యూసీసీ ముసాయిదా ఎక్కడీ

భారత లా కమిషన్‌ ప్రకటన, ప్రధాని నరేంద్ర మోడీ ఏకరూప పౌరస్మృతి (యూనిఫాం సివిల్‌ కోడ్‌)పై చేస్తున్న బలమైన వాదనలు, విభజన అంశంపై మరోసారి చర్చను లేవదీశాయి. ఇది భారతీయ జనతా పార్టీ చరిత్రలో, తన ఎన్నికల ప్రణాళికల్లో భాగంగా ఉంటూ వస్తోంది. బీజేపీ తన 1996 ఎన్నికల మ్యానిఫెస్టోలో నారీశక్తి (మహిళా శక్తి) అనే పతాక శీర్షికతో యూనిఫాం సివిల్‌ కోడ్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించింది. అయినప్పటికీ ఆ పార్టీ, యూసీసీ ముసాయిదాలోని పలు అంశాలకు పరిష్కారాల్ని చూపించలేదు. విడాకులు, భార్య పోషణ, వారసత్వపు హక్కులు, పిల్లల సంరక్షణకు సంబంధించి యూసీసీలో ఎలాంటి చట్టాలున్నాయి? ఇప్పటివరకు చెప్పుకోదగిన ప్రతిస్పందన, ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు నుండి, యూసీసీని వ్యతిరేకిస్తున్న గుర్తింపుపొందిన మైనారిటీ సంస్థల నుంచే వచ్చింది. ఈసారి యూసీసీ ప్రతిపాదన ఆదివాసీలు, సిక్కు గ్రూపులు, ఇంకా ఇతర వర్గాల ప్రజల నుండి కూడా వ్యతిరేకతను ఎదుర్కొంటుంది.
”వివాహం, విడాకులు, వారసత్వం, భూ బదలాయింపు లాంటి మా సాంప్రదాయ చట్టాలను యూసీసీ ఉల్లంఘిస్తుందని” కేంద్రీయ సర్న సమితికి చెందిన కార్యకర్త సంతోష్‌ టిర్కీ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా, ”మేము లా కమిషన్‌కు ఈమెయిల్స్‌ పంపించడం ద్వారా నిరసన తెలియజేయడమే కాకుండా నిరసన ప్రదర్శనలను కూడా నిర్వహిస్తాం. మా వ్యూహాల్ని రచించడానికి సమావేశాలు నిర్వహిస్తున్నాం. రాజ్యాంగంలోని ఐదు, ఆరవ షెడ్యూల్‌లోని నిబంధనలను యూసీసీ నీరుగార్చుతుందని” జార్ఖండ్‌కు చెందిన మరొక ఆదివాసీ గ్రూప్‌ నాయకుడైన రతన్‌ టిర్కీ అన్నాడు. నేషనల్‌ డెమోక్రటిక్‌ అలెయెన్స్‌లోని ఒక భాగస్వామ్య పార్టీ, ఉత్తర ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొంతమంది బీజేపీ నాయకులు కూడా ఈ యూనిఫాం సివిల్‌ కోడ్‌ను వ్యతిరేకిస్తున్నట్లు చెపుతున్నారు. ‘లా అండ్‌ జస్టిస్‌’ పార్ల మెంట్‌ స్టాండింగ్‌ కమిటీ అధ్యక్షుడు, బీజేపీకి చెందిన సుశీల్‌ మోడీ, ఉత్తర ఈశాన్య రాష్ట్రాలతో సహా గిరిజన ప్రాంతాల్లో యూనిఫాం సివిల్‌కోడ్‌ అమలులోని సాధ్యాసాధ్యాలను ప్రశ్నించాడు.శిరోమణి అకాలీ దళ్‌ నాయకుడు గుర్జీత్‌ సింగ్‌ తల్వాండీ, యూసీసీని బర్తరఫ్‌ చేయకుండా లా కమిషన్‌తో సంప్రదింపులకు చొరవ చూపాలని, అది ఒప్పందంగా కాక, ప్రతిపాదనకున్న వ్యతిరేకతను సంరక్షించాలని, సిక్కు మత అత్యున్నత కమిటీ అయిన శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీని కోరాడు.
