వృద్ధ దంపతులను కలిపిన ప్రజపాలన

-15 ఏండ్లుగా విడివిడిగా ఉంటున్న వృద్ధ దంపతులు
– ప్రజాపాలనలో దంపతులను కలిపిన అధికారులు
నవతెలంగాణ కొందుర్గు: ఒకే ఊర్లో ఉంటున్నా 15 ఏండ్లుగా కనీసం ఒకరినొకరు పలకరించుకోని  వృద్ధ దంపతులను ‘ప్రజా పాలన’ కలిపింది. జీవన మలిసంధ్య వయసులో ప్రజాపాలన సాక్షిగా దంపతులు ఒకటయ్యారు.  వివరాల్లోకి వెళితే… రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం లాలాపేట్‌కు చెందిన గొంగుపల్లి నరసింహులు (70), లక్ష్మమ్మ(65).  వీరి మధ్య వచ్చిన చిన్న చిన్న గొడవలతో పదిహేనేండ్ల క్రితం విడిపోయారు.  వీరిని కలిపేందుకు గ్రామస్థులు చేసిన ప్రయత్నాలన్ని విఫలమయ్యాయి. దాంతో చేసిది ఏం లేక అందరూ మిన్నకుండిపోయారు. వీరికి సుభానయ్య(40) సురేశ్‌ (35) కుమారులు. వారికి పెండ్లి అయి చేసుకొని భార్యాపిల్లలతో లాలాపేట్‌లోనే వేర్వేరు ఇళ్లలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులను కలిపేందుకు కొడుకుల ప్రయత్నాలు కూడా ఫలించలేదు.  అయితే, ప్రజాపాలన వారిని కలపడంలో సఫలం అయింది.
శుక్రవారం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలనకు సైతం విడివిడిగానే వచ్చారు ఈ దంపతులు. నరసింహులుకు వృద్ధాప్య ఫించన్‌ వస్తోంది. ఆయన ఒంటరిగా రేకుల షెడ్డులో ఉంటున్నాడు. లక్ష్మమ్మ కూడా మరో రేకుల షెడ్డులో ఉంటోంది. ఆమె అవసరాలకు కొడుకులు డబ్బు ఇస్తున్నారు. నరసింహులు తనకు ఇండ్లు కావాలంటూ.. లక్ష్మమ్మ తనకు పింఛన్‌ కావాలంటూ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. పరిశీలించిన అధికారులు.. దరఖాస్తుల్లో ఒక్కరి పేరే ఎందుకు ఉందని ఇద్దరినీ అడిగితే తాము ఎప్పుడో విడిపోయామని చెప్పారు. ఎంపీడీవో ఆంజనేయులు, ఉప తహశీల్దార్‌ కృష్ణ, సర్పంచ్‌ రాంరెడ్డి ఆ దంపతులతో మాట్లాడారు. ముసలితనంలో విడివిడిగా ఉండడం వల్ల ఇద్దరూ ఇబ్బందులు పడుతున్నారని, కలిసి ఉంటే ఒకరినొకరు తోడుగా ఉంటారని నచ్చజెప్పారు. కలిసి ఉంటే కోరిన విధంగా ఇండ్లు, పింఛన్‌, సబ్సిడీపై గ్యాస్‌ ఇచ్చే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో వృద్ధ దంపతులు కలిసి ఉండేందుకు ఒప్పుకున్నారు.

Spread the love