కమ్ముకుంటున్న ‘కరువు’ మేఘాలు

అన్నదాతల ఇంట్లో సిరులు కురిపిస్తూ దేశం, రాష్ట్రం అన్నపూర్ణగా వెలుగొందేలా చేసే వానాకాలం సీజన్‌ గడిచిపోతోంది. మన దేశంలో ఉత్తరాదిన అతివృష్టి, దక్షిణాదిన అనావృష్టి తాండవించే చాయలు కమ్ముకున్నాయి. ఈ సీజన్‌లో వాతావరణ పరిస్థితులు, అడపా దడపా పడే వర్షాలతో రాష్ట్రంలో పంటల సాగు చేయడంలో అనూహ్య పరిణామాలు కొనసాగుతున్నాయి. జూన్‌, జూలై నెలలో వర్షాలు తగినంత లేకపోవడంతో విత్తనాలు వేసినా మొలకెత్తకపోవడం, అక్కడక్కడ మొలకెత్తినవి కూడా ఎండిపోవడం జరుగుతున్నది. దీంతో మళ్లీ మళ్లీ విత్తనాలు, వరి నార్లు పో(వే)యాల్సి వస్తుంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 36లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యా యని సమాచారం. అందులో సుమారు 4లక్షలకు పైగా ఎకరాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. వరి 2లక్షల ఎకరాలు, పత్తి లక్షన్నర ఎకరాలు, మొక్కజొన్న, కంది ఇతర పంటలు కలిపి మరో 50వేల ఎకరాలలో మూడుసార్లు విత్తనాలు వేయడం గమనార్హం. వర్షాకాలం సీజన్‌లో అరకొర వర్షపాతంతో రైతులు వారి పొలాల్లో మూడుసార్లు విత్తనాలు నాటినవి తడిలేక మొలకెత్తకపోవడంతో రైతులకు ఆర్థిక భారం పెరిగిపోతుంది. ఇప్పటికీ వానలులేక పంటల సాగుకు తీవ్ర ఆలస్యమవుతున్నది. దీంతో రైతులు ప్రతిరోజు విత్తనాలు నాటి మేఘాల వైపు చూస్తున్నారు. ప్రతిరోజూ వాతావరణం మేఘామృతం అవ్వడం… ఉక్కపోతగా ఉంటుంది. కానీ వర్షం మాత్రం పడటం లేదు. మబ్బు కావడమే తప్ప భారీ వర్షాల జాడే లేదు. ఇలా మన రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల్లో రాష్ట్ర రైతాంగం బెంబేలెత్తిపోతున్నది. వర్షం కురవకపోగా, వర్షాకాల సీజన్‌ దాటిపోతున్న తరుణంలో కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయని ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇలాగే ఉంటే కరువును ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడానికి సంసిద్ధం కావాల్సి ఉంది.
వర్షపాతం ఆధారంగా కరువును అంచనా వేస్తారు. దానికి కొన్ని ప్రత్యేక నిబంధనలున్నాయి. వరుసగా ఇరవై ఒక్క రోజులు వర్షం పడకపోతే కరువు ఛాయలు నెలకొన్నట్టుగా భావిస్తారు. అలాగే ఇరవై ఒక్క రోజుల నుండి 28 రోజులు వర్షం కురవ(పడ)కపోతే ”కరువు” కింద అంచనా వేస్తారు. ఇకపోతే 28 నుంచి 43 రోజులు వానరాకపోతే ”తీవ్రమైన కరువు”గా నిర్ణయిస్తారు. అలాగే పడాల్సిన దానికన్నా 19శాతం లోపు వర్షపాతం తక్కువ పడితే ”లోటు” వర్షపాతంగా, 35శాతం లోపు పడితే ”కరువు” ప్రాంతంగా 35 పైన పడకపోతే ”తీవ్రమైన కరువు”గా భావిస్తారు. వర్షం పడాల్సిన దానికంటే 25శాతం లోపు ఉన్న జిల్లాలు మన రాష్ట్రంలో ఇప్పుడు 30 ఉండగా 20 శాతం లోపు జిల్లాలు సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్‌, నారాయణఖేడ్‌, నల్గొండ, నాగర్‌కర్నూలు జిల్లాలున్నాయి. ప్రభుత్వ గణాంకాల మేరకు వానాకాలంలో 1.34కోట్ల ఎకరాల్లో పంటలు వేయాలి. కానీ వర్షాభావంతో సాగు విస్తీర్ణం తగ్గినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితులు ఇలానే మరో పది రోజులు కొనసాగితే, వరి మినహా తక్కువ కాలంలో పండే మెట్ట పంటల విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలి. ఆ వైపుగా రైతులను చైతన్యపరచాల్సి ఉందని వ్యవసాయశాఖ నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి కరువు పరిస్థితుల నుండి ప్రభుత్వాలు గుణపాఠం నేర్చుకొని ప్రాజెక్టులు, చెరువులు, కాలువలు వానాకాలంకంటే ముందే మరమ్మతులు చేస్తే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం తక్కువ ఉండేది. కొద్దిపాటి వర్షం పడినప్పటికీ ఆ నీరును వృథా కాకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీరు వెళ్లేలా ప్రణాళికలు, విధి విధానాలు అమలు జరపాల్సి ఉంది. రుతుపవనాల రాక ఆలస్యంతో పాటు ఎల్‌నినో వాతావరణ పోకడతో మన దేశంలో 70శాతం వర్షపాతానికి కారణమయ్యే నైరుతి రుతుపవనాలను దెబ్బతీసినట్లు సమాచారం. వర్షాలు తగ్గడానికి దీని ప్రభావం ఉండచ్చనే అంచనా. ఇది ఆహార ఉత్పత్తులపైన కూడా పడితే పంటల దిగుబడులు తగి నిత్యవసరాలకు కూడా కొరత ఉండే ప్రమాదం ఉంది. దీని ఫలితంగా ధరలు కూడా పెరిగే అవకాశం కూడా కనిపిస్తున్నది. ఈ ప్రత్యేక అసాధారణ, వాతావరణ పరిస్థితులు, కరువు పరిణామాల నుండి రైతాంగాన్ని, ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది.
వ్యవసాయశాఖ, రెవెన్యూ శాఖలను వెంటనే అప్రమత్తపరిచి తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, కరువు కోరల నుండి రైతాంగాన్ని, ప్రజలను కాపాడాలి. వెంటనే రాష్ట్రం ఈ ప్రత్యేక నివేదికలు కేంద్రానికి పంపిస్తూ, రాజకీయాలకతీతంగా రాబోయే విపత్తు నుండి ప్రజలను కాపాడాల్సి ఉంది. మొన్నటిదాకా కరోనా విజృంభనతో అతలకుతలమైన ప్రజలు, ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న వేళ మరోరూపంలో కరువు మేఘాలు కమ్ముకుంటున్నాయి. ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం. ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తే ఆహార, ఆర్థిక సంక్షోభం వైపు దారి తీస్తుంది. ప్రభుత్వాలకు స్థితప్రజ్ఞత, ముందుచూపు ఎంతో అవసరం. ఇది రైతుల సమస్య మాత్రమే కాదు. యావత్‌ భారతజాతి సమస్యగా భావించాలి.
మేకిరి దామోదర్‌ 9573666650

Spread the love