శ్రీలంక, పాకిస్థాన్‌ ఆర్థిక సంక్షోభాలు మనకేం చెబుతున్నాయి?

గత కొంతకాలంగా ఉపఖండంలోని ముఖ్యదేశాలు అప్పుల్లో మునిగిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. విచక్షణా రహితంగా అప్పులు చేయడం, విశృంఖలంగా నయా ఉదార విధానాలు అమలు చేయడం వలన తీవ్ర ఆర్థిక దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. అందులో మొదటగా చెప్పుకోవాల్సినది శ్రీలంక. ఆ దేశం ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరి ఏడాదైంది. అక్కడ తలెత్తిన సంక్షోభం వెనుక చాలా కారణాలు. వీటిలో ముఖ్యమైనది నయా ఉదారవాద విధానాలను అమలు చేయడం, ఐఎంఎఫ్‌ షరతులకు తలొగ్గడం. ప్రజల్లో వచ్చే వ్యతిరేకతను పక్కదోవ పట్టించడానికి మితవాదం వైపు మొగ్గడం అనే క్రమం. వీటన్నింటి కారణంగా శ్రీలంక రూపాయి విలువను తగ్గించడం, ధరలమీద నియంత్రణలు ఎత్తివేయడం, సబ్సిడీలు, వేతనాల కోత, ప్రయివేటు సంస్థలను ప్రోత్సహించడం వంటి చర్యలు అమలు చేశారు. ఫలితంగా ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోవడం మొదల య్యాయి. తలసరి ఆహార లభ్యత తగ్గిపోయింది. ఈ షరతులను అమలు చేసిన ఫలితంగా శ్రీలంక జీడీపీ వృద్ధి రేటు 2015 నాటికి 5శాతంగా ఉన్నది కాస్తా 2019 నాటికి 2.9శాతానికి పడిపోయింది. ప్రభుత్వ ఆదాయాలూ పడిపోయాయి. ప్రభుత్వ రుణం విపరీతంగా పెరిగిపోయింది. తరువాత జరిగిన పరిణామాల కారణంగా, ఏప్రిల్‌ 2022లో శ్రీలంక సావరిన్‌ డిఫాల్ట్‌గా ప్రకటించబడింది. అప్పటి అధ్యక్షుడు దేశం విడిచి సింగపూర్‌కి పారి పోయాడు. ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు, వంట గ్యాస్‌ కొరత. కరెంటు కోతలతో ఏడాది కిందట శ్రీలంక ప్రజలు అల్లాడిపోయారు. ఆహారం, మందుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ ఆందోళన కర స్థితిలోనే ఉంది. నేటికీ ద్రవ్యోల్బణం 12శాతం పైనే ఉంది. సవాళ్లను, ఇబ్బందులను భరించలేక యువత దేశాన్ని వీడు తున్నది. 2022లో 3 లక్షల మంది పైగా వలసెళ్లిపోయారు. ఈ స్థాయిలో దేశాన్ని వీడి వెళ్లిపోవడం ఎన్నడూ జరగలేదు. వీరిలో డాక్టర్లు, పారామెడికల్‌, ఐటీ ప్రొఫెషనల్స్‌ ఉండటం గమనార్హం. మేధో సంపత్తి తరలి వెళ్తుండటంతో దేశ ఆర్థిక పునరుద్ధరణ ఆందోళనకరంగా మారింది.
