రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ బరితెగింపు.. పదేండ్లుగా మాయాజాలం
రెగ్యూలేటరీ సంస్థల తీవ్ర నిర్లక్ష్యం
ఎట్టకేలకు మేల్కొన్న సెబీ
నవతెలంగాణ – హైదరాబాద్
బంగారం, ఆభరణాల తయారీ దిగ్గజం రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ (ఆర్‌ఇఎల్) గడిచిన పదేళ్లుగా భారత కార్పొరేట్ చర్రితలోనే అత్యంత దారుణమైన ఆర్థిక మోసాలకు పాల్పడింది. లక్షల కోట్ల ఆదాయం చూపి ఇన్వెస్టర్లను నిండా ముంచింది. గత ఐదేళ్లలోనే తన అనుబంధ సంస్థల ద్వారా ఏకంగా రూ. 15.15 లక్షల కోట్ల బోగస్ ఆదాయాన్ని సృష్టించిందని తేలడంతో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఎట్టకేలకు చర్యలను తీసుకుంది. కాగా.. ఈ దారుణమైన మోసం వెనుక కంపెనీ యాజమాన్యపు బరితెగింపు ఎంత ఉందో.. ఇన్వెస్టర్ల సొమ్ముకు రక్షణగా ఉండాల్సిన రెగ్యులేటరీ సంస్థల నేరపూరిత నిర్లక్ష్యం కూడా అంతే ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దశాబ్ద కాలంగా కళ్ల ముందే ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన వ్యవస్థల తీరుపై ఇన్వెస్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కంపెనీ చేస్తున్న అక్రమాలపై 2014లోనే ఆధారాలతో సహా హెచ్చరికలు వచ్చాయి. రూ. 31,000 కోట్ల టర్నోవర్ చూపిస్తూ.. ఉద్యోగుల జీతాల ఖర్చు కేవలం రూ. 7 కోట్లు అని చూపించినప్పుడే ఈ కంపెనీ కేవలం ఒక కాగితాల సామ్రాజ్యం అని తేలిపోయింది. ఈ లెక్కింపులో ఏదో మాయ జరుగుతోందని సామాన్య ఇన్వెస్టర్లకు సైతం అర్థమైంది. చేతిలో రూ. 9,000 కోట్లకు పైగా నగదు నిల్వలు ఉన్నాయని చెబుతూనే మరోవైపు వేల కోట్ల అప్పులను ఎందుకు మోస్తున్నారనే ప్రాథమిక ప్రశ్నలకు అటు కంపెనీ గానీ, ఇటు పర్యవేక్షించాల్సిన అధికారిక సంస్థలు గానీ సమాధానం వెతకలేదు.
లాభాలపై ఒక్క రూపాయి కూడా పన్ను నిబంధనలు చూపించకపోవడం వంటి ఘోరమైన లొసుగులు కనిపిస్తున్నప్పటికీ రెగ్యులేటర్లు కళ్లు మూసుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనూ ఏకంగా రూ. 7.78 లక్షల కోట్ల రికార్డు టర్నోవర్ చూపించి.. చివరి మార్చి త్రైమాసికంలో రూ. 53.5 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించడంతో ఈ అకౌంటింగ్ మోసం పతాక స్థాయికి చేరింది. కళ్లు చెదిరేలా లక్షల కోట్ల టర్నోవర్లు చూపిస్తూ.. తీరా లాభాల విషయానికి వస్తే నామమాత్రపు అంకెలు లేదా నష్టాలను ప్రకటిస్తున్నా.. ఏనాడూ తనిఖీలు చేపట్టకపోవడం రెగ్యులేటరీ వ్యవస్థల చిత్తశుద్ధినే ప్రశ్నార్థకం చేస్తోంది. సెబీ విడుదల చేసిన 109 పేజీల నివేదికలో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ తన ఆదాయాన్ని ఏకంగా రూ.15.15 లక్షల కోట్లు ఎక్కువగా చూపించిందని మార్కెట్ రెగ్యూలేటర్ ప్రాథమిక విచారణలో తేల్చింది. కంపెనీ పుస్తకాల్లో నమోదైన మొత్తం గ్రూప్ ఆదాయంలో ఇది దాదాపు 97 శాతం నుండి 99 శాతం వరకు అధిక రెవెన్యూ ఉండటం గమనార్హం. ఇలాంటి అబద్దపు రెవెన్యూలతో ఈ దశాబ్ద కాలంలో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఏకంగా ఫార్చ్యూన్ 500 జాబితాలోకి ఎగబాకి ప్రభుత్వ రంగ దిగ్గజం ఒఎన్‌జిసిని వెనక్కి నెట్టేస్తున్నా అధికార యంత్రాంగం నిద్రపోతూనే ఉంది. ఇప్పుడు సెబీ ప్రమోటర్ రాజేష్ మెహతాపై నిషేధం విధించి.. ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశించినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కంపెనీ షేర్లు వరుసగా లోయర్ సర్క్యూట్లను తాకుతూ ఇన్వెస్టర్ల సంపదను నిలువునా ముంచేస్తున్నాయి. విచారణకు వెళ్లిన ఆడిటర్లకు అకౌంట్ల యాక్సెస్ ఇవ్వకుండా కంపెనీ బుకాయించడం చూస్తుంటే.. లోపల ఇంకెంత పెద్ద కుంభకోణం దాగుందోననే భయాలు మార్కెట్‌ను వణకిస్తున్నాయి. దశాబ్ద కాలంగా సాగిన ఈ లూటీకి కేవలం కంపెనీయే కాదు.. కళ్లున్నా చూడలేకపోయిన ప్రభుత్వ పర్యవేక్షక సంస్థలు కూడా సమాధానం చెప్పాల్సిందేనని ఇన్వెస్టర్లు డిమాండ్ చేస్తున్నారు.
వేల కోట్ల టర్నోవర్..రూ.7 కోట్ల జీతాలు..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



