సీఏఏకు కొత్త పోర్టల్

నవతెలంగాణ న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA) కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మనదేశ పౌరసత్వాన్ని కల్పించడం లక్ష్యంగా నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ క్రమంలోనే సీఏఏ కింద దరఖాస్తుల స్వీకరణ కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం కొత్త వెబ్‌ పోర్టల్‌ https:/indiancitizenshiponline.nic.inను ప్రారంభించింది.
దీంతో పాటు CAA-2019 పేరుతో మొబైల్‌ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు వెల్లడించారు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం మన పౌరసత్వాన్ని ఇచ్చేందుకు కేంద్రం ఈ చట్టం (Citizenship (Amendment) Act) తెచ్చింది. 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి.

కావాల్సిన పత్రాలివే..
అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ ప్రభుత్వాలు జారీ చేసిన పాస్‌పోర్ట్‌, జనన ధ్రువీకరణ పత్రం లేదా ఇతర గుర్తింపు పత్రాలను పౌరులు సమర్పించాల్సి ఉంటుంది. దీంతో పాటు 2014 డిసెంబరు 31వ తేదీకి ముందే భారత్‌లోకి ప్రవేశించారని రుజువు చేసే డాక్యుమెంట్లను ఇవ్వాలి. అంటే, దేశానికి వచ్చిన సమయంలో వీసా కాపీ, ఇమ్మిగ్రేషన్‌ స్టాంప్‌, భారత్‌లో జారీ చేసిన రేషన్‌ కార్డు, ఇక్కడే జన్మిస్తే జనన ధ్రువీకరణ పత్రం, రిజిస్టర్డ్‌ రెంటల్‌ అగ్రిమెంట్‌, పాన్‌ కార్డు, విద్యుత్‌ బిల్లులు, బీమా పాలసీలు, ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ, మ్యారేజీ సర్టిఫికేట్‌ ఇలా ఏదైనా గుర్తింపు కార్డును సమర్పించాలి.

Spread the love