Sunday, April 26, 2026
E-PAPER
Homeజాతీయంమణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలు

మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలు

- Advertisement -

– ఉఖ్రూల్‌లో కాల్పుల ఘటనలు ొముగ్గురు మృతి.. పలువురికి గాయాలు
ఇంఫాల్‌ :
మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉఖ్రూల్‌ జిల్లాలో జరిగిన రెండు వేర్వేలు కాల్పుల ఘటనల్లో ముగ్గురు మరణించారు. ఈ ఘటనలు టాంగ్‌ఖుల్‌ నాగాలు, కుకీ సముదాయాల మధ్య కొనసాగుతున్న ఘర్షణలకు తాజా ఉదాహరణగా నిలిచాయి. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. మొదటి కాల్పుల ఘటన సినాకైథీ గ్రామం సమీపంలో జరిగింది. టాంగ్‌ఖుల్‌ నాగా, కుకీ సముదాయాలకు చెందిన సాయుధుల మధ్య జరిగిన ఈ కాల్పుల్లో హౌర్షోక్మి జమాంగ్‌ (29) అనే టాంగ్‌ఖుల్‌ వ్యక్తి మరణించాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. ఇంకో కాల్పుల ఘటన ముల్లామ్‌ గ్రామంలో చోటు చేసుకుంది. ఇది కుకి జనాభా ఎక్కువగా ఉండే గ్రామం. ఈ కాల్పుల్లో లెట్‌లాల్‌ సిట్‌లోహౌ (జేమ్స్‌ కుకి), షావోమిన్‌లున్‌ హౌలావో (హిట్‌లాల్‌ కుకి) అనే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

టాంగ్‌ఖుల్‌ నాగా సంస్థల ప్రకారం.. కుకి మిలిటెంట్‌ గ్రూపులు గ్రామాల మధ్య తరచూ తిరుగుతూ సమస్యలు సృష్టిస్తున్నాయని ఆరోపించాయి. తాము గస్తీ చేస్తున్న సమయంలో తమపై దాడి జరిగిందని వివరించాయి. అయితే టాంగ్‌ఖుల్‌ మిలిటెంట్లు ఉదయం 5.30 గంటలకు తమ గ్రామంపై దాడి చేశారని ముల్లామ్‌ గ్రామాధికారులు ఆరోపించారు. కుకి హ్యూమన్‌రైట్‌ సంస్థలు ఈ ఘటనను ఖండించాయి. గ్రామ వాలంటీర్లను హత్య చేయడమే కాకుండా ఇండ్లను దహనం చేసినట్టు ఆరోపించాయి.

పరిస్థితి నేపథ్యం
ఉఖ్రూల్‌ జిల్లా టాంగ్‌ఖుల్‌ నాగాల అధిక జనాభా కలిగిన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి టాంగ్‌కుల్‌ నాగాలు, కుకి సముదాయాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇప్పటికే మణిపూర్‌ రాష్ట్రం మెయిటీ, కుకీ-జో సముదాయాల మధ్య 2013 నుంచి కొనసాగుతోన్న ఘర్షణలతో బాధపడుతోంది. గత వారం కూడా ఇదే జిల్లాలో ఇద్దరు టాంగ్‌ఖుల్‌ వ్యక్తులు మిలిటెంట్ల దాడిలో మరణించగా.. అదే రోజు మరో కాల్పుల ఘటన కూడా చోటు చేసుకుంది.
కాగా మణిపూర్‌లో సామాజిక, జాతి ఆధారిత విభేదాలు మరింత హింసాత్మక దశలోకి వెళ్తున్నాయి. ఇక్కడ ఏర్పడిన అస్థిర, అశాంతి వాతావరణ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే మెయిటీ-కుకీజో మధ్య సామాజిక అల్లర్లు తీవ్ర అలజడిని సృష్టించాయి. వాటిని కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్రంలో అధికారాల్లో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు విఫలమయ్యాయి. కొన్నాళ్ల పాటు రాష్ట్రపతి పాలన అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో మళ్లీ బీజేపీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అయినప్పటికీ ఇక్కడ పరిస్థితి మారడం లేదు. అల్లర్ల రూపం మారి హింసాత్మక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితులను కట్టడి చేయడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -