వరదలు కావాలి… ఓ గుణపాఠం

ప్రకృతి నుండి ఆశించాలే తప్ప దానిని శాసించ కూడదనేది అక్షర సత్యం. న్యూటన్‌ శాస్త్రవేత్త చెప్పిన చర్యకి ప్రతిచర్య ఉంటుందనే సూత్రం పర్యావరణానికి కూడా వర్తిస్తుందేమో అన్న సందేహం నిన్నటి ఉత్తర భారత రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదల విలయాన్ని చూశాక కలుగకమానదు. విపత్తులు రావడానికి మానవుడు ఆవరణానికి చేస్తున్న ద్రోహమే అని నిర్మొహమాటంగా చెప్పొచ్చు. ఈ నెల 9 నుండి హిమాచల్‌ ప్రదేశ్‌, హర్యానా, పంజాబ్‌, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్‌లలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా నదులు పొంగి పొర్లుతున్నాయి. వరదలతో పాటుగా అక్కడక్కడ కొండచరియలు విరిగిపడడం వలన ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఈ రాష్ట్రాలలో భారీ వర్షానికి కారణం రుతుపవనాలు, వీటికి తోడైన పశ్చిమ దిశ గాలులని భారత వాతావరణశాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ గాలులనేవి మధ్యధరా సముద్రంలో ఉద్భవించి మధ్య ఆసియా తూర్పు ప్రాంతం వైపు కదిలే అల్పపీడనం. దీని కారణాన ఉత్తర భారతదేశ వాతావరణంలో మార్పులు వస్తాయి. జూలైలో దేశం మొత్తం మీద కంటే 30శాతం ఎక్కువ, వాయువ్యంలో సాధారణం కంటే 52శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. హిమాచలప్రదేశ్‌లో సాధారణ వర్షపాతం 8మిల్లీ మీటర్లు, కానీ ఈ ఆదివారం 103.4మిల్లీ మీటర్ల వర్షం పడింది. అదే రోజు రాత్రి ఎనిమిదిన్నర వరకు 36గంటల వ్యవధిలో ఢిల్లీలో రికార్డ్‌ స్థాయిలో 260మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నెల మొత్తంగా 195.8మిల్లీ మీటర్ల వర్షం కురియాల్సి ఉండగా రోజున్నరలోనే 30శాతం ఎక్కువ కురిసింది. ఈ 40ఏండ్లలో జులై నెలలో ఒకేరోజు అత్యధిక వర్షం నమోదైందని వాతావరణశాఖ తెలిపింది. 1958 తరువాత ఈ నెలలోనే జరగడం ఇది మూడోసారి. హిమాచల్‌ప్రదేశ్‌లో ఈసారి సగటు వర్షపాతం కంటే 10 రెట్లు ఎక్కువ కురిసింది.
గత యాభైఏండ్లలో తమ రాష్ట్రం ఇంత భారీ వర్షాలు చూడలేదని సాక్షాత్తూ హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్య మంత్రి చెప్పడం అక్కడి ఘోర పరిస్థితికి నిలువుటద్దం. ఈ రాష్ట్రంలో చాలా వంతెనలు తెగిపడ్డాయి. కార్లు, జీపులు, లారీలు వరదలో కొట్టుకుపోయాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లోని భుంతర్‌ వ్యాలీ వంతెన బియాస్‌నది వరదధాటికి కొట్టుకు పోయింది. ఎన్నో భవనాలు నేలమట్టమయ్యాయి. జల విద్యుత్‌ కేంద్రాలు మూతపడ్డ కారణంగా కొన్ని గ్రామాలు చీకట్లో కొట్టుమిట్టాడు తున్నాయి. చాలా గ్రామాల ప్రజలకు తాగునీరు, ఆహారం లేదు. అత్యవసర రోగులకు వైద్య సదుపాయం లేదు. పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి, వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. కోట్ల రూపాయల విలువైన ఆస్తి నష్టం జరిగింది. ఉత్తరాఖండ్‌లోనూ అదే పరిస్థితి. జుమ్మగడ్‌ నదిపై వంతెన కూలిపోవడం వలన చాలా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. గులార్‌ వద్ద కొండచరియలు విరిగిపడి గంగానదిలో జీపు పడి అందులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు చనిపోయారు. పోంచ్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఆర్మీ జవానులు ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయారు. ఎంతో మంది వరదల్లో చిక్కుకున్నారు. జమ్మూ శ్రీనగర్‌ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో ఎంతో మంది అమర్నాథ్‌ యాత్రికులు మార్గమధ్యంలో చిక్కుకున్నారు. ఢిల్లీలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. యమునా, బియాస్‌ నదులుతో చాలా నదులు పొంగిపొర్లు తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు వీధుల నుండి నీటిని పారదోలేందుకు అనేక ప్రాంతాల్లో పంపులను ఉపయోగించారు, ప్రజలు మోకాళ్లలోతు నీటిలో కొట్టుమిట్టాడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులిచ్చారు.
మన దేశ భూభాగంలో సుమారు 30శాతం వరదలకు గురవుతుంది. దేశంలో వరద ముప్పున్న 50మిలియన్‌ హెక్టార్ల భూమిలో 24.9శాతం ఉత్తరప్రదేశ్‌, 15శాతం బీహార్‌ రాష్ట్రాల్లోనే ఉంది. గంగా, బ్రహ్మపుత్ర, సింధు, ద్వీపకల్ప నదీ పరివాహక ప్రాంతాలలో ఎక్కువ వరదలొస్తాయి. ఈ వరదల వలన ప్రతీ ఏటా సుమారు 1464 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు 86,288 పశువులు మరణిస్తున్నాయి. అయితే ఈ వరదలు రావడానికి కారణం వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలన. పట్టణీకరణలో భాగంగా లోతట్టు పంటభూములను నివాస స్థలాలుగా మార్చడం, మైనింగ్‌ మొదలగు మానవ కార్యకలాపాలు ముఖ్య భూమికను పోషిస్తాయి. ఇంకా రోడ్లు, కరకట్టలు, రైల్వే మార్గాలు, కాలువలు మొదలైనవి. నదుల స్వేచ్ఛా ప్రవాహాన్ని అడ్డుకోవడం వరదలకు కారణమవుతున్నాయి. ప్రకృతి విపత్తులను అడ్డుకోవడం మానవతరమా? అనుకోవడం కంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అవాంతరాలను అరికట్టే అవకాశముందని నిపుణుల సూచన. ప్రధానంగా పర్యావరణ కాలుష్యం లేకుండా చూడటం, అడవులను కాపాడుకోవడం. పట్టణాల్లో వర్షం నీరు సాఫీగా పోయేటట్లు ప్రణాళికలు రూపొందించడం, ముందస్తు ప్రణాళికల సిద్ధం చేసుకోవడం, పర్యావరణానికి హానికలగకుండా చూడటం ద్వారా వరద ముప్పును అడ్డుకోవచ్చు.
– డి.జె మోహనరావు, 9440485824

Spread the love