కవిత బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు వాయిదా

– సీబీఐ, ఈడీ కేసుల్లో 6న తీర్పు : రౌస్‌ అవెన్యూ కోర్టు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్‌ పై తీర్పును రౌస్‌ అవెన్యూ కోర్టు(ట్రయల్‌ కోర్టు) ఈనెల 6కు వాయిదా వేసింది. లిక్కర్‌ కేసులో సీబీఐ, ఈడీ తనను అక్రమంగా అరెస్టు చేశాయని, తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ కవిత వేర్వేరుగా బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేశారు. సీబీఐ కేసులో గతనెల 22న విచారించిన రౌస్‌ అవెన్యూ కోర్టు తీర్పు మే 2కు రిజర్వ్‌ చేసింది. అనంతరం ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్‌ కేసులో మాత్రం బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును 6న వెలువరిస్తామని ట్రయల్‌ కోర్టు వెల్లడించింది. దీంతో సీబీఐ కేసులో శుక్రవారం కవిత బెయిల్‌ పిటిషన్‌ పై తుది తీర్పు వెలువడుతుందని భావించారు. అయితే ట్రయల్‌ కోర్టు ప్రారంభం కాగానే… తీర్పును వాయిదా వేస్తున్నట్టు స్పెషల్‌ జడ్జి కావేరి బవేజా వెల్లడించారు. ఈడీ కేసులో బెయిల్‌ పిటిషన్‌ తో కలిపి 6న సీబీఐ కేసులో తీర్పును వెలువరిస్తామని స్పష్టం చేశారు. కాగా, లిక్కర్‌ స్కాం వ్యవహారంలో ఈ ఏడాది మార్చి 15న ఈడీ, ఏప్రిల్‌ 11న సీబీఐలు కవితను అరెస్ట్‌ చేశాయి. అనంతరం ఆమెకు ట్రయల్‌ కోర్టు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. ప్రస్తుతం జైల్లో ఉన్న తనకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ కవిత రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఏడేండ్లలోపు శిక్ష పడే కేసులకు అరెస్టు అవసరం లేదని కవిత తరపున న్యాయవాది విక్రమ్‌ చౌదరి వాదనలు వినిపించారు. అలాగే పీఎంఎల్‌ఎ సెక్షన్‌ 45 ప్రకారం కవిత ..మహిళ కాబట్టి బెయిల్‌కు అర్హురాలని కోర్టుకు నివేదించారు. అప్రూవర్ల స్టేట్‌మెంట్లే తప్ప, సరైనా ఆధారాలు లేనందున కవితకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. అయితే, లిక్కర్‌ స్కాంలో కవితదే కీలకపాత్రని సీబీఐ తరపు న్యాయవాది పంకజ్‌ గుప్తా ఆరోపించారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, ఆమె బయటికి వస్తే కేసును ప్రభావితం చేస్తారని, అందువల్ల బెయిల్‌ ఇవ్వొద్దని కోరారు. మరోవైపు కవిత జ్యుడిషియల్‌ కస్టడీ ఈనెల 7తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్‌ వస్తుందా? లేదా అన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవేళ ట్రయల్‌ కోర్టు కవితకు బెయిల్‌ తిరస్కరిస్తే.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని ఆమె తరపు న్యాయవాదులు యోచిస్తున్నట్టు తెలిసింది. గతంలో కవిత తన మైనర్‌ కొడుకు ఎగ్జామ్స్‌ నేపథ్యంలో మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేయగా, ఈ బెయిల్‌ ఇచ్చేందుకు ఇది సరైన కారణం కాదంటూ ట్రయల్‌ కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.

Spread the love