Monday, September 14, 2026
E-PAPER
Homeఖమ్మంప్రకృతి సాగుతో నేలకు సారం

ప్రకృతి సాగుతో నేలకు సారం

- Advertisement -

రైతుకు అదనపు ఆదాయం

నేడు రైతులకు ప్రకృతి వ్యవసాయ కిట్ల పంపిణీ

నవతెలంగాణ అశ్వారావుపేట

రసాయనిక ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి నేల ఆరోగ్యాన్ని కాపాడటం తోపాటు రైతులకు అధిక ఆదాయం అందించేందుకు ప్రకృతి వ్యవసాయం దోహదపడుతుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌ లో భాగంగా అశ్వారావుపేట డివిజన్‌లో ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టారు.

అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, దమ్మపేట, ములకలపల్లి మండలాల్లోని నర్సాపురం, బెండాలపాడు, మొండివర్రే, మూకమామిడి గ్రామాలను ఈ ఏడాది ప్రకృతి వ్యవసాయ క్లస్టర్ గ్రామాలుగా ఎంపిక చేశారు. ప్రతి గ్రామంలో 125 మంది రైతులను గుర్తించారు. ఎంపికైన రైతులు తమ సాగు భూమిలో ఒక ఎకరం విస్తీర్ణంలో మూడేళ్లపాటు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అమలు చేయాల్సి ఉంటుంది. ఈ విధానంలో సాగు చేసిన పంటలకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ లభించడంతో పాటు మార్కెట్‌లో ప్రీమియం ధర పొందే అవకాశం ఉంటుంది.

ప్రకృతి వ్యవసాయంలో రసాయనిక ఎరువులు, రసాయనిక సస్యరక్షణ మందుల వినియోగం నిషేధం. ఏడాది పొడవునా నేలను ఏదో ఒక పంటతో కప్పి ఉంచడం, పంట మార్పిడి, బహుళ పంటల సాగు వంటి పద్ధతులను పాటించాలి. పాడి పంట విధానంలో భాగంగా పశువులు, మేకలు, గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ వాటి నుంచి లభించే సేంద్రియ ఎరువులను పొలాల్లో వినియోగించాలి. సేంద్రియ వ్యర్థాలను కంపోస్ట్‌ గా మార్చి తిరిగి భూమిలోనే వినియోగించడం ద్వారా వ్యర్థ రహిత వ్యవసాయాన్ని సాధించవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

వరి సాగులో పచ్చిరొట్ట పైర్లను పెంచి నాట్లకు ముందు నేలలో కలియదున్నడం ద్వారా సేంద్రియ పదార్థం పెరుగుతుంది. దీంతో సూక్ష్మజీవులు, వానపాముల సంఖ్య పెరిగి నేల గుల్లబారి గాలి ప్రసరణ మెరుగుపడుతుంది. వరిపొలాల్లో అజోల్లా వినియోగం ద్వారా నత్రజని అందించవచ్చు. పంట దశలను బట్టి జీవామృతం వాడటం వల్ల పోషకాలు అందడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సేంద్రియ వ్యర్థాలతో తయారు చేసే బయోచార్‌ నేలలో తేమను నిల్వ ఉంచడంతో పాటు పోషకాలను నిదానంగా అందించడంలో ఉపయోగపడుతుంది.

నీటి కుంటల నిర్మాణం ద్వారా భూగర్భ జలాలను పెంచుకోవాలని, భూగర్భ జలాలను ద్రవరూప బంగారంగా, మట్టిని బంగారంగా భావించి సంరక్షించాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. వరి ఉత్పత్తులను నేరుగా మార్కెట్‌లో విక్రయించకుండా విలువ జోడింపు ద్వారా రైతులు మరింత లాభం పొందేలా చర్యలు చేపట్టాలని పేర్కొంటోంది.

నేడు కిట్ల పంపిణీ:

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించనున్న రైతు నేస్తం కార్యక్రమం ద్వారా ప్రకృతి వ్యవసాయ క్లస్టర్ గ్రామాల రైతులకు కిట్లను పంపిణీ చేయనుంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులకు కిట్లను అందజేయనున్నారు. అశ్వారావుపేట డివిజన్‌ లోని నాలుగు మండలాల్లో ఎంపికైన రైతులకు కూడా ప్రకృతి వ్యవసాయ కిట్లను పంపిణీ చేయనున్నారు. ఈ కిట్ లో జూట్ బ్యాగ్, క్యాలెండరు, డైరీ, పుస్తకం ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -