విద్యాశాఖ అధికారులపై మంత్రి సబిత ఆగ్రహం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తారా?. మాకు చెప్పకుండా భాషాపండితులను సస్పెండ్‌ చేస్తారా?. ఇలాంటి వైఖరితో ప్రభుత్వంపై ఉపాధ్యాయుల్లో అసంతృప్తి పెరుగుతుంది.’అంటూ పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులపై మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. శనివారం మంత్రి వారికి ఫోన్‌ చేసి ఆ సస్పెన్షన్‌ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆదేశించినట్టు సమాచారం. ముగ్గురు భాషాపండితులపై డీఈవోలు సస్పెన్షన్‌ వేటు వేసిన విషయం విదితమే. ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదంటూ ఈ సందర్భంగా మంత్రి సూచించినట్టు తెలిసింది. సమస్యను పరిష్కరించాల్సింది పోయి మరింత జఠిలం చేస్తారా?అని ప్రశ్నించినట్టు సమాచారం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆదేశించినట్టు సమాచారం. ఈ పరిణామాలతో పండితుల సస్పెన్షన్‌ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వారికి పదోన్నతులు ఇవ్వకపోగా సస్పెండ్‌ చేయడంతో తన పట్ల ఆగ్రహంతో ఉంటారని సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం అనంతసాగర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో తెలుగు పండితునిగా పనిచేస్తున్న సిహెచ్‌ దేవదానంను సస్పెండ్‌ చేస్తూ ఆ జిల్లా డీఈవో శనివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సస్పెన్షన్‌ ఎత్తేసే ఉత్తర్వులు ఒకటి, రెండు రోజుల్లో వచ్చే అవకాశమున్నట్టు తెలిసింది. 20 నుంచి భాషాపండితుల బోధన : మంత్రి విజ్ఞప్తికి సుముఖత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా భాషా పండితులు బోధన కొనసాగించాలంటూ విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి చేసిన విజ్ఞప్తికి భాషా పండితుల జేఏసీ సుముఖత వ్యక్తం చేసింది. సోమవారం నుంచి బోధన కొనసాగుతుందని జేఏసీ ప్రకటించింది. ప్రభుత్వ ఉత్తర్వులు ఐదు, తొమ్మిదిల ద్వారా విడుదలైన బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌లో భాషా పండితులకు అవకాశం కల్పించనందుకు నిరసనగా గత 17 రోజులుగా వారు తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు తెలుగు, హిందీ, ఉర్దూ బోధనను బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పేద విద్యార్థులకు నష్టం వాటిల్లకూడదని భావించిన మంత్రి సబిత శనివారం జేఏసీ నాయకులను చర్చలకు ఆహ్వానించారు. వారితో సంప్రదింపులు జరిపారు. పదోన్నతుల సమస్యను పరిష్కరించి తగిన న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆమె ఇచ్చిన హామీ మేరకు సోమవారం నుంచి తొమ్మిది, పది తరగతులకు తెలుగు, హిందీ, ఉర్దూ విద్యాబోధన చేస్తామని భాషా పండితుల జేఏసీ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఎం డి అబ్దుల్లా, సి జగదీశ్‌, చక్రవర్తుల శ్రీనివాస్‌, కృష్ణ, నర్సిములు, గౌరీశంకర్‌ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ హైకోర్టు ఆదేశాలతో నిలిచిపోయిన విషయం తెలిసిందే. మార్చి 14వ తేదీ వరకు ఎలాంటి ప్రక్రియ చేపట్టొద్దంటూ న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. భవిష్యత్తులో పదోన్నతులు చేపడితే అందులో భాషాపండితులకూ ప్రాధాన్యతనిచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జేఏసీకి మంత్రి హామీ ఇచ్చినట్టు సమాచారం. అవసరమైతే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సంప్రదించి న్యాయం చేస్తామన్నారంటూ హామీనిచ్చారని జేఏసీ నేతలు తెలిపారు.

Spread the love