సామ్రాజ్యవాద దేశాలతోపాటు జి-20లో భారతదేశం గాని మరేదైనా మూడవ ప్రపంచదేశం గాని పాల్గొనడం వల్ల ఏమిటి ప్రయోజనం? మొత్తంగా మూడవ ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న ఉమ్మడి, తక్షణ సమస్యలను ఆ జి-20 సమావేశాల వేదిక మీద లేవనెత్తగలిగితేనే ఏదైనా ప్రయోజనం ఉంటుంది. భారతదేశం జి-20 దేశాల సమావేశానికి అధ్యక్ష హౌదాలో ఆతిథ్యం ఇవ్వనుంది. మూడవ ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన సమస్య విదేశీ రుణాల చెల్లింపు సమస్య. ఈ సమస్యను ఆ సమావేశాల్లో భారతదేశం తప్పనిసరిగా లేవనెత్తాలి. అప్పుడే ఆ జి-20 సమావేశాలలో పాల్గొన్నందుకు సార్థకత లభిస్తుంది. ఇంతకీ ఈ విదేశీ రుణాల చెల్లింపు సమస్య ఏమిటి?
సంపన్న పెట్టుబడిదారీ దేశాలు తమ దేశీయ వినిమయాన్ని గాని, తమ స్వంత పెట్టుబడులను గాని కుదించుకుని మిగిల్చిన ఆర్థిక వనరులను మూడవ ప్రపంచదేశాలకు రుణంగా ఇస్తున్నాయని చాలామంది అనుకుంటారు. మరి వాస్తవం ఏమిటి? మూడవ ప్రపంచదేశాలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలనుండి (ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్) రుణాలు తీసుకుంటాయి. విదేశీఎగుమతి, దిగుమతుల లావాదేవీలలో వచ్చిన ఆదాయం కన్నా చెల్లించవలసినదే ఎక్కువైనప్పుడు ఆ లోటును భర్తీ చేసుకోడానికి రుణం అవసరం అవుతుంది. ఒకవేళ తీసుకున్న రుణంలో లోటును భర్తీ చేయగా ఇంకా మిగిలిపోతే అప్పుడు ఆ మేరకు విదేశీమారక ద్రవ్యం నిల్వలకు తోడవుతుంది. అప్పుడు దానిమీద చక్రవడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అందుకే మూడవ ప్రపంచదేశాలు విదేశీ చెల్లింపుల్లో లోటు ఏ మేరకు ఏర్పడుతుందో ఆ మేరకే విదేశీ రుణం తీసుకుంటాయి. ఈ విదేశీ రుణం ఏర్పాటు చేయడానికి సంపన్న పశ్చిమ దేశాలు తమ వనరులనుండి కొంత భాగాన్ని త్యాగం చేశాయి గనుక ఆ త్యాగానికి బదులు తీర్చుకోడానికి మూడవ ప్రపంచదేశాలు వడ్డీతో సహా ఆ రుణాలను తప్పకుండా తిరిగి చెల్లించాలి. – ఇది సామ్రాజ్యవాద దేశాలు, వారి తైనాతీలుగా వ్యవహరించే ఆర్థిక వేత్తలు ప్రచారంలో పెట్టే వాదన.
చాలా ప్రాథమికమైన ఆర్థిక సూత్రాల దృష్యా చూసినా, ఈ వాదన పూర్తిగా తప్పు. అదెలాగో చూద్దాం… ఏదైనా ఒక సరుకు మార్కెట్‌లో సరఫరా అవుతున్నమేరకు దానికి డిమాండ్ లేదనుకుందాం. అప్పుడు ఆ తేడాను మూడు విధాలుగా సర్దవచ్చు. మొదటిది: ఆ సరుకు ధర తగ్గవచ్చు. రెండవది: ఆ సరుకును అంతటినీ మార్కెట్‌లోకి విడుదల చేయకుండా కొంతభాగాన్ని నిల్వగా అట్టిపెట్టవచ్చు. మూడవది: దాని ఉత్పత్తిని తగ్గించేయవచ్చు. అయితే, సాధారణంగా వినిమయ వస్తువుల ధరలను, సేవల ధరలను గుత్తాధిపతులు నిర్ణయిస్తారు. అందువలన వాటి ధరలు మార్కెట్‌లో పడిపోవు (ఆ గుత్తాధిపతులు కావాలని తగ్గిస్తే తప్ప). అదే విధంగా సరుకుల నిల్వలను ఎక్కుకాలం పాటు నిల్వ ఉంచుకోరు. వాటిని ఏదోవిధంగా తొందరగా వదిలించుకుంటారు. అందుచేత ఒకానొక సరుకుకు మార్కెట్‌లో డిమాండ్ గనుక తగ్గితే, ఆ సరుకు ఉత్పత్తిని తగ్గించడం జరుగుతుంది. అంటే మార్కెట్‌లో ఆ సరుకుకు ఎంత డిమాండ్ ఉండబోతోందో ఆ మేరకే ఆ సరుకు ఉత్పత్తి జరుగుతుంది. అందుకే పెట్టుబడిదారీ విధానాన్ని డిమాండ్-నియంత్రిత వ్యవస్థ అంటాం (సరుకు అవసరాన్ని బట్టి గాక ఆ సరుకును కొనగలిగేవారు ఎందరుంటారో ఆమేరకే ఉత్పత్తి చేయడం). పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రజల కొనుగోలుశక్తి తగ్గుతూనే ఉంటుంది గనుక స్థూల ఉత్పత్తి గాని, అదనపు ఉద్యోగాల కల్పన గాని జరగదు.
