స్వతంత్ర దినోత్సవం రోజున మైనర్ బాలికపై సామూహిక లైంగికదాడి

– మైనర్ బాలిక మృతిపై…వారం రోజులు అవుతున్న మౌనం వీడని పోలీసులు
– మలుపు తిరుగుతున్న మధ్యప్రదేశ్ బాలిక మృతి ఘటన
– బాలిక మృతిపై..అనుమానాలు ఎన్నో..
– మొదట లైంగికదాడి, హత్యగా ప్రచారం..!!
– చివరగా ఆత్మహత్యగా పోస్టుమార్టం రిపోర్ట్..!?
– పోస్ట్ మార్టం రిపోర్ట్ విడుదల చేయడంలో జాప్యం
నవతెలంగాణ- పెద్దపల్లి
మధ్యప్రదేశ్ మైనర్ బాలిక మృతిపై జిల్లా వ్యాప్తంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట బాలికపై సామూహిక లైంగికదాడి జరిగిందని ఆ క్రమంలోని ఆమె మరణించినట్టు ప్రచారం చేశారు. ఈ విషయంలో ఆలస్యంగా స్పందించిన పోలీసులు బాలిక మృతదేహాన్ని మధ్యప్రదేశ్ లో స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాదులోని గాంధీ హాస్పిటల్ కి తరలించారు. పోస్టుమార్టంలో తాజాగా సదరు బాలిక క్రిమిసంహారక మందు సేవించడం వల్లనే మృత్యువాత పడ్డట్టు వైద్య నిపుణులు వెల్లడించినట్టు పోలీసులు లీకులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ మైనర్ బాలిక మృతి ఘటనపై పెద్దపెల్లి జిల్లా ప్రజలు నుండి అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై పౌర సంఘాలు, ప్రజాసంఘాలు, పలు రాజకీయ పార్టీల నాయకులు సంధిస్తున్న ప్రశ్నలకు పోలీసులు నుండి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం వెల్లడి కాకపోవడం గమనార్వం. వారం రోజులు గడుస్తున్నప్పటికీ ఈ ఘటనపై పోలీసులు మౌనం వీడడం లేదు.
బాలికపై సామూహిక లైంగికదాడి..ఇలా..
మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లా కజీరికి చెందిన 16 యేళ్ల బాలిక తన సోదరి కుటుంబంతో కలిసి పెద్దపల్లికి వలస వచ్చి ఉంటోంది. ఆమె తన సోదరి పిల్లలను చూసుకోవడంతో పాటు పెద్దపల్లి మండలం అప్పన్నపేట సమీపంలోని రియల్ ఎస్టేట్ వెంచర్‌లో భవన నిర్మాణ కూలీగా పనిచేస్తోంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 14న పెద్దపల్లికి చెందిన ఓ వ్యక్తి తనకు పని కల్పిస్తానని చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ మరో ముగ్గురితో కలిసి ఆమెపై