– వ్యవసాయ క్షేత్రంలో పని చేస్తుండగా ప్రాణాపాయం
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలంలోని లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన రైతు వడ్డే ఆంజనేయులు (47) విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంజనేయులు తన వ్యవసాయ పొలంలో వ్యవసాయ పనులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబానికి ఆయనే ప్రధాన ఆధారంగా ఉండటంతో ఆయన మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆంజనేయులు ఆకస్మిక మృతితో లక్ష్మాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవడంతో పాటు తక్షణ ఆర్థిక సాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కుమారుడు జగదీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.