విదేశీ వ్యాపారంలో మూడవ ప్రపంచదేశాలకు ఏర్పడే చెల్లింపుల లోటు అంటే అది ఆ విదేశీ వ్యాపారంలో సంపన్న పెట్టుబడిదారీ దేశాల వద్ద ఏర్పడే చెల్లింపుల మిగులు మాత్రమే. మూడవ ప్రపంచదేశాల సరుకులతో పోల్చితే సంపన్న పెట్టుబడిదారీ దేశాలు ఉత్పత్తి చేసే సరుకులకు ప్రపంచం మొత్తం మీద ఉన్న డిమాండ్ ఎక్కువగా ఉండబట్టే వాటివద్ద ఆ చెల్లింపుల మిగులు ఏర్పడుతుంది. సంపన్న పెట్టుబడిదారీ దేశాల నుండి మూడవ ప్రపంచదేశాలు సరుకులను, సేవలను కొనుగోలు చేస్తాయి. అదే సంపన్న దేశాల వద్ద చెల్లింపుల మిగులు రూపంలో కనిపిస్తుంది. ఆ మేరకే ఆ సంపన్నదేశాలు రుణాలను మూడవ ప్రపంచదేశాలకు ఇస్తాయి. అంతే తప్ప తమ దేశీయ వినిమయాన్నో, దేశీయ పెట్టుబడులనో తగ్గించుకుని (త్యాగం చేసి) రుణాలు ఇవ్వవు (క్రెడిట్ కార్డుల సదుపాయం అంతిమంగా బ్యాంకులకే లాభం కాని వినియోగదారుడికి కాదు. మూడవ ప్రపంచదేశాల విదేశీ రుణం కూడా అలాంటిదే).
అంతే కాదు. సంపన్న దేశాలు మూడవ ప్రపంచ దేశాలకు ఇచ్చే రుణాలు వాస్తవానికి అవి అదనంగా చేసే పొదుపు మాత్రమే. ఉదాహరణకు ఒకానొక సంపన్న దేశం 100డాలర్లను రుణంగా ఇచ్చిందనుకుందాం. అది ఆ దేశం చేసిన పొదుపు. 100డాలర్ల మేరకు పొదుపు చేయగలగాలంటే ఆ దేశం ఎంత వినిమయం అదనంగా చేయాలి? లెక్క కోసం ఆ దేశం వినిమయం-పొదుపు నిష్పత్తి 100:25గా ఉందనుకుందాం (అంటే 25డాలర్ల పొదుపు చేయాలంటే 100డాలర్ల వినిమయం అదనంగా పెంచాలి). ప్రస్తుత ఉదాహరణలో 100డాలర్ల పొదుపునకు గాను ఆ దేశం 400డాలర్ల మేరకు దేశీయ వినిమయాన్ని పెంచాలి. అంటే ఒక సంపన్న దేశం మూడవ ప్రపంచదేశానికి ఇచ్చే రుణం తన దేశీయ వినిమయాన్ని తగ్గించుకుని త్యాగం చేసి ఇచ్చేది కాదు సరికదా, అందుకోసం తన దేశీయ వినిమయాన్ని మరింత పెంచుతుంది. ఈ రుణాన్నే ఇవ్వకపోతే ఆ సంపన్నదేశం తన దేశీయ వినిమయాన్ని అంతగా పెంచుకోగలిగేది కాదు. దేశీయ వినిమయం పెరగడం అంటే ఆ మేరకు ఆ సంపన్న దేశంలో ఉపాధి కూడా పెరుగుతుంది. ఆ విధంగా మూడవ ప్రపంచదేశాలకు ఇచ్చే రుణం ఫలితంగా సంపన్న దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను మరింత బలపరుచుకోగలుగుతాయి. అంతే తప్ప త్యాగం చేసి కోల్పోయేది ఏమీ ఉండదు.