శ్రీలంక తర్వాత అంతటి ఆర్థిక పరిస్థితిని పాకిస్థాన్‌ ఎదుర్కొంటోంది. దీన్నుంచి గట్టెక్కడం కోసం పాకిస్థాన్‌ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌)తో బెయిలవుట్‌ 6.5 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీపై సంతకం చేసింది. కానీ ఐఎంఎఫ్‌ నిబంధలను సరిగా పాటించకపోవడంతో ఇప్పటి వరకూ అందులో సగం మొత్తాన్ని కూడా వాడుకోలేకపోయింది. క్రమ శిక్షణా యుతమైన ఆర్థిక విధానాలు లేకపోడం వల్లనే పాకిస్థాన్‌కు అదనపు నిధుల విడుదలలో ఐఎంఎఫ్‌ వల్లమాలిన జాప్యం చేస్తూ వచ్చిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఆసియా ప్రాంతంలో ఐఎంఎఫ్‌ నుంచి అత్యంత అప్పు తీసుకున్న 4వ దేశంగా(10.4 ట్రిలియన్‌ డాలర్లు) పాకిస్థాన్‌ నిలిచింది. ఐఎంఎఫ్‌ ఆడమన్నట్లు ఆడి, వారి షరతుల మేరకు పెట్రోల్‌, గ్యాస్‌ ధరలను భారీగా పెంచు తోంది. దీంతో ప్రస్తుతం అక్కడ పెట్రోల్‌ లీటరు ధర రూ.253కి చేరుకున్నది. అదే సమయంలో ఐఎంఎఫ్‌ సూచన మేరకు ప్రజల నుంచి అధిక పన్నులు వసూలు చేయడానికి మినీ బడ్జెట్‌ను సైతం పాక్‌ ఆమోదించవలసి వచ్చింది. 639 మిలియన్‌ డాలర్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోడానికి సాధారణ అమ్మకపు పన్నును 17శాతం నుంచి 18శాతానికి పెంచింది. జూన్‌, 2023 నాటికి పాక్‌ ద్రవ్యోల్బణం గతేడాది కంటే మూడు రెట్లు పెరిగి 38శాతానికి చేరుకొన్నది. ఆహార ధరలు ఆకాశాన్నంటాయి. ఆహార ద్రవ్యోల్బణం 48శాతం వద్ద ఉన్నది. పాక్‌ స్టేట్‌ బ్యాంకు తానిచ్చే అప్పులపై వడ్డీ రేట్లను గత 24 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా 100 బేసిస్‌ పాయింట్లు పెంచివేసి 22శాతానికి ఎగబాకించింది. ప్రభుత్వం వద్ద విదేశీ మారక నిల్వలు ఎన్నడూ లేనంతగా కేవలం 3.9బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. వాటిని తిరిగి పెంచు కోకపోతే దిగుమతుల బిల్లును తట్టుకోడం కష్టతరమవుతుంది. సొంత కాళ్ళ మీద నిలబడడానికి బదులు బయటి నుంచి వచ్చే ఉదారపూరిత సాయం మీద, గ్రాంట్ల మీద ఆధారపడి ఆర్థిక వ్యవస్థను నడిపించే నేపథ్యమే పాకిస్థాన్‌ను ఇంతటి దురావస్థకు చేర్చింది.పూర్వపు ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ క్రమశిక్షణలేని ఆర్థిక విధానాలే ఇందుకు కారణమని విశ్లేషకుల అభిప్రాయం.
