పేదరికం తగ్గిందట!

తిమ్మిని బమ్మిని చేయడం..లేనిది ఉన్నట్టు చూపడం… మోడీ ఏలుబడిలో సర్వసాధారణంగా మారిపోయింది. తాజాగా నీటి అయోగ్‌ అందుకు ఉపక్రమించడం విడ్డూరం. దేశంలో పేదరికం తగ్గిపోతోందంటూ ఆ సంస్థ ఇచ్చిన నివేదిక మోడీ సర్కారుకు రాజకీయ లబ్ధిచేకూర్చేందుకే. గత అయిదేళ్లలో 13.5కోట్ల మంది పేదరికం నుంచి బయట పడినట్లు నీటి అయోగ్‌ తాజాగా సెలవిచ్చింది. గత ఏడాది ప్రపంచ ఆకలి సూచీలో మొత్తం 121 దేశాల్లో 107వ స్థానంలో భారత్‌ నిలిచింది. అంతకుముందు ఏడాదితో పోల్చితే ఆరు స్థానాలు దిగజారింది. 2016 నుంచి ఈ ర్యాంకు దిగజారిపోతూనే ఉంది. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఇరుగుపొరుగు దేశాలైన పాకిస్థాన్‌ (99), శ్రీలంక (64), నేపాల్‌ (81), బంగ్లాదేశ్‌ (84) మన కన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయి. ఐదేళ్లకంటే తక్కువ వయసు పిల్లల పోషకాహార లోపం ఉన్న జనాభా నిష్పత్తి, శారీరక క్షీణత (ఎత్తుకు తగ్గ బరువు), పిల్లల్లో ఎదుగుదల లోపం (వయసుకు తగ్గ ఎత్తు), మరణిస్తున్న పిల్లల నిష్పత్తి ప్రపంచ ఆకలి సూచీ పరిగణనలోకి తీసుకున్న అంశాలు. ఈ సూచీ కంటే వాస్తవ పరిస్థితి మరింత భయంకరంగా ఉందనేది వైద్యనిపుణుల అనుభవం.
దేశంలో అధికారిక సర్వేలు, గణాంకాలు తప్పుల తడక అని, రాజకీయ జోక్యం పెరిగిపోతుండడం వల్ల గణాంకాలు విశ్వసనీయత కోల్పోతున్నాయని పలువురు ఆర్థిక వేత్తలు, మేధావుల నుంచి విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రకాల ఆర్థిక సర్వేలు, గణాంకాల సమీక్షకు కొత్త స్టాండింగ్‌ కమిటీ వేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన మూడు రోజులకే నీటి అయోగ్‌ ఈ నివేదిక వెలువరించడం గమనార్హం. కార్పొరేట్ల ప్రయో జనాల పరిరక్షణే ధ్యేయంగా ప్రణాళికా సంఘం స్థానే పుట్టుకొచ్చిన నీటి అయోగ్‌ తాజాగా ప్రభుత్వానికి రాసిన లేఖలో ఐదేళ్లలో (2015-16, 2019-21 మధ్య) 13,54,61,035 మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపింది. పేదరికాన్ని కొలిచే పద్ధతులను మార్చడం, ప్రాతిపదికల్లో కొన్నిటిని తొలగించడం ద్వారా పేదరికం తగ్గినట్టు చూపడం ఆమోదయోగ్యం కాదు. పరిశీలించిన 12 అంశాల్లో… పేదరికాన్ని తగ్గించడంలో పోషకాహారంలో మెరుగుదల, పాఠశాల విద్య, పారిశుధ్యం, వంట ఇంధనం ముఖ్యమైన పాత్ర పోషించాయని నీటి అయోగ్‌ పేర్కొంది.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5) సర్వే ప్రకారం మనదేశంలో 57 శాతం మంది మహిళలు, 67శాతం మంది పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ప్రసూతి మరణాలకు, పిల్లల మరణాలకు, పిల్లల్లో ఎదుగుదలకు ప్రధాన కారణమైన రక్తహీనతను ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-6 సర్వే నుంచి ఎత్తివేయాలని తాజాగా కేంద్రంలోని పాలకులు నిర్ణయించారు. మనదేశంలో 21.7 శాతం సంపద ఒకశాతం శత కోటీశ్వరుల చేతుల్లో ఉండగా, 40 శాతం మంది దేశ ప్రజల చేతుల్లో ఉన్న సంపద 19.8 శాతమే. మోడీ ఏలుబడిలో ఆర్థికరంగం అస్థ వ్యస్థం కావడం, సమస్తం కార్పొరేటీకరిస్తుండటం, అన్ని రంగాల్లో వైఫల్యంతో పేదరికం గణనీయంగా పెరిగింది. దీనిని కప్పిపుచ్చి, ఎన్నికల్లో రాజకీయ లబ్ధిపొందేందుకు నీటి అయోగ్‌ వంటి సంస్థల ద్వారా అనుకూల నివేదికలు తెప్పించుకోవడం పరిపాటిగా మారింది. గత ఏడాది విడుదలైన మానవాభివృద్ధి సూచిక (హెచ్‌డిఐ)లో మనదేశం 132వ స్థానంలో ఉంది. రెండేళ్ల క్రితంతో పోలిస్తే ఒక స్థానం దిగజారింది. బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థను అధిగమించి ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నామని చాలాకాలంగా మోడీ సర్కారు ఊదరగొడుతోంది. మానవాభివృద్ధిలో 18వ స్థానంలో ఉన్న బ్రిటన్‌కు, మన దేశానికి మధ్య 114 స్థానాల అంతరం ఉందన్న విషయాన్ని మాత్రం దాటవేస్తూ ఉంటుంది.
పేదరికాన్ని తగ్గించడంలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ చట్టం కీలకపాత్ర పోషించింది. వామపక్షాల ఒత్తిడితో కేంద్రంలోని యుపిఎ హయాంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం వల్ల 2005-06 నుంచి 2019-21 మధ్య 41.5 కోట్ల మంది దారిద్య్రం నుంచి బయటపడ్డారని ఐక్యరాజ్యసమితి నివేదిక ఇటీవల పేర్కొంది. ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ఎత్తులు వేస్తూ ఏటా నిధులు తెగ్గోసే పరిస్థితినే మోడీ ఏలుబడిలో చూస్తున్నాం. మనకన్నా రెండేళ్లు ఆలస్యంగా స్వాతంత్య్రం పొందిన చైనా ఇప్పటికే పేదరికాన్ని పూర్తిగా రూపుమాపింది. సర్వం కార్పొరేట్లకు దోచిపెట్టే మోడీ జమానాలో పేదరికం తగ్గిందనడం ఈ శతాబ్దంలోనే అతి పెద్ద జోక్‌!

Spread the love