సిద్ధంగా ఉండాలి…

మహిళలకు పిల్లలు పుట్టి, పెరిగి, పెద్దయ్యే వరకు సమయమే తెలీదు. అలా ఏండ్లు గడిచిపోతాయి. పిల్లలు ఎప్పటికీ తల్లిదండ్రుల దగ్గరే ఉండిపోరు కదా.. ఒక యేజ్‌ వచ్చేసరికి చదువుల కోసమని, చదువులు ముగించుకుని ఉద్యోగాల కోసమని దూరంగా వెళ్ళిపోతారు. లేదంటే పెండ్లి చేసుకున్నాకైనా సరే వారి పనుల్లో బిజీ అయిపోతారు.అక్కడ నుండి తల్లులకు కాలం నెమ్మదిగా గడుస్తుంది. అప్పటివరకు ఎంతో ఓపికగా, శారీరక ఆరోగ్యంతో, మానసిక ఉల్లాసంతో అన్ని బాధ్యతలు మోసిన తల్లులకు సమయం చేజారిపోతుంది. తర్వాత నుంచి ఇంకేం చెయ్యాలో తోచదు. ఉత్సాహం కూడా రాదు. ”ఇప్పుడు మీ కోసం సమయం దొరికింది కదా.. మీకు నచ్చినట్టు దాన్ని మలచుకోండని.. ఇష్టమైనట్టు గడపండి” అని ఎవరైనా చెబితే ఒక రకమైన నిస్తేజం నిరుత్సాహం కూడా వెలిబుచ్చుతారు. అదెలా సాధ్యం? ‘ఇష్టం’ అనే మాట మరచిపోయి ఏండ్లు గడచిపోయాయి. పైగా ఇప్పుడు కొత్తగా ఏదో చేసి సాధించి, నిరూపించుకునేది ఏముందని కూడా అనిపిస్తుంది. ఈ కాలంలో ఏం చేయాలో ఖాళీ సమయాన్ని ఎలా గడపాలో తెలీక, పిల్లల్ని వదిలి వుండటానికి అలవాటు పడలేక ఎందరో తల్లులు మానసిక సంఘర్షణకు గురవుతు న్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే వారు తమని తాము తప్పక మార్చుకోవల్సిందే..
అందుకోసం…సమయం తెలియకుండా…
పిల్లలు దూరంగా వెళ్ళిన వెంటనే ఏం చేయాలో తోచదు. వారి ఆలోచనలతో గడపటం కంటే వీలయితే దగ్గరి స్నేహితులతో బయటకి వెళ్ళటం, చుట్టాలు, తెలిసిన వారి ఇండ్లకు వెళ్ళి వారిని పలకరించడం వంటివి చేస్తుంటే అందరి మధ్య సమయం గడవటమే కాక, ఉల్లాసం కలుగుతుంది కూడా. ఆ తరువాత కావాలసిన సామగ్రి కొనటానికి స్వయంగా ఒక్కరే మార్కెట్‌కు, బజారుకు వెళ్ళటం, ఇంటిని రీమోడలింగ్‌ చేయడానికి కొత్త కొత్త ఇంటీరియర్‌ చిట్కాలు ప్రయత్నించడం వంటివి కూడా సమయాన్ని తెలియనివ్వవు. అలాగే మానసిక స్వాంతన చేకూరడానికి మొక్కల పెంపకం కూడా చక్కగా ఉపయోగపడుతుంది.
ప్రయత్నించాలి
పిల్లలు పెద్దయి దూరంగా వెళ్ళాక తల్లుల మానసిక స్థితిని ‘ఎంప్టీ నెస్ట్‌ సిండ్రోమ్‌’ అంటారని నిపుణులు అంటున్నారు. కొందరు ఆ పరిస్థితిలో తమని తాము ఎలా సంభాళించుకోవాలో ముందుగానే ఆలోచించి పెట్టుకుంటే, మరికొందరు అప్పటి ఆ సమయాన్ని ఎలా గడపాలో మార్గాలు అన్వేషిస్తారు. ఇలా ఆ ఖాళీ సమయాన్ని అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నించే వారికి ఇబ్బంది లేదు. కానీ, ఆ ఖాళీ సమయాన్ని చూసి బాధపడేవారు రోజురోజుకీ శారీరకం గా, మానసికంగా కుంగిపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, దేనిపైనా మనసు నిలపలేకపోవటం వంటి ఇబ్బందులకు గురవుతున్నట్టు చెబుతున్నారు నిపుణులు. ఆ స్థితి అలాగే కొనసాగితే వారి శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత దెబ్బ తింటుందని, దాని నుంచి బయటకి రావటానికి ప్రయత్నించాలని సూచిస్తున్నారు.
గుర్తిస్తే బెంగ వుండదు
పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు, బాధ్యతలు ఎప్పుడు తీరతాయి.. పిల్లలు ఎప్పుడు వారి వారి జీవితాల్లోకి అడుగుపెడతారా అని ఎదురు చూస్తుంది తల్లి. తీరా వారు పెద్దయి దూరంగా వెళ్ళినప్పుడు దగ్గర లేరంటూ బెంగ పెట్టుకుంటుంది. అలా కాకుండా ఇప్పుడు పిల్లల పరుగు మొదలైందని గుర్తిస్తే, వారిపై బెంగ కొంచెం తగ్గుతుంది. ఎప్పుడో వచ్చిపోయే అతిథుల్లా పిల్లలు దూరంగా వెళ్ళిపోయారని బాధపడేకంటే, వారితో చక్కటి అనుబంధాన్ని కొనసాగిస్తూ, ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచించాలి. దానికి తగ్గట్టు జీవితాన్ని సన్నద్ధం చేసుకోవాలి.

Spread the love