ఆదేశాలు లేవని డీలర్లు స్పష్టం చేస్తున్నారు. కొత్త కనెక్షన్లు ఎప్పటి నుంచి పునరుద్ధరిస్తారనే అంశంపై కేంద్ర చమురు సంస్థలు గానీ, పౌర సరఫరాల శాఖ గానీ ఇప్పటివరకు ఎటువంటి నిర్దిష్ట గడువు లేదా స్పష్టతను ఇవ్వకపోవడంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. దీంతో గత్యంతరం లేక వేలాది రూపాయలు వెచ్చించి ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లపై ఆధారపడటంతో ప్రతినెలా విద్యుత్ బిల్లులు మోతమోగి సామాన్యుల బడ్జెట్ తలకిందులవుతోంది.

కొత్త కనెక్షన్లు కేంద్రం నిలిపివేసింది
కేంద్ర ప్రభుత్వం గత కొన్ని నెలలుగా కొత్త కనెక్షన్లు మంజూరు ప్రక్రియను నిలిపివేసింది. దీంతో ప్రస్తుతం కొత్త కనెక్షన్లు ఇవ్వడానికి అవకాశం లేదని సివిల్ సప్లయి అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త కనెక్షన్ల కోసం పోర్టల్ అనుమతులు ఇస్తేనే దరఖాస్తులు చేసుకునే వీలుంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -