నవతెలంగాణ – హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది. వైఎస్సార్ మేనత్త వైఎస్ కమలమ్మ (88) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో సోమవారం తుదిశ్వాస విడిచారు.
కమలమ్మ ప్రస్తుతం అమెరికాలోని తన కూతురు మెస్సీ దగ్గర ఉంటూ చికిత్స తీసుకుంటోందని తెలిసింది. అమెరికాలో కన్నుమూసిన వైఎస్ కమలమ్మ భౌతికకాయాన్ని స్వగ్రామమైన పులివెందులకు తరలించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. పులివెందులలోని వైఎస్సార్ సమాధుల తోటలో ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు సమాచారం. కమలమ్మ ఆకస్మిక మృతిపట్ల వైఎస్సార్ భార్య వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ దంపతులు, వైఎస్ షర్మిల, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డితో పాటు ఇతర కుటుంబసభ్యులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.


