Sunday, April 26, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇమ్మిగ్రేషన్‌ బిల్లుపై రిపబ్లికన్‌ పార్టీలో అంతర్గత పోరు

ఇమ్మిగ్రేషన్‌ బిల్లుపై రిపబ్లికన్‌ పార్టీలో అంతర్గత పోరు

- Advertisement -

వాషింగ్టన్‌ : అమెరికాలో మధ్యంతర ఎన్నికల ముందు రిపబ్లికన్‌ పార్టీలో విభేదాలు పెరుగుతున్నాయి. ఇమ్మిగ్రేషన్‌ సంస్కరణకు మద్దతు ఇచ్చే తమ పార్టీ నేతలను ఓడించేందుకు ఒక కన్జర్వేటివ్‌ గ్రూప్‌ ప్రయత్నిస్తోంది. హౌంల్యాండ్‌ పీఏసీ అనే ‘కన్జర్వేటివ్‌ సూపర్‌ పీఏసీ’.. ‘డిగ్నీడ్యాడ్‌’ ఇమ్మిగ్రేషన్‌ బిల్లుకు మద్దతు ఇచ్చిన రిపబ్లికన్‌ ఎంపీలను లక్ష్యంగా చేసుకుంది. వారిని ఓడించేందుకు సిద్ధమైంది.
ఏమిటీ ఈ బిల్లు?
హౌంల్యాండ్‌ పీఏసీ అనేది ఒక కొత్త రాజకీయ సమూహం. ఇది వలస చట్టంలో సడలింపులు ఇచ్చే డిగ్నీడ్యాడ్‌ బిల్లుకు మద్దతు ఇస్తున్న రిపబ్లికన్‌ నాయకులపై పోటీదారులను నిలబెట్టాలని చూస్తోంది. ఈ బిల్లు ప్రకారం.. అక్రమంగా ఉన్న వలసదారులు అమెరికాలో ఉండొచ్చు. పని చేసుకోవచ్చు. కానీ వారికి పౌరసత్వం లభించదు. ప్రతి ఏడాదీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. క్రిమినల్‌ హిస్టరీ ఉన్నవారికి ఈ సదుపాయం ఉండదు. ఇక ఈ బిల్లు ప్రకారం సరిహద్దు భద్రతకు పెద్ద మొత్తంలో నిధులు ఇస్తారు.
ఈ బిల్లును ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్‌ నేత మ్యారియా ఎల్విరా సలజార్‌ ప్రవేశపెట్టారు. హౌంల్యాండ్‌ పీఏసీ వ్యవస్థాపకులు రియాన్‌ గిర్‌డస్కీ ఈ బిల్లును ‘పార్టీ విలువలకు వ్యతిరేకం’గా విమర్శించారు. ఈ పరిస్థితులతో రిపబ్లికన్‌ పార్టీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ కఠిన వలస విధానాన్ని అనుసరించాలా? లేక లాటినో ఓటర్లను కోల్పోకుండా కొంత సడలింపు ఇవ్వాలా? అనే ప్రశ్నలు రిపబ్లికన్‌ నేతలను తొలచివేస్తున్నాయి.

లాటినో ఓటర్ల ప్రభావం
2024 ఎన్నికల్లో ట్రంప్‌నకు లాటినో ఓటర్లు ఎక్కువగా మద్దతు ఇచ్చారు. సుమారు 48 శాతం ఓటు వేశారు. కానీ ఇప్పుడు ట్రంప్‌ పాలనలో ఖర్చులు పెరగడం, వలసదారులపై కఠిన చర్యలు వంటి కారణాలతో వారి అభిప్రాయాలు మారే అవకాశాలు ఉన్నాయి. ఒక సర్వే ప్రకారం.. 52 శాతం మంది ప్రజలు ట్రంప్‌ కఠిన వలస విధానానికి మద్దతు ఇచ్చే అభ్యర్థులకు ఓటు వేయబోమని చెప్తున్నారు. కాగా ఈ అంశం 2026 ఎన్నికల్లో కాంగ్రెస్‌పై ఎవరి ఆధిపత్యం ఉంటుందో నిర్ణయించొచ్చుని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -