నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోడీని కలిసి విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత రేవంత్ రెడ్డి ప్రధాని మోడీతో భేటీ కానుండటం ఇదే తొలిసారి కావడంతో ఈ భేటి ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు, ఎన్నికల్లో కష్టపడి పని చేసిన వారితోపాటు టికెట్లు త్యాగం చేసిన కాంగ్రెస్ నాయకులు నామినేటెడ్ పోస్టుల కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీ వెళ్లనున్న సీఎం, డిప్యూటీ సీఎం.. కాంగ్రెస్ పెద్దలతో సమావేశమై రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. అధికారం చేపట్టిన తరువాత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించనున్నారు. ఎమ్మెల్సీ పదవులు, లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై కీలకంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.