ఒంటిపై నోట్ల కట్టలతో పడుకున్న అస్సాం నేత..

నవతెలంగాణ గౌహతి: అస్సాంకు చెందిన ఒక రాజకీయ నాయకుడు బెడ్‌పై పడుకోగా ఆయన ఒంటిపై రూ.500 నోట్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలపై సీబీఐ, ఈడీని ఉసిగోల్పే బీజేపీ, దాని మిత్రపక్షం నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ఆప్‌ ప్రశ్నించింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అస్సాంలోని అధికార బీజేపీ మిత్రపక్షమైన యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్‌) మాజీ నేత బెంజమిన్ బాసుమతరీ (Benjamin Basumatary) ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఒంటి పైభాగంపై దుస్తులు లేకుండా బెడ్‌పై పడుకున్న ఆయన శరీరంతోపాటు చుట్టూ రూ.500 నోట్లు కుప్పగా పడి ఉన్నాయి.
మరోవైపు అది తన ఫొటోనే అని బెంజమిన్ బసుమతరీ ఒప్పుకున్నారు. అయితే ఐదేళ్ల కిందట తన స్నేహితులు ఒక పార్టీలో తీశారని తెలిపారు. ఆ ఫొటోలోని డబ్బు తన సోదరికి చెందినదని అన్నారు. అయితే బెంజమిన్‌ను ఈ ఏడాది జనవరి 10న పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్టు యూపీపీఎల్ అధ్యక్షుడు ప్రమోద్ బోరో తెలిపారు. ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంతోపాటు వీసీడీసీ చైర్మన్ పదవి నుంచి తొలగించినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో బెంజమిన్‌కు, తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.

Spread the love