వ్యక్తిగత చట్టాలు, కుటుంబ చట్టాలు, పౌర చట్టాలకు, నేర చట్టాలకు చాలా భిన్నంగా ఉంటాయనే విషయాన్ని పునరావృతం చేయడం ఇక్కడ కీలకం. భారతదేశంలో బ్రిటిష్‌ పాలకులు ప్రతిఒక్క మతానికి చెందిన అధికారులతో సంప్రదింపులు జరిపి, వ్యక్తిగత చట్టాలను రూపొందించారు. ఉదాహరణకు, హిందూ చట్టాలకు సంబంధించిన మితాక్షర, దయాభాగలు కొనసాగుతున్నాయి. అందువల్ల హిందువుల పౌరచట్టాలలో కూడా ఏక రూపత లేదు. భారత ప్రథమ ప్రధాని, జవహర్‌ లాల్‌ నెహ్రూ వ్యక్తిగత చట్టాల్లో శాశ్వతమైన లింగ అన్యాయం గురించి కలతచెంది, మొదటి న్యాయశాఖ మంత్రి డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ను హిందువుల కోసం కోడ్‌లో సంస్కరణల్ని ప్రారంభించాలని కోరాడు. సమానత్వాన్ని కోరుకున్న వ్యక్తిగా అంబేద్కర్‌, హిందూ వ్యక్తిగత చట్టాలన్నీ మహిళలపై పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించేవిగా ఉన్నాయని గ్రహించి, ముందుగా ఆయన హిందూ కోడ్‌ బిల్లు ముసాయిదాను రూపొందించాడు. ముందుగా మెజారిటీ మత సంస్కరణలతో ప్రారంభించి తరువాత మిగిలిన మతాల్లో అలాంటి సంస్కరణలు చేపట్టాలనేది ఆయన ఆలోచన.
దేశ విభజన సమయంలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో, మైనారిటీ మతం పైన మెజారిటీ మతం తన అనుకూల విధానాలను విధిస్తుంది అనే విధంగా కనిపించడం భారతదేశానికి ఇష్టం లేదు కాబట్టి, స్వాతంత్య్రం సిద్ధించిన వెంటనే ముస్లిం వ్యక్తిగత చట్టాల్లో సంస్కరణల్ని చేపట్టలేదు. ఆ తరువాత ముస్లిం చట్టాల క్రోడీకరణను చేపట్టడం జరిగింది. తక్షణ ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించడం ద్వారా ముస్లిం చట్టంలో ఒక సంస్క రణను చేపట్టడం కూడా జరిగింది. (బీజేపీ అనవసరంగా ఈ విధానాన్ని నేరంగా పరిగణించడం ద్వారా, ప్రజల్ని విభజించి, ముస్లింలు చట్టాల్ని ఉల్లంఘించే వారుగా చూపించింది). గుర్తుంచుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏమంటే, ఇండియన్‌ ముస్లిమ్స్‌ ఫర్‌ సెక్యులర్‌ డెమోక్రసీ లాంటి కొన్ని ప్రగతిశీల ముస్లిం గ్రూపులు గతంలో కూడా మతపరమైన తటస్థ వ్యక్తిగత చట్టాల కోసం పిలుపునిచ్చాయి. లింగ సమానత్వంపై ఆధారపడి, హిందూ కోడ్‌ బిల్లులో అంబేద్కర్‌ రూపొందించిన చట్టాలకు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. బిల్లును పలుచనచేసి, దశల వారీగా ప్రవేశపెట్టవలసి వచ్చింది. హిందూ జాతీయవాద శక్తుల అండదండలతో సాంప్రదాయ హిందువులు, అంబేద్కర్‌ రాజీ నామా చేయాలని డిమాండ్‌ చేయడంతో మనస్తాపం చెందిన ఆయన కేబినెట్‌ మంత్రి పదవికి రాజీనామా చేశాడు.
ప్రస్తుత భారత ప్రభుత్వం ద్వారా గాంధీ శాంతి బహుమతిని అందుకున్న గీతాప్రెస్‌ ప్రచురించిన కళ్యాణ్‌ మ్యాగజైన్‌ అసలు ప్రతి, హిందూ కోడ్‌ బిల్లుపై వ్యతిరేకతను ఈ విధంగా వ్యక్తం చేసింది… ”ఇప్పటి వరకు హిందూ ప్రజలంతా ఆయన మాటలను చాలా తీవ్రంగా పరిగణిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు, అంబేద్కర్‌చే రూపొందించ బడిన హిందూ కోడ్‌ బిల్లు, హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి ఉద్దేశించబడిన కుట్రలో చాలా ముఖ్యమైనదని రూఢ అయ్యింది. ఆయన లాంటి వ్యక్తి న్యాయశాఖ మంత్రిగా కొనసాగితే అది హిందువులకు అవమానం, సిగ్గుచేటు, హిందూ ధర్మం పై ఒక మచ్చ.” 70వ దశకం ప్రారంభంలో మధుర అత్యాచార కేసు తరువాత యూసీసీ కోసం డిమాండ్‌ చాలా బలంగా వ్యక్తీకరించబడినప్పటికీ రానున్న మహిళా ఉద్యమం నుండే యూసీసీ కోసం డిమాండ్‌ వచ్చింది. మహిళా ఉద్యమంలోని కొన్ని వర్గాలు ఏకరూపత, న్యాయం చేకూర్చుతుంది అని విశ్వసించాయి. కానీ అందుకు విరుద్ధంగా రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు రెండవ సర్సంగ్‌ చాలక్‌ అయిన ఎం.ఎస్‌.గోల్వాల్కర్‌, యూసీసీ భారతదేశం భిన్నత్వాన్ని దెబ్బతీస్తుందని 1972, ఆగస్ట్‌ 23వ తేదీన ఆర్గనైజర్‌ పత్రిక కోసం కే.ఆర్‌.మల్కానీకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
