యువరాజును ప్రధానిగా చేయాలని పాక్‌ ఉబలాటం

– రాహుల్‌పై మోడీ వ్యంగ్యాస్త్రాలు
– కాంగ్రెస్‌ చనిపోతుంటే పాకిస్తాన్‌ విలపిస్తోంది
– రాజ్యాంగాన్ని మార్చాలని కాంగ్రెస్‌ అనుకుంటోంది
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ యువరాజు రాహుల్‌ గాంధీని దేశ ప్రధానిని చేయాలని పాకిస్తాన్‌ ఉబలాట పడుతోందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇందుకోసం పాకిస్తాన్‌లో నాయకులు ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తున్నారని విమర్శించారు. పాకిస్తాన్‌కు కాంగ్రెస్‌ అంటే అభిమానం అనే విషయం అందరికీ తెలిసిందేనని, కాంగ్రెస్‌ పార్టీ కూడా పాకిస్తాన్‌ను అనుసరిస్తుందని, వాటి మధ్య ఉన్న అనుబంధం ఇప్పుడు బయటపడిందని చెప్పారు. ఇక్కడ కాంగ్రెస్‌ చనిపోతుంటే అక్కడ పాకిస్తాన్‌ విలపిస్తోందని గురువారం గుజరాత్‌లోని ఆనంద్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ ఎద్దేవా చేశారు. పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ క్యాబినెట్‌లో పనిచేసిన చౌదరి ఫవాద్‌ హుస్సేన్‌ బుధవారం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని ప్రశంసించిన నేపథ్యంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీని, మోడీని లక్ష్యంగా చేసుకొని రాహుల్‌ విమర్శలు చేస్తున్న ఓ వీడియోను హుస్సేన్‌ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ‘రాహుల్‌ ఆన్‌ ఫైర్‌…’ అంటూ దానికి ఓ వ్యాఖ్యను జత చేశారు. మోడీ తన ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్‌పై మండిపడుతూ ‘ఈ దేశం 60 సంవత్సరాల పాటు కాంగ్రెస్‌ పరిపాలనను, పది సంవత్సరాల పాటు బీజేపీ సేవాకాల్‌ను చూసింది. 60 ఏండ్ల కాంగ్రెస్‌ పాలనలో గ్రామీణ జనాభాలో అరవై శాతం మందికి మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేదు. ఈ పనిని బీజేపీ కేవలం పదేండ్లలో పూర్తి చేసింది’ అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను ముస్లింలకు కట్టబెట్టడానికి రాజ్యాంగాన్ని మార్చాలని కాంగ్రెస్‌ పార్టీ కోరుతోందని మోడీ ఆరోపించారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం కోసం రాజ్యాంగాన్ని మార్చబోమని లిఖితపూర్వకంగా తెలపాలని ఆయన కాంగ్రెస్‌ను సవాలు చేశారు. బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను ఏకరువు పెడుతూ గత పదేండ్లలో 14 కోట్ల ఇండ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చామని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న 60 సంవత్సరాల్లో కేవలం మూడు కోట్ల ఇండ్లకు మాత్రమే కుళాయిలు వచ్చాయని చెప్పారు.
‘నేను గుజరాత్‌లో చాలా సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. 2014లో దేశానికి సేవ చేయమని మీరు నన్ను పంపారు. గుజరాత్‌లో పనిచేస్తున్నప్పుడు మనకు ఓ మంత్రం ఉండేది. అదేమిటంటే భారత్‌ అభివృద్ధి కోసం గుజరాత్‌ అభివృద్ధి. నాకు ఒకే ఒక కల ఉంది. 2047లో మనం వంద సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే సమయానికి మన దేశం వికసిత్‌ భారత్‌ కావాలి’ అని తెలిపారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన సంపన్న దేశంగా మార్చేందుకు రాత్రింబవళ్లూ కష్టపడతానని మీకు గ్యారంటీ ఇస్తున్నానని మోడీ చెప్పారు.

Spread the love