ఇప్పుడు ఈ సంపన్న దేశాలు మూడవ ప్రపంచ దేశాలకు ఇచ్చిన రుణం మొత్తాన్ని మాఫీ చేశాయి అనుకుందాం. దానివలన ఆ సంపన్న దేశాలు ఏం కోల్పోతాయి? రుణాన్ని మాఫీ చేసేనాటికన్నా ముందు సంపన్న దేశాలు ఉండే పరిస్థితికి, మాఫీ చేశాక ఏర్పడే పరిస్థితికి తేడా ఏముంటుంది? నిజానికి రుణం ఇచ్చిననాటికన్నా వాటిని మాఫీ చేసేనాటికి ఆ సంపన్నదేశాలలో వినిమయం గాని ఉపాధి కాని మెరుగుపడతాయి (వ్యక్తుల విషయంలో కూడా అప్పు తీసుకున్నవాడు వడ్డీ నిమిత్తం చెల్లించేది అసలు కన్నా కూడా ఎక్కువైపోయే సందర్భాలు చాలానే ఉంటాయి. అటువంటి సందర్భాల్లో అసలును మాఫీ చేయమని అడగడం కద్దు). ఇలా రుణాలను మాఫీ చేయాలనే డిమాండ్ బలంగా మూడవ ప్రపంచదేశాలవైపు నుండి తలెత్తకుండా ఉండాలనే సంపన్న దేశాల ప్రతినిధులు, వారి తైనాతీలుగా ఉండే ఆర్థికవేత్తలు, బ్రెట్టన్‌వుడ్ సంస్థలు ఈ ”త్యాగం” సిద్ధాంతాన్ని ముందుకు తెస్తున్నాయి. నిజానికి ఈ తరహా సిద్ధాంతాలనే మార్క్స్ ”వికృత ఆర్థిక సిద్ధాంతాలు” అని తూర్పారబట్టాడు. అంతేగాక సంపన్న దేశాలవద్ద ఉండే ఆర్థిక వనరులను తమ స్వంత అవసరాలకు వాడుకోకుండా రుణాలుగా ఇస్తున్నట్టు చిత్రించడం ద్వారా వాటివద్ద పరిమితంగానే ఆర్థిక వనరులు ఉన్నాయన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు.
ప్రసిద్ధ ఇంగ్లీష్ ఆర్థిక వేత్త జాన్ మేనార్డ్ కీన్స్ మహామాంద్యం కాలంలో ఒక వ్యాఖ్య చేశాడు. అది పైకి చూడడానికి చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. అతనేం అన్నాడో చూడండి… ప్రభుత్వ ప్రాజెక్టుల్లో కార్మికులను పనిలో పెట్టి వాళ్ళని ముందు కొన్ని గోతులు తవ్వమని, ఆ తర్వాత వాటిని పూడ్చివేయమని ఆదేశించి అందుకోసం వాళ్ళకి కూలీగా 100డాలర్లు చెల్లిస్తే దానివలన సమాజానికి లాభం కలుగుతుంది. అటువంటి పనికిమాలిన ప్రాజెక్టులకోసం చేసే 100డాలర్ల ఖర్చు వలన సమాజంలో అదనంగా 300డాలర్ల మేరకు వినిమయం పెరుగుతుంది. వినిమయం పెరిగిన మేరకు అదనపు ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయి. దాని వలన సమాజంలో మెరుగైన పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడు మూడవ ప్రపంచదేశాలకు ఇచ్చిన రుణాన్ని మాఫీ చేసే విషయంలోనూ ఇదే సామ్యం వర్తిస్తుంది. ఆ విధంగా మాఫీ చేసినా సంపన్న దేశాలు నష్టపోయేదేమీ లేదు.
బహుశా ఇదే దృక్పధంతో బ్రాండ్ట్ కమిషన్ సిఫార్సు చేసివుండాలి. సంపన్న దేశాలు తమ జీడీపీలో ఒక శాతం మొత్తాన్ని కడుపేద దేశాల రుణాల మాఫీ నిమిత్తం కేటాయించాలని ఆ కమిషన్ సిఫార్సు చేసింది. ఆ విధంగా మాఫీ చేయడం వలన సంపన్న దేశాలకు నష్టం రాదు సరికదా మాఫీ చేసిన మొత్తానికి మూడు, నాలుగు రెట్లు తమ స్వంత దేశాల్లో వినిమయం, ఉపాధి పెరుగుతాయి.
