మంత్రిపై అలిగిన ఎంపీ

నవతెలంగాణ రాజమండ్రి: అమలాపురం ఎంపీ చింతా అనురాధ, మంత్రి విశ్వరూప్‌ మధ్య విభేదాలున్నాయన్న అంశం మంగళవారం స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమం బయటపెట్టింది. అమలాపురంలోని గడియారస్తంభం కూడలి వద్ద మాజీ ఎమ్మెల్యే చిట్టబ్బాయి విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. సభకు మంత్రి విశ్వరూప్‌ అధ్యక్షత వహించారు. ఎంపీ మిథున్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంత్రి దాడిశెట్టి రాజాతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుసగా ప్రసంగించారు. ఎంపీ చింతా అనురాధకు మాత్రం విశ్వరూప్‌ మైకు ఇవ్వకుండానే సభను ముగించేశారు. ఆమె అసంతృప్తితో అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఈ విషయంపై ఆమె అనుచరులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిట్టబ్బాయి విగ్రహం చుట్టూ చిన్నపాటి పార్కు ఏర్పాటుకు ఇప్పటికే ఎంపీ అనురాధ రూ.5 లక్షలు మంజూరు చేసినట్టు చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమ పార్టీకే చెందిన ఎంపీ విషయంలో మంత్రి వ్యవహరించిన తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

Spread the love