జుట్టు రాలిపోతుంటే..?

జుట్టు రాలిపోవడం ఈ రోజుల్లో సర్వసాధారణమైన విషయం.. ఎందుకంటే ఒకప్పుడు ఎక్కువ శాతం తలకు నూనె పెట్టుకునేవారు. ఈ రోజుల్లో చాలా మంది తలకు నూనె పెట్టడానికి ఇష్టపడటంలేదు. అయితే ఇలా చేయడం ఎంత పెద్ద సమస్యో జుట్టు రాలిపోయాక కానీ అర్థం కాదు. అందుకే తప్పనిసరిగా నచ్చిన ఏదో ఒక నూనెను రాయడం జుట్టుకు చాలా అవసరం. ఇలా చేస్తే బ్లడ్‌ సర్కులేషన్‌ పెరిగి జుట్టు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. గోరువెచ్చని నూనెతో మసాజ్‌ చేస్తే చాలా మంచిది. మసాజ్‌ చేశాక ఓ వెచ్చని టవల్‌ కొన్ని నిమిషాల పాటు తలకు చుట్టుకోండి. దీని వల్ల జుట్టుకు మంచి కండిషనింగ్‌ వస్తుంది. దీనితో పాటు…
జుట్టు రాలకుండా ఉండేందుకు కలబంద చక్కని ఔషధం. ఇది మీ తలలో తేమను, పోషకాలను పెంచేలా చేసి జుట్టు పెరిగేలా చేస్తుంది. అలోవెరాను రాసి ఓ గంటపాటు వదిలేశాక తలస్నానం చేయండి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది.
కొందరు తలస్నానం చేయకుండా బయటికి కాలు పెట్టరు. కానీ రోజూ తలస్నానం చేస్తే జుట్టు త్వరగా పాడైపోతుంది. అది కూడా నూనె రాయకుండా తలస్నానం అస్సలు చేయద్దు. ఇక షాంపుల్లోని రసాయనాల వల్ల కురులకు ప్రమాదం ఎక్కువ. అందుకే రోజూ షాంపుతో తలస్నానం చేయకండి.
అన్ని రకాల జుట్టు సమస్యలకు ఉసిరి చక్కని విరుగుడు. పరగడపున రోజూ ఉసిరి తినవచ్చు. ఎండబెట్టిన ఉసిరి ముక్కలు, మురబ్బా వంటివి నిల్వచేసుకుని క్రమం తప్పకుండా తినవచ్చు. ఉసిరి ఊరగాయ కూడా మంచిదే. సీ విటమిన్‌ పుష్కలంగా లభించే ఉసిరిలో పొటాషియం, సోడియం, మ్యాంగనీస్‌, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి.
సమతులమైన ఆహారం తీసుకోవటం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. కంటి నిండా నిద్రపోవటం, పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినటంతో ఈ సమస్యను అధిగమించవచ్చు. ప్రొటీన్లున్న ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వండి. నూనె పదార్థాలు, కొవ్వు అధికంగా ఉన్న ఫ్యాటీ పుడ్స్‌ను తగ్గించి నీరు ఎక్కువగా తాగండి.

Spread the love