సభ దృష్టికి సమస్యలను లేవనెత్తి నర్పంచులు
నవతెలంగాణ – మల్హర్ రావ
స్థానిక సంస్థల్లో భాగమైన జెడ్పీటీసీ, ఎంపీపీ వ్యవస్థలు మనుగడలో లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులను భాగస్వాములను చేస్తూ ప్రతీ 45 రోజులకు ఒకసారి మండల స్థాయి సమీక్ష నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మండల ప్రత్యేక అధికారి బాబురావు అధ్యక్షతన మండల ఎంపీడీవో క్రాoతి కుమార్ ఆధ్వర్యంలో తాడిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో మండల సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిదిగా తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమీక్షలో యూరియా, డీఏపీ లభించడంలేదని సర్పంచులు సభ దృష్టికి తీసుకురాగా ప్రస్తుతం మండలంలో రెండు వేల బస్తాలు అందు బాటులో ఉన్నాయని ఏవో శ్రీజ తెలిపారు.
ఐకెపి వివోలు గ్రామసభలకు హాజరు కాకపోగా ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నట్లుగా తెలిపారు. మండల సమాఖ్య కార్యాలయం తాడిచెర్లకు తరలించాలని సర్పంచ్లు బండి స్వామి, మేకల రాజయ్య, గడ్డం క్రాంతి కోరారు. లేదు కొయ్యుర్ లోనే ఉంటూ అదనంగా తాడిచెర్ల మరో కార్యాలయం ఏర్పాటు చేయాలని సర్పంచ్లు కొండ రాజమ్మ, చంద్రగిరి సంపత్ డిమాండ్ చేశారు. శాత్రజ్ పల్లిలో వైద్య శిబిరం నిర్వహించాలని, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ఆరోగ్య కేంద్రంలో సరిపడా మందులు ఉంచాలని కోరారు. అంగన్ వాడి కేంద్రాలపై పర్యవేక్షణ చేస్తూ.. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, మల్లారం, దుబ్బపేట గ్రామాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, ఆర్టీసీ బస్సును మల్లారం వయ చిన్నతూండ్ల, పెద్దతూండ్ల వరకు నడపాలని, గెస్టెడ్ సంతకాల కోసం కల్యాణ లక్ష్మీ లబ్ధిదారులు ఇబ్బందులకు గురికాకుండా స్థానిక హెడ్ మాస్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని, ఈకేవైసి చేయడంలో డీలర్లు ప్రజలకు అవగాహన కల్పించడం లేదని, పివి నగర్, దుబ్బపేటకు రేషన్ లబ్ధిదారులకు ఇబ్బందులకు గురివుతున్నట్లుగా.. తాడిచెర్లలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులను పర్మినెంట్ చేస్తూ, సిబ్బందిని పెంచుతూ, వారి వేతనాలు పెంచాలని తదితర ప్రశ్నలతో సర్పంచ్లు వాడివేడిగా సభ దృష్టికి తీసుకువచ్చారు.
ఏదిఏమైనా సర్పంచులుగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా నిర్వహించిన మండల సమీక్ష సమావేశంలో గ్రామ పంచాయతీల్లో పరిష్కారానికి నోచుకోని సమస్యలు ఎకరువు పెట్టారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ రాధిక, డిటి హేమాన్ బాబా, ఇంచార్జి ఎపిఓ మల్లిఖార్జున రెడ్డి, సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి, ఏపిఎం హనుమంతరావు, సర్పంచ్లు జంగిడి శ్రీనివాస్, రవిందర్ నాయక్, అబ్బినేని లింగస్వామి, అజ్మీరా సారక్క, బొమ్మ రజిత-రమేష్ రెడ్డి, జ్యోష్ణ-సరిన్ రావు, ఉప సర్పంచ్లు బొబ్బిలి రాజు, అక్కల దేవేందర్, కార్యదర్శులు, ఎపిడిఓ సిబ్బంది పాల్గొన్నారు.



