ఏమైందీ.. నగరానికి?

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ నేడు ‘మహిళా సంక్షేమ దివాస్‌’గా ప్రకటించి ప్రభుత్వం ఉత్సవాలు చేస్తుంది. ఈ తరుణంలోనైనా మహిళా చట్టాలు అమలవుతున్న తీరును, మహిళల సంక్షేమాన్ని, వారికి ఇచ్చే సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రాధాన్యతలను గురించి ప్రభుత్వం ఆలోచించాలి… ఆచరణలోకి తీసుకురావాలి. సమాజంపై ఎక్కువ ప్రభావం చూపే సినీరంగం నేరప్రేరేపిత అంశాల విషయంలో జాగ్రత్త పడాల్సిన సందర్భం ఇది. పౌరసమాజం కూడా సమాజం నుంచి ఈ నేర సంస్కృతిని తరిమికొట్టాలి.
మహానగరం వరుస హత్యలతో ఉలిక్కి పడుతోంది. ఏ క్షణాన.. ఏ దారుణ వార్త వినాల్సివస్తుందో అని అనుక్షణం భయపడుతోంది. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున రోజుకో హత్యోదంతం వెలుగుచూస్తూ కలవరపెడుతోంది. ఈ నెల రోజుల వ్యవధిలోనే పదుల సంఖ్యలో అత్యంత పాశవిక హత్యలు చోటుచేసుకున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో వేరే చెప్పాల్సిన పనిలేదు. స్నేహం పేరుతో, ప్రేమ పేరుతో ఇతర అవసరాల పేరిట మాటలు కల్పడం… దగ్గరయ్యాక… తేడాలొస్తే తుదముట్టించడం..! నెల వ్యవధిలో శంషాబాద్‌ నుంచి సరూర్‌ నగర్‌ దాకా, వికారాబాద్‌ నుంచి బాచుపల్లి దాకా ప్రతి ఠాణా పరిధిలో మహిళల హత్య కేసులే అధికంగా ఉంటున్నాయి. నిందితుల్లో వారి పరిచయస్తులే ఎక్కువ. వివాహేతర సంబంధాలు, మద్యం కేంద్రంగానే ఈ హత్యలు చోటుచేసుకుంటున్నాయి. అత్యంత ఘోరంగా చంపేస్తున్న నిందితులు… మృతదేహాలను గుర్తించకుండా సాక్ష్యాలను మాయం చేస్తూ, నగర శివార్లలో విసిరేస్తున్నారు. లేదంటే అక్కడ హత్య చేసిన ఇతర చోట్ల పడేస్తున్నారు.
సహజ మరణాలకు తలవంచాల్సిందే! వీరోచిత మరణాలకు జోహార్లు తెలపాల్సిందే! కానీ, ఈ హత్యలు చూస్తుంటే దుఃఖంతో పాటు కోపం, ఆందోళన కలుగుతున్నాయి. అసలు ఒకరిని హత్య చేసే హక్కు వేరే వ్యక్తికెక్కడిది? ఒకరి ఇష్టాన్ని నిర్థారించే హక్కు మరో వ్యక్తికెెవరిచ్చారు? ఎదుటి వ్యక్తి తన స్వార్థానికి, సుఖానికి ఆటంకంగా ఉన్నారని, తనను ప్రేమించటం లేదని, ప్రేమించినా పెండ్లి చేసుకొమ్మని ఒత్తిడి తెస్తుందని హత్యలు చేస్తున్నారు. ‘తిలాపాపం తలా పిడికెడు’ అన్నట్టు ఇందులో సామాన్యుల నుంచి పోలీసు అధికారులు, ఐఏఎస్‌ల వంటి ఉన్నతాధికారుల వరకు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నవారున్నారు.
ఈ ఏడాది ప్రారంభం నుంచి వరుసగా చోటుచేసుకుంటున్న హత్యలు గత నెల నుంచి తీవ్రరూపం దాల్చాయి. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం, క్రైం సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చూస్తూ నేరస్తులు వింత పోకడలు పోతూ పోలీసులకు సవాల్‌గా మారుతున్నారు. నగరంలో కలకలం సష్టించిన అప్సర కేసులో నిందితుడైన సాయికష్ణ ఏకంగా ‘గూగుల్‌ తల్లి’నే ఎలా హత్య చేయాలో అడిగి మరీ దారుణానికి ఒడిగట్టాడు. మృతదేహం దొరక్కుండా డ్రెయినేజీలో పడేశాడు. బెంగళూరులో మరో ప్రబుద్ధుడు తన భార్యను అనుమానిస్తూ హత్యచేసి ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్‌లో ఉడికించి మరి కుక్కలకు వేశాడు. తలను మొండెంను వేరుచేసే వారు కొందరైతే… ముక్కలు ముక్కలుగా చేసి శివారు ప్రాంతాల్లో విసిరేసే వారు మరి కొందరు. స్వయంగా నిందితులే క్రైం సినిమాలు చూసి ఇలా చేశామని నిర్లజ్జగా ఒప్పుకుంటున్నారంటే.. వాటి ప్రభావం సమాజంపై ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. నిన్న కాక మొన్న ఇదే తరహలో జరిగిన వికారాబాద్‌ శీరిష కేసులో వాస్తవాలు ఇంకా బయటకు రావాల్సివుంది.
సామాజికంగా ఎన్ని మార్పులు చోటు చేసుకుంటున్నా.. హింస మాత్రం తగ్గటం లేదు. అదనపు కట్నం కోసం వేధించేవాళ్లు, తాగుబోతు భర్తలతో తిప్పలు ఒక భాగమైతే, వివాహేతర సంబంధాలు, లైంగికదాడుల ఫలితంగా హత్యలకు గురయ్యే మహిళల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. వీటికి తోడు ఏటా పెరుగుతున్న గృహహింస ఫిర్యాదుల సంఖ్య కూడా తక్కువేం కాదు. 2019లో రాష్ట్రవ్యాప్తంగా 43 ఫిర్యాదుల నమోదైతే.. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే 162 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ పోలీస్‌ శాఖలో ప్రత్యేకించి మహిళా భద్రత కోసం ప్రత్యేక విభాగం, షీటీమ్స్‌ వంటివి పని చేస్తున్నా ఈ నేరాలను అడ్డుకోలేకపోతున్నాయి.
మద్యం మత్తులోనే ఎక్కువ దారుణాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో బడి లేని చోటు ఉందేమో కానీ, మద్యం దొరకని చోటు లేదంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి రాష్ట్రంలో మద్యం విక్రయాలపై వచ్చిన ఆదాయం కంటే ఇప్పుడు తెలంగాణలో వస్తున్న ఆదాయం దాదాపు ఆరు రెట్లు అధికం. మద్యం వలన ఆగమవుతున్న మహిళల జీవితాలకు కనీస భరోసా లేదు. గతంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా ప్రతి ఏడాది ప్రభుత్వమే అన్ని మహిళా సంఘాలతో సమీక్ష నిర్వహించేది. వాటి ఫలితంగానే మహిళల భద్రతకు సంబంధించిన ముఖ్యమైన చట్టాలు వచ్చాయి. కానీ, నేడు అనేక దారుణాలు జరుగుతున్నా… ఒక్క సమీక్షా సమావేశం నిర్వహించలేదు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ నేడు ‘మహిళా సంక్షేమ దివాస్‌’గా ప్రకటించి ప్రభుత్వం ఉత్సవాలు చేస్తోంది. ఈ తరుణంలోనైనా మహిళా చట్టాలు అమలవుతున్న తీరును, మహిళల సంక్షేమాన్ని, వారికి ఇచ్చే సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రాధాన్యతలను గురించి ప్రభుత్వం ఆలోచించాలి… ఆచరణలోకి తీసుకురావాలి. సమాజంపై ఎక్కువ ప్రభావం చూపే సినీరంగం నేరప్రేరేపిత అంశాల విషయంలో జాగ్రత్త పడాల్సిన సందర్భం ఇది. పౌరసమాజం కూడా సమాజం నుంచి ఈ నేర సంస్కృతిని తరిమికొట్టాలి.

Spread the love