మార్చి 31న ‘ఇండియా’ కూటమి మెగా మార్చ్‌

నవతెలంగాణ ఢిల్లీ: ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (CM Arvind Kejriwal) అరెస్టును నిరసిస్తూ విపక్ష ‘ఇండియా’ కూటమి మెగా మార్చ్‌కు సిద్ధమైంది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో మార్చి 31న కేజ్రీవాల్‌కు సంఘీభావంగా బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపింది. ఇండియా ఫోరంలో ఉన్న కాంగ్రెస్‌, ఆప్‌లు ఢిల్లీలో ఆదివారం సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించాయి. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆప్‌.. తాము చేపట్టబోయేది రాజకీయ సభ కాదని పేర్కొంది. రాజకీయ నాయకులను బెదిరింపులకు గురిచేయడంతోపాటు విపక్షాల అడ్డు తొలగించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని ఆప్‌ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్‌ రాయ్‌ మండిపడ్డారు.
ఝార్ఖండ్‌లో హేమంత్‌ సోరెన్‌, బిహార్‌లో తేజస్వి యాదవ్‌లపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. కేజ్రీవాల్‌ కుటుంబాన్ని గృహ నిర్బంధం చేయడంతోపాటు, ఆప్‌ కార్యాలయాన్నీ సీజ్‌ చేశారని పేర్కొన్నారు. ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అరవింద్‌ సింగ్‌ లవ్లీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రులను అరెస్టు చేయడం, రాజకీయ పార్టీల ఖాతాలను నిలిపివేయడం ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ చర్యలపై విపక్ష పార్టీలు కలిసి పోరాడతాయని స్పష్టం చేశారు.

Spread the love