వివేకానందరెడ్డి కేసులో కొత్త ట్విస్ట్

నవతెలంగాణ హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు పలు మలుపులు తిరుగుతోంది. తాజాగా వివేకానందరెడ్డి కుమార్తె సునీత దంపతులపై, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై శుక్రవారం పులివెందుల కోర్టులో స్థానిక పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పమంటూ సీబీఐ ఎస్పీ, వివేకా కుమార్తె, అల్లుడు తనను తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారంటూ 2021 నవంబర్‌లో పులివెందుల పోలీసులకు వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. పోలీసులు కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ 2021 డిసెంబరు 28న పులివెందుల కోర్టును కృష్ణారెడ్డి ఆశ్రయించారు.
ఈ ఏడాది డిసెంబర్‌ 8న కోర్టు పిటిషన్‌ను పరిశీలించి కేసు రిజిస్టర్‌ చేసి జనవరి 4న తుది నివేదిక కోర్టుకు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు పులివెందుల అర్బన్‌ సీఐ, వివేకా హత్య కేసుపై దర్యాప్తు చేసిన మొదటి, రెండో సిట్ బృందాల వద్ద ఉన్న వివరాలు, క్లూస్‌ బృందం వద్ద ఉన్న ఇతర ఆధారాలు, సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలను ఛార్జిషీట్లో పొందుపరుస్తూ కోర్టుకు సమర్పించారు. 27 మంది సాక్షుల వాంగ్మూలాలను కూడా కోర్టుకు అందించారు.

Spread the love