యూసీసీ జాతీయ ఐక్యతను బలోపేతం చేస్తుందన్న వాదనను ఎవరూ విశ్వసించరు. లింగ న్యాయం జరగాలంటే ఏకరూపతే మార్గం అనే ఆలోచన నుండి చాలా మహిళా గ్రూపులు వైదొలిగాయి కూడా. విడాకులలో, వారసత్వం, పిల్లల సంరక్షణలో లింగ న్యాయం ఎలా ఉంటుందని వారు అడుగుతున్నారు. ఇప్పటికే ఉనికిలో ఉన్న వైవిధ్యమైన కోడ్‌ల నుండి చట్టాల తొలగింపు ఈ లక్ష్యాన్ని సాధిస్తుందా? మరో ప్రశ్న ఏమంటే… యూసీసీని కేవలం అధికార ఆజ్ఞలతో విధించవచ్చా? యూసీసీని విధించడం ద్వారా సాంప్రదాయాలు, ఆచారాలు లేకుండా వదిలించు కోవచ్చా? అది ఒక మిలియన్‌ రూపాయల ప్రశ్న. సామాజిక మార్పు తేవాలన్నా, లింగ న్యాయం జరగాలన్నా ఎంతో కృషి జరగాలి. విభిన్న వర్గాల, మతాల, సమాజాల అధికార ప్రతినిధులుగా పిలువబడుతున్న వారు మొత్తంగా వారి కమ్యూనిటీల అభిప్రాయాన్ని ముఖ్యంగా మహిళల అభిప్రాయాల్ని ప్రతిబింబించకపోవచ్చు. మనం లింగ న్యాయం కోసం ఉన్నప్పుడు, సమాజంలో నాయకత్వ పాత్రను పోషించిన పురుషుల్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. వివిధ కమ్యూనిటీలకు చెందిన మహిళల్లో ఉంటున్న బలమైన భావాల్ని, వారి ఆగ్రహాన్ని గుర్తించి, చట్ట సవరణలు, చట్టాల మార్పుల్లో వారి ప్రాతినిధ్యాన్ని నిర్ణయాత్మకంగా మార్చాలి.
యూసీసీ ద్వారా మహిళలకు సాధికారత కల్పించవచ్చు అనే బీజేపీ వాదనల్లో డొల్లతనం కనపడుతుంది. గడచిన తన తొమ్మిదేండ్ల పాలనలో భారతీయ జనతా పార్టీ, భిన్న సమాజాలు, వర్గాలు, మతాల్లో సంస్కరణలకు చొరవ చూపి ఉండవచ్చు. విభిన్న వర్గాలకు చెందిన మహిళలు ఆందోళనలు చేస్తున్నప్పటికీ, ఆ ఆందోళనల ప్రభావం చాలా తక్కువగా ఉంది. అన్నిటినీ మించి, మైనారిటీల్లో పెరుగుతున్న అభద్రత, సాంప్రదాయ శక్తులలో పెరుగుతున్న సంఘ సౌభ్రాతృత్వ శక్తి, ఆరోగ్యకరమైన చట్ట సంస్కరణలకు చాలా శక్తివంతంగా అడ్డుకట్టలు వేస్తున్నాయి. మత ప్రాతిపదికన ప్రజలను విభజించడం బీజేపీ లక్ష్యం కాబట్టి, అది యూసీసీ గురించి మాట్లాడు తుంది. నిజాయితీతో కూడిన ప్రయత్నం, రెండు చర్యలకు దారి తీస్తుంది. అన్ని సామాజిక సమూహాలలో సంఘం నాయకత్వంలో సంస్క రణలు, లింగ న్యాయం. యూసీసీకి అంగీకారం తెలపడం లేదా వ్యతిరేకించడం కంటే కూడా యూసీసీ ముసాయిదా కోసం పిలుపు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముస్లిం సమాజంలోని గొంతుకలు గుడ్డిగా చట్టపరమైన మార్పులను వ్యతిరేకించడం కంటే కూడా ముసాయిదా సమీక్షకు పిలుపు ఇవ్వాలని ప్రతీ ఒక్కరూ ఆశించాలి.
వాస్తవానికి, గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతిని అందించిన బీజేపీకి, మహిళా సాధికారత పట్ల ఎలాంటి ఆసక్తి లేదు కానీ, యూసీసీని వ్యతిరేకిస్తూ ముస్లిం మత ఛాందస సంస్థలు, గొంతులు చించుకుంటాయనే విషయం మాత్రం తెలుసు. ప్రజలను మతాల వారీగా విభజించి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ లబ్ది పొందేం దుకు మాత్రమే ఈ యూసీసీ ఉపయోగపడుతుంది. అన్ని రాజకీయశక్తులు ఐక్యంగా నిలబడి యూసీసీపై తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేయడానికి ముందే యూసీసీ ముసాయిదా కోసం డిమాండ్‌ చేయాలి.

(”న్యూస్‌ క్లిక్‌ ” సౌజన్యంతో)
అనువాదం:బోడపట్ల రవీందర్‌, 9848412451

రామ్‌ పునియానీ

Spread the love