శ్రీలంక, పాకిస్థాన్‌ దేశాల ఆర్థిక సంక్షోభాన్ని చూసిన భారత్‌ తమ విధానాలను మార్చుకోవడం లేదు. దేశంలో బడాపెట్టుబడిదారుల లాభార్జనకే ఈ విధానాలను ఉపయోగిస్తున్నదని తెలుస్తోంది. అప్పుల మీద అప్పులు చేస్తూ ప్రజలపై భారాలు మోపుతోంది. ఈ ఏడాది మార్చి నాటికి మన దేశంలో కేంద్రం చేసిన అప్పు దాదాపు రూ.155.8 లక్షల కోట్ల రూపాయలు. ఇది జీడీపీలో 57.3శాతం మాత్రమే అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెపుతున్నారు. ఇందులో ప్రస్తుత మారకపు విలువ ప్రకారం బాహ్యరుణం 7.03లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అని, ఇది జీడీపీలో 2.6శాతం అని ప్రభుత్వం వాదిస్తోంది. ఇటీవలి కాలంలో భారత రూపాయితో పోలిస్తే యుఎస్‌ డాలర్‌ విలువ బాగా పెరగడం వల్ల దేశం బాహ్య రుణం చాలా భారంగా మారింది. 2023-24లో కేంద్ర ప్రభుత్వం చేయనున్న కొత్త అప్పులు రూ.16లక్షల 85వేల కోట్లు ఉండనుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే తీసుకున్న అప్పుపై కడుతున్న వడ్డీలురూ.10లక్షల 79వేల కోట్లు ఉన్నట్టు సమాచారం. 1947-2014వరకు 67ఏండ్లలో 14మంది ప్రధానుల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వాలు చేసిన అప్పు రూ.56 లక్షల కోట్లు కాగా కేవలం తొమ్మిదేండ్ల మోడీ ఏలుబడిలో (2014-23) చేసిన అప్పు దాదాపు రూ.100లక్షల కోట్లు. 2005 నుంచి 2013 వరకు తొమ్మిదేళ్లలో యూపీఏ ప్రభుత్వం దాదాపు రూ.21లక్షల కోట్ల విదేశీ రుణం తీసుకుంది. 2014 నుంచి 2022 వరకు విదేశీ అప్పు రూ.33 లక్షల కోట్ల నుంచి రూ.50లక్షల కోట్లకు పెరిగింది. ఇంత అప్పుతో దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పేదరికం నిర్మూలన వంటివి భారీగా జరిగాయా? మరి ఈ డబ్బు అంతా ఎక్కడికి పోయింది? ఇదంతా ఎవరికి చేరిందో దేశ ప్రజలకు తెలిసిందే.
మరోవైపు, వస్తు సేవల పన్ను (జీడీపీ)లో వసూలు అవుతున్న రూ.16లక్షల కోట్లలో దాదాపు 64శాతం దిగువన ఉన్న 50శాతం జనాభా నుండి వచ్చింది, మొత్తంలో మూడు శాతం మాత్రమే టాప్‌ 10శాతం నుండి వచ్చిందని ఆర్ధిక నిపుణులు చెపుతున్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు, కోవిడ్‌ మహమ్మారి కారణంగా చిన్న,మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయి. సామాన్య ప్రజల ఆదాయం గణనీయంగా దెబ్బతింది.గత తొమ్మిదేళ్లలో సగటు భారతీయుడిపై అప్పు రూ.43,124 నుంచి రూ.1,09,373కి పెరిగింది. 2014లో ఉన్నదానికంటే 2.53 రెట్లు పెరిగింది అప్పు చేసిపప్పు కూడు వలన దేశ ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా ఏమైనా పెరిగాయా అంటే లేదనే ఆర్థిక పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. నేడు దేశంలో దేశ ప్రజల తలసరి ఆదాయం రూ.1,97,468 అయ్యిందని, ఈ ఏడాది బడ్జెట్‌లో ఆర్థికమంత్రి చెప్పుకొచ్చారు. 2004-14 మధ్య కాలంలో తలసరి ఆదాయంలో వృద్ధి 13.1శాతం కాగా, 2014-23 మధ్య ఇది 9.1శాతంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా తలసరి ఆదాయంలో చూసుకున్నప్పుడు మన దేశం 142వ స్థానంలో, జీవన ప్రమాణాలలో (హెచ్‌డిఐ) చూస్తే 132వ స్థానంలో (191 దేశాలలో), హుంగర్‌ ఇండెక్స్‌లలో 101స్థానం (107 దేశాలలో) ఉంది. దీన్ని అచ్చేదిన్‌ అందమా? శ్రీలంక, పాకిస్థాన్‌ పరిణామాలు చూసైనా మన దేశ పాలకులు గుణపాఠాలు తీసుకుంటే మంచిది. అప్పుల ఆధారంగా ఆర్థిక వ్యవస్థను నడపడం మానేసి, దేశ స్వావలంబనను, ప్రజల కొనుగోలు శక్తిని పెంచే ఆర్థిక నమూనాను అమలు చేయాలి. అప్పుడే అప్పుల ఊబిలోంచి బయటపడే అవకాశం ఉంది.

Spread the love