ఇంతదాకా మనం మూడవ ప్రపంచదేశాలు కేవలం సంపన్న పశ్చిమ దేశాలవద్దనే రుణాలు తీసుకుంటున్నాయి అన్న కోణం నుండి చర్చించాం. కాని కొంత రుణాన్ని అవి చైనానుండి కూడా పొందుతున్నాయి. సంపన్న దేశాల బ్యాంకుల మధ్యవర్తిత్వంతో అందుకు సంబంధించిన లావాదేవీలు జరుగుతాయి. చైనాతో బాటు కొన్ని చమురు ఉత్పత్తి చేసే దేశాలు కూడా ఈ రుణాలిస్తాయి. అయితే చైనాకు గాని చమురు ఉత్పత్తి చేసే దేశాలకు గాని పైన చెప్పిన వాదనలు వర్తించవు. దానికి కారణం చైనా గాని, చమురు ఉత్పత్తి దేశాలు గాని డిమాండ్-నియంత్రిత వ్యవస్థలుగా లేవు (వినిమయ సరుకుల ఉత్పత్తి, సేవల ఉత్పత్తి ప్రధానంగా ఉండేది సంపన్న పశ్చిమ దేశాలలో. అక్కడ డిమాండ్-నియంత్రిత వ్యవస్థ ఉంటుంది. కాని చైనాలో, చమురు ఉత్పత్తి దేశాలలో వాటితోబాటు వ్యవసాయం లేదా సహజవనరుల ఉత్పత్తి కూడా ఉంటుంది). అందుచేత మూడవ ప్రపంచ దేశాలు చైనాతో, చమురు ఉత్పత్తి దేశాలతో రుణాల విషయంలో వేరే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. పశ్చిమ దేశాల బ్యాంకుల ద్వారా కాకుండా ఆ దేశాలతో నేరుగా సంప్రదింపులు జరిపి రుణాల విషయంలో మాఫీని గాని రాయితీలను గాని పొందాలి. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థమీద సంపన్న పశ్చిమదేశాల పెత్తనం బలహీనపడుతోంది గనుక చైనాతో గాని చమురు ఉత్పత్తి దేశాలతో గాని నేరుగా సంప్రదింపులు జరపడానికి అవకాశాలు మెరుగయ్యాయి.
ఇక సంపన్న దేశాలిచ్చిన రుణాల విషయంలో ఆ దేశాలేవో త్యాగాలు చేసేసి రుణాలిస్తున్నాయన్న తప్పుడు అభిప్రాయాన్ని వదిలించుకుని రుణాలను తిరిగి చెల్లించే విధివిధానాలను తమ తమ దేశాల ఆర్థిక వ్యవస్థల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండేవిధంగా మార్చడానికి ఒత్తిడి చేయాలి. ఐఎంఎఫ్ ప్రతిపాదించే ”ఉద్ధరణ” ప్యాకేజీలు నిజానికి రుణాలు తీసుకునే దేశాల ఆర్థిక వ్యవస్థలను, ఆ దేశాల ప్రజల జీవన పరిస్థితులను దారుణంగా దెబ్బతీస్తున్నాయి.
అయితే ఏ ఒక్క మూడవ ప్రపంచదేశమూ సంపన్న దేశాలకు ఈ విధమైన ప్రతిఘటనను ఇచ్చి తన దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే విధంగా రుణ బకాయిల చెల్లింపుల షరతులను తిరగరాయగలిగిన పరిస్థితి లేదు. కాని ఉమ్మడిగా అన్నిదేశాలూ కలిసికట్టుగా నిలవగలిగితే కొన్ని రాయితీలనైనా సాధించవచ్చు. ఉదాహరణకు: అన్ని దేశాలూ ఉమ్మడిగా పట్టుపడితే, రుణ బకాయిల చెల్లింపునకు ఇప్పుడు విధిస్తున్న గడువులకు బదులు, ప్రతీ దేశమూ తన ఎగుమతుల ద్వారా లభించే ఆదాయంలో ఒకానొక శాతాన్ని రుణబకాయిల నిమిత్తం చెల్లించేట్టు కొత్త నిబంధనలు ఉండాలని ఒత్తిడి చేయవచ్చు. అలాగే చెల్లించవలసిన మొత్తాన్ని కూడా గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఇది సాధ్యపడాలంటే రుణగ్రహీత దేశాల మధ్య ముందస్తు సంప్రదింపులు జరగాలి. ఆ తర్వాత రుణదాతలతో బేరసారాలు జరగాలి. జి-20లో సభ్య దేశంగా ఉన్న భారతదేశం ఇటువంటి దిశగా చొరవ తీసుకోవాలి. (స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్‌పట్నాయక్