సూర్యాపేటలో కదం తొక్కిన కలం వీరులు

– జర్నలిస్టుల జోలికి వస్తే సహించేది లేదు
– ఐఎంఏ చేసిన ప్రకటనపై జర్నలిస్టుల ఆగ్రహం
– డాక్టర్ ల వైఖరికి నిరసనగా జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ..జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు, బహిరంగ క్షమాపణ చెప్పాలి.
జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్ లతా కు వినతి పత్రం అందించిన జర్నలిస్టులు.
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్
సమాజంలో జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమైనదని,అలాంటి జర్నలిస్టులను అసభ్య పదజాలంతో దూషించడం తగదని పలు జర్నలిస్టు సంఘాల నాయకులు పేర్కొన్నారు. జర్నలిస్టులను కించపరిచేలా సోషల్ మీడియాలో ప్రెస్ నోట్ రిలీజ్ చేయడాన్ని నిరసిస్తూ బుధవారం సూర్యాపేట జర్నలిస్టులు యూనియన్లకు అతీతంగా ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట వాణిజ్య భవన్ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ ఈ నెల 22 న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మధుబాబు హాస్పిటల్ పై తనిఖీలు నిర్వహించగా తమ బాధ్యతగా ఆయా పత్రికలు, టీవీ చానల్స్ వార్తను కవర్ చేశాయని, మరుసటి రోజు ఐఎంఏ పేరుతో సోషల్ మీడియాలో మీడియాను నల్ల గొర్రెలతో పోల్చడంతో పాటు మీడియా పై తస్మాత్ జాగ్రత్త అంటూ బెదిరింపు ధోరణితో ప్రకటన వెలువరించడం ఎంత
వరకు సమంజసం అని వారు ప్రశ్నించారు.  సమాజానికి ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న జర్నలిస్టులను, వారి వృత్తిని ఎద్దేవా చేస్తూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.  కొందరు డాక్టర్లు ధనార్జనే ద్వేయంగా పెట్టుకొని  పేద ప్రజల రక్తాన్ని జలగల్లాగా తాగుతున్నారని ఆరోపించారు. అలాంటి హాస్పిటల్ లపై పరిశోధనాత్మక  వార్తలు రాస్తుంటే రాసే వారిపై నల్ల గొర్రెలతో పోల్చి భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రవర్తించడం సిగ్గుచేటని, డాక్టర్లు విలేకరులకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  లేనిపక్షంలో రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అక్రమ సంపాదనే ద్వేయంగా పనిచేస్తున్న కొందరు డాక్టర్లు  కావాలనే జర్నలిస్టులను  బెదిరించాలనే ధోరణితో, ఐఎంఏ పేరుతో ప్రకటనలు చేయడం దిక్కుమాలిన చర్యగా అభివర్ణించారు. నల్ల గొర్రెలుగా పోల్చిన ఈ జర్నలిస్టులే నల్ల సంపాదనను నల్ల రేసు కుక్కల వల్లే పసిగట్టి పరిశోధనాత్మక వార్తలు రాసి మీ అక్రమాల బండారాన్ని, బాగోతాన్ని ప్రజలకు తెలియజేస్తామని వివరించారు. కొందరు వైద్యులు ఆర్థికంగా బలోపేతం కావడం కోసం అక్రమ సంపాదన ధ్యేయంగా పెట్టుకొని పేద ప్రజల నుండి నానా రకాలుగా ఫీజులు, టెస్టుల రూపంలో దండుకుంటున్నారని అన్నారు. ఇలాంటి వార్తలను ప్రచురించిన వార్తాపత్రికలపై బెదిరింపు చర్యలకు పాల్పడుతున్న డాక్టర్లపై జిల్లా కలెక్టర్, వైద్య అధికారుల బృందం తనిఖీలు చేపట్టి ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న హాస్పిటల్ లపై తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న పలు ప్రవేట్ హాస్పిటల్ పై కార్య చరణ త్వరలో ఉంటుందని హెచ్చరించారు.
Spread the love