కర్నాటకలో పారని మోడీ ‘విద్వేష’ మంత్రం

కర్నాటక ఎన్నికల ఫలితాలు వచ్చి పదిహేను రోజులు అవుతున్నా దేశంలో చర్చ మాత్రం తగ్గడం లేదు. దానికి ప్రధాన కారణం బీజేపీ ఓడటం, కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ, అమిత్‌ షాల నాయ కత్వంలోని బీజేపీని గద్దెదించి ప్రతిపక్ష కాంగ్రెస్‌కు పట్టం కట్టడం శుభపరిణామం. ప్రధాని మోడీ సహా కమలం పార్టీ అగ్రనాయకులు అందరూ కర్నాటకలో ఊరూరా కలియదిరిగి వందలాది రోడ్‌ షోలు నిర్వహించినా ప్రజలు ఓటుతోనే బుద్ధిచెప్పారు. సమగ్రాభివృద్ధి జరగాలంటే డబుల్‌ఇంజన్‌ సర్కారుకు ఓటేయాలని కోరినా ప్రజలు తిరస్కరించారు. కమలం పార్టీకి కేవలం 66సీట్లు అనుగ్రహించి కాంగ్రెస్‌కు 135 స్థానాలు కట్టబెట్టారు. ఇది ప్రజల లౌకికతత్వానికి నిదర్శనం. బీజేపీ ఏలుబడిలో అవినీతి పరాకాష్టకు చేరి పేదలు, రైతులు, మధ్యతరగతి బతుకులు భారమ య్యనడంలో ఎలాంటి సందేహం లేదు. ’40శాతం కమీషన్ల అవినీతి ప్రభుత్వంగా బొమ్మై పాలన’ ఖ్యాతి గడిం చింది. మంత్రులు శాసనసభ్యులు అధికారులు ప్రతి పనికీం కమీషన్లు గుంజుతున్నారని కాంట్రాక్టర్ల సంఘం ప్రధాని మోడీకి కేంద్ర రాష్ట్ర నేతలకు ఫిర్యాదు చేసినా అవినీతి ఆగలేదు. కమీషన్ల ఒత్తిడులకు తాళలేక ఓ ప్రముఖ కాంట్రాక్టర్‌ ఆత్మహత్య చేసుకావడంతో అందుకు బాధ్యుడు అయిన ప్రజా పనుల శాఖా మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేయక తప్పలేదు. ‘నేను తినను… తిననివ్వను’ అని గంభీర ప్రకటనలు చేసిన మోడీ గానీ, బీజేపీ అగ్ర నాయకులు గానీ కర్నాటకలో అవినీతి అవధులు దాటుతున్నా నిరోధించే ప్రయత్నాలు చేయలేదు. పైగా ప్రధాని మోడీ ఈశ్వరప్పకు స్వయంగా ఫోన్‌ చేసి పార్టీ విజయానికి కృషి చేయాలని బుజ్జగించడం ప్రజలకు నచ్చలేదు. ప్రముఖ లింగాయత నేత యడ్యూరప్పను 75ఏండ్లు నిండాయనే సాకుతో సీఎం పదవినుండి తప్పించడం కూడా తక్కువ సీట్లు రావడానికి ఓ కారణంగానే చెప్పొచ్చు. మాజీ ముఖ్య మంత్రి జగదీష్‌ శెట్టర్‌, ఉపముఖ్యమంత్రి లక్ష్మన్‌ సవదిలకు కమలం టిక్కెట్లు నిరాకరించడం లింగాయతులలో తీవ్ర అసంతృప్త్తిని కలిగించింది. వారిరువురూ కాంగ్రెస్‌లో చేరడం హస్తం పార్టీకి లాభించింది. కాంగ్రెస్‌ 46మంది లింగాయతులకు టిక్కెట్లు ఇవ్వగా 39మంది విజయం సాధించారు.
కర్నాటక జనాభాలో 17శాతం ఉంది 100 శాసనసభా స్థానాలలో గెలుపోటములు నిర్ణయించ గల లింగాయతులలో మోడీ అమిత్‌ షా కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్‌ సంతోష్‌ల నిర్వాకం వల్లనే లింగాయతులలో అసంతృప్తి పెరిగి వారు గణనీయంగా కాంగ్రెస్‌ పార్టీ వైపు మొగ్గారనే విమర్శలు వెల్లువెత్తాయి. మోడీ – అమిత్‌ షా ఆదేశాల మేరకే శెట్టర్‌- సవది వంటి ప్రముఖులకు టికెట్‌లు ఇవ్వలేదని బి.ఎల్‌. సంతోష్‌ బహిరంగ ప్రకటన చేయడంతో కమలం పార్టీలో లింగాయతుల ప్రాముఖ్యతను తగ్గించడానికి పతకం ప్రకారం ప్రయత్నాలు జరుగున్నాయనే అనుమానాలు వారిలో బలపడి కాంగ్రెస్‌ వైపు మళ్ళడం ఆరంభమైనదని అంటున్నారు. అదీ గాక పీష్వా (మరాఠా)బ్రాహ్మణుడైన ప్రహ్లాద్‌ జోషికి సీఎం పదవి కట్టబెట్టి బి.ఎల్‌ సంతోష్‌ ద్వారా కర్నాటకలో పట్టు బిగించి పెత్తనం చేయడం అధిష్టానం ఆంతర్యమని మాజీ సిఎం హెచ్‌.డి కుమారస్వామి ప్రకటించడం సంచలనం రేపింది. లింగాయతులు గణనీయంగా కాంగ్రెస్‌ వైపు ఉండటం వల్లనే ఇన్ని సీట్లతో హస్తం పార్టీకి ఘన విజయం సాధ్యమైంది. అదీగాక కమలనాథులు ప్రజల రోజువారీ జీవిత సమస్యలను, పేదరికం, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, సేద్యపురంగ దుస్థితిని పట్టించుకోకపోవడం వాటిని పరిష్కరించే ప్రయ త్నాలు చేయకపోవడం జనాగ్రహానికి కారణమయ్యాయి. ఉమ్మడి పౌరస్మృతి, పౌర పట్టిక అమలు వంటి వాటిని ఎన్నికల హామీగా ఇస్తూ మతపర భావోద్వేగాలను ప్రేరేపించి జనవిభజన ద్వారా రాజకీయలబ్ధి పొందాలనే ప్రయ త్నాలు జనానికి రుచించలేదు. కాంగ్రెస్‌ పార్టీ కూడా భజరంగ్‌దల్‌ను నిషేదిస్తామని తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొ నడం, ఐదు పథకాలకు సంబంధించిన ఇచ్చిన హామీలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయి. మోడీ ప్రభుత్వం ధనపతులకు, వాణిజ్య, పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా వ్యవహరిస్తూ పేదలు, రైతులు, కార్మికులను నిర్లక్ష్యం చేస్తోందని ప్రజలు గ్రహించడమే బీజేపీపై జనాగ్రహానికి ప్రధాన కారణం. ఇది రాబోయే ఎన్నికల్లో దేశానికి ఒక దిక్సూచిగా నిలవాలి.
– పతకమూరు దామోదర్‌ ప్రసాద్‌

Spread the love