Wednesday, August 5, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్ తాజా సుంకాలు చట్టవిరుద్ధం

ట్రంప్ తాజా సుంకాలు చట్టవిరుద్ధం

- Advertisement -

కోర్టులో వ్యాజ్యం వేసిన అమెరికా రాష్ట్రాలు
వాషింగ్టన్ : భారత్ సహా 60 వాణిజ్య భాగస్వామ్య దేశాల నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై 10 నుంచి 12.5 శాతం వరకూ కొత్తగా సుంకాలు విధించాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అమెరికాలోని ఇరవై ఐదు రాష్ట్రాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఈ సుంకాలు అక్రమమైనవని, ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు కొట్టివేసిన దిగుమతి పన్నుల స్థానంలో ట్రంప్ ప్రభుత్వం వీటిని తీసుకొచ్చే ప్రయత్నం చేసిందని ఆరోపించాయి. సుంకాల విధింపును కొట్టివేయాలని, వాటిని చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించి ఇప్పటికే వసూలు చేసిన సొమ్మును తిరిగి వాపసు చేసేలా చూడాలని యూఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్‌లో దాఖలు చేసిన వ్యాజ్యంలో ఆ రాష్ట్రాలు అభ్యర్థించాయి. 59 రాష్ట్రాలు, యూరోపియన్ యూనియన్‌పై గత నెలలో విధించిన సుంకాలు అమెరికా దిగుమతు లలో 99.4 శాతం వాటాను కలిగి ఉన్నాయని రాష్ట్రాలు వాదించాయి. కార్మికులతో బలవంతంగా పనులు చేయించి తయారు చేసిన వస్తువుల దిగుమతులను ఆపాలని కోరినప్పటికీ ఆయా దేశాలు పట్టించుకోలేదని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. ‘సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలిన తర్వాత ట్రంప్ ప్రభుత్వం కుటుంబాలు, వ్యాపారాలపై కొత్త టారిఫ్‌లతో భారం మోపాలని మరోసారి ప్రయత్నిస్తోంది’ అని న్యూయార్క్ అటార్నీ జనరల్ లెతితియా జేమ్స్ ఓ ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వం తన చర్యను ఏ విధంగా సమర్ధించుకుంటున్నప్పటికీ తాను కోరుకున్న దేశాలపై అధిక సుంకాలు విధించేందుకు దేశాధ్యక్షుడికి అధికారం లేదని అమెరికా చట్టం, రాజ్యాంగం స్పష్టం చేస్తున్నాయని ఆయన అన్నారు. ట్రంప్ ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో వ్యాజ్యం వేసిన రాష్ట్రాలలో న్యూయార్క్, కాలిఫోర్నియా, ఇల్లినాయిస్, మాసాచూసెట్స్, వాషింగ్టన్, విల్కాన్సిస్ సహా 18 రాష్ట్రాలు, కెంటుకీ, పెన్సిల్వేనియా గవర్నర్లు ఉన్నారు. విముక్తి దినోత్సవం సందర్భంగా ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాలను రాజ్యాంగ విరుద్ధమైనవిగా న్యాయస్థానం గతంలో తీర్పు ఇవ్వడంతో 1974వ సంవత్సరపు వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద కొత్తగా ముందుకు తెచ్చిన టారిఫ్‌లు గత నెల నుంచే అమలులోకి వచ్చాయి. ఈ కొత్త సుంకాల కారణంగా ప్రధాన వాణిజ్య భాగస్వాములైన కెనడా, జపాన్, నార్వే, తైవాన్, చైనాలపై బాగా ప్రభావం పడుతుంది. కాగా ట్రంప్ తన కార్యనిర్వాహక అధికారాన్ని అతిక్రమించారంటూ రెండు చిన్న వ్యాపార సంస్థల తరఫున లిబర్జీ జస్టిస్ సెంటర్ కూడా విడిగా వ్యాజ్యాన్ని వేసింది. బలవంతంగా పనులు చేయిస్తున్నారన్న పేరుతో ప్రభుత్వం సుంకాలను భారీగా పెంచిందని, ఇది వినియోగదారులపై అధిక ఆర్థిక భారాన్ని మోపిందని న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచల్ విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -