శాస్త్రవేత్తల కృషికి ప్రోత్సాహమేది?

జాబిల్లిపై పరిశోధనల కోసం, భారత రోదసీ యాత్రలో మరో ముందడుగు వేసేందుకు లాండర్‌ను ప్రయోగించడంతో మనదేశం మంచి గుర్తింపును సాధించింది. ఇది విజయం సాధించగలిగితే చంద్రునిపై అడుగుపెట్టే దేశాలలో ప్రపంచంలో అమెరికా, సోవియట్‌ యూనియన్‌(రష్యా), చైనా తరువాత ఇండియా నాలుగోస్థానంలో నిలవబోతుంది. ఇంతటి అద్బుత విజయం వెనుక ఎంతో మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, టెక్నీషియన్లు, ఇతర కార్మికుల శ్రమ ఎంతో ఉంది.17 నెలలుగా జీతాలు లేకున్నా ఇంజినీర్లు చంద్రయాన్‌ -3 కోసం పనిచేశారు. దేశం సాధించబోయే విజయం కోసం అన్నిటిని దిగమింగుకుని రేయనకా, పగలనకా పనిచేశారు. వారిబాధలను పట్టించుకునేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సమయాన్ని కేటాయించకపోవడం దుర్మార్గం. అదానీ సేవలో తరిస్తున్న మోడీ… ఎన్నోమార్లు వేతనాల కోసం ఇంజినీర్లు అర్జీలు పెట్టుకున్నా కనికరించలేదు. ప్రపంచదేశాల్లో భారతదేశం సాధించేవన్నీ తన విజయాలుగా చెప్పుకుంటూ గొప్పలు పోతున్నారు. దీనికి సంబంధించి ఐఏఎన్‌ఎస్‌ వార్తా సంస్థ బయటపెట్టడంతో మోడీ ప్రభుత్వ నిర్వాకం తేటతెల్లమైంది.
ఇప్పటివరకు ఏ దేశం వెళ్లని… చంద్రుని దక్షిణ ధ్రువంపై పరిశోధనల కోసం ఇస్రో చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని చేపట్టింది. లాడర్‌ నింగిలోకి ఎగరగానే దేశంలో ఉన్నవారే గాకుండా ప్రపంచవ్యాప్తంగా భారతీయులంతా సగర్వంగా తలెత్తుకున్నారు. ఈ చంద్రయాన్‌3 లాంచ్‌ప్యాడ్‌ను జార్ఘండ్‌లోని రాంచీలో ఉన్న హెవీ ఇంజినీరింగ్‌ కార్పొరేషన్‌ (హెచ్‌ఈసీ) సిద్ధం చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వరంగ సంస్థే. గడువుకు ముందే హెచ్‌ఈసీ 2022 డిసెంబర్‌లోనే ఇస్రోకు అందజేసింది. ఇంత కష్టపడిన ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్‌లకు గత 17నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడాన్ని ఏమనుకోవాలి. సంస్థలో ఉన్న ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం లేదని ఏడాది కాలంగా జాతీయ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. దాదాపు రూ.1500కోట్ల విలువైన ఆర్డర్లు… ఇస్రో, రక్షణశాఖ, రైల్వే, కోల్‌ ఇండియా నుంచి వచ్చినప్పటికీ… నిధుల కొరత కారణంగా 80శాతం పనులు హెచ్‌ఈసీలో నిలిచిపోవడం గమనార్హం. రూ.1000 కోట్ల నిధులు అందించాలని ఎన్నోసార్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖను కోరినా ఫలితం లేకుండా పోయిందనేది హెచ్‌ఈసీ ఆవేదన. రెండున్నరేండ్లుగా కీలకమైన సీఎండీ పదవి ఖాళీగా ఉండటం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. జీతాల చెల్లింపుల్లో సమస్య ఉన్నా లాంచ్‌ప్యాడ్‌ సహా ఇతర కీలక సామాగ్రిని ముందే డెలివరీ చేసినట్టు హెచ్‌ఈసీ పేర్కొంది. చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతం కావడం పట్ల సంతోషంగా ఉందని హెచ్‌ఈసీ ఇంజినీర్‌ సుభాష్‌ చంద్ర ప్రకటించడం వారి హుందాతనానికి నిదర్శనం.
చంద్రయాన్‌-2 ప్రయోగం సమయంలోనూ ప్రధాని మోడీ శాస్త్రవేత్తల కృషిని మనస్ఫూర్తిగా మెచ్చుకోలేదు. ల్యాండర్‌ సవ్యంగా దిగకపోవడం ఇస్రోచైర్మెన్‌ శివన్‌ను ఉద్వేగానికి గురిచేస్తే, మోడీ ఆయనను వెన్నుతట్టి ఓదార్చినట్టు వార్తలు మీడియాలో వచ్చినా అదంతా బూటకమని తేలింది. ఆనాడు నిద్రపోకుండా శాస్త్రవేత్తలతో కలిసున్న మోడీ… ప్రయోగం విఫలమైందన్న కారణంతో శాస్త్రవేత్తలపై రుసరుసలాడుతూ అక్కడి నుండి బయటకెళ్లిన వీడియోలు బయటకొచ్చాయి. విజయవంతమైతే తన కృషిగా చెప్పుకోవడం… విఫలమైతే మరొకరిపై నెట్టేయడం ఆ రోజే దేశమంతా చూసింది. అంతేకాదు. చంద్రయాన్‌-2 ప్రయోగం ద్వారా దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెడదామని అహౌరాత్రులు శ్రమించిన ఇస్రో శాస్త్రవేత్తల వేతనాల్లోనూ మోడీ ప్రభుత్వం కోత పెట్టింది. ఇస్రో ప్రయోగానికి ముందు ఒక్కొక్కరికి పదివేల రూపాయల వేతనాన్ని కట్‌ చేసి ఉత్తర్వులు ఇచ్చి శాస్త్రవేత్తల్లో ఆనందాన్ని లేకుండా చేసింది. ఇదేనా మోడీ ప్రభుత్వం శాస్త్రవేత్తలకూ, ఇంజినీర్లకు ఇచ్చే గౌరవం?
ప్రయోగకేంద్రాలను, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను పెట్టుబడుదారులకు అప్పజెప్పేందుకే మోడీ ప్రభుత్వం నిధుల జాప్యం చేసినట్టు తెలుస్తోంది. హెచ్‌ఈసీకి అడిగిన నిధులు ఇవ్వకపోవడానికి ఆ సంస్థను అదానీకి కట్టబెట్టబోతున్నారని సమాచారం. మతాన్ని రాజకీయాలకు ఉపయోగించుకుంటూ ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్న మోడీ… సైన్సుపరంగా చేసే ఆవిష్కరణలను ప్రోత్సహిస్తారని అనుకోవడం అసంభవం. ఇంకోవైపు సైన్సు అవార్డులను బీజేపీ ప్రభుత్వం నిలిపేసింది. ఉపయోగంలేని వాటికి కోట్ల రూపాయలు కట్టబెడుతూ దేశానికి పనికొచ్చే రంగాలకు నిధులివ్వడం లేదంటే… బీజేపీ పాలనలో దేశం పయనం ఏదిశగా పోతుందో అర్థం చేసుకోవచ్చు. స్వావలంబన పేరుతో దేశ అవసరాలకు ఉపయోగపడే వాటిని విదేశీయులకు, పెట్టుబడిదారులకు కట్టబెడుతున్న మోడీ దుర్మార్గాన్ని వ్యతిరేకించాలి. కేంద్రప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవాలి. అదేవిధంగా స్వయంశక్తితో ఎదిగేందుకు ఇస్రోకు యావత్‌ జాతి మద్దతు కొనసాగాలి.

Spread the love