గరం గరం పకోడీ

ఇప్పుడిప్పుడే వాతావరణం చల్లబడుతోంది… ఈ చల్లని వాతావరణానికి తోడు చిన్న చిన్న తుంపరలు పడుతున్నాయి… సాయంత్రం సమయంలో ఈ కాంబినేషన్‌కు పకోడీలు తోడయితే… ఆ మజానే వేరు… అయితే తినే పకోడీలనే కాస్త ఆరోగ్యంగా చేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది కదా.. అందుకే మన శరీరానికి పోషకాలు అందించి రోగనిరోధక శక్తిని పెంచే కొన్ని పకోడీ వెరైటీలను ట్రై చేద్దాం…
మీల్‌మేకర్‌తో
కావాల్సిన పదార్థాలు : మీల్‌మేకర్‌ గ్రాన్యూల్స్‌ – అరకప్పు, ఉల్లిగడ్డ (సన్నగా తరగాలి) – మూడు, పచ్చి మిర్చి – ఐదు (సన్నగా తరగాలి), కొత్తిమీర – కట్ట, కరివేపాకు – నాలుగైదు రెబ్బలు, జీలకర్ర – చెంచా, కందిపప్పు పొడి – పావుకప్పు, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి సరిపడా.
తయారు చేసే విధానం : మీల్‌ మేకర్‌ గ్రాన్యూల్స్‌ని ఉడికించి నీళ్లు పిండేసి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని బాగా కలపాలి. అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు కూడా చేర్చుకోవాలి. స్టవ్‌ మీద కడాయిలో నూనె పోసి వేడయ్యాక మంటను మద్యస్తంగా పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న మొత్తంలో పకోడీల లాగా నూనెలో వేసి వేయించుకోవాలి. బాగా వేగాక తీసుకుంటే సరిపోతుంది.
ఆకుకూరలతో…
కావాల్సిన పదార్థాలు : మునగాకు – కప్పు, మెంతి ఆకులు – కప్పు, తోటకూర – కప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద – రెండు చెంచాలు, పచ్చిమిర్చి ముద్ద – రెండు చెంచాలు, కారం – చెంచా, ఉప్పు – తగినంత, శెనగపిండి – కప్పు, బియ్యప్పిండి – అరకప్పు, ధనియాల పొడి – రెండు చెంచాలు, కరివేపాకు రెబ్బలు – కొన్ని, నూనె – వేయించడానికి సరిపడా.
తయారు చేసే విధానం : ముందుగా మునగాకు, మెంతి ఆకులూ, తోటకూర, కరివేపాకును సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇందులో నూనె మినహా మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని బాగా కలపాలి. అవసరాన్ని బట్టి నీళ్లు చల్లుకుని పిండి కలపొచ్చు. ఇప్పుడు కడాయిలో నూనె వేడి చేసుకొని ఈ పిండిని పకోడీలా వేసుకోవాలి. మంట తగ్గించి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇవి రుచిగా ఉంటాయి. శరీరానికి కావాల్సిన పోషకాలనూ అందిస్తాయి.
మటన్‌తో…
కావాల్సిన పదార్థాలు : మటన్‌ – అర కేజీ, పెరుగు – ఒకటిన్నర కప్పులు, బీట్‌రూట్‌ పేస్టు – కప్పు, ఉల్లిగడ్డలు – నాలుగు, అల్లం వెల్లుల్లి ముద్ద – రెండు చెంచాలు, గరం మసాలా – రెండు చెంచాలు, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి సరిపడా, కారం – రుచికి సరిపడా.
తయారు చేసే విధానం : ముందుగా మటన్‌కు పెరుగు, బీట్‌రూట్‌ పేస్ట్‌, అల్లం వెల్లుల్లి ముద్ద బాగా పట్టించి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో ఈ మిశ్రమాన్ని వేసి 20 నిమిషాల పాటు మధ్యస్తంగా ఉండే మంట మీద అడుగంటకుండా ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత అందులో శెనగపిండి కలిపి మరికొంచెం కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనెలో పకోడీల మాదిరిగా వేసుకొని వేయించుకోవాలి. అంతే… మటన్‌ పకోడీ రెడీ…
జీడిపప్పు, పల్లీలతో…
కావాల్సిన పదార్థాలు : జీడిపప్పు పలుకులు – కప్పు, పల్లీలు – కప్పు, పట్నాలపప్పు – అరకప్పు, బియ్యప్పిండి – అరకప్పు, శెనగపిండి – కప్పు, కారం, ఉప్పు – తగినంత, వాము – కొద్దిగా, పుదీనా ఆకులు – కట్ట, గరంమసాలా – రెండు చెంచాలు, నూనె – వేయించడానికి సరిపడా.
తయారు చేసే విధానం : పుట్నాలపప్పును మరీ మెత్తగా కాకుండా పొడి చేసుకోవాలి. అందులో మిగిలిన పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. తర్వాత నీళ్లు చల్లుకుంటూ చపాతి పిండి కంటే కొద్దిగా పలచని పిండిలా కలుపుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి ఈ పిండిని పకోడీల్లా వేసుకొని వేయించుకోవాలి. వేడివేడిగా జీడిపప్పు, పల్లీల పకోడీ సిద్ధం.

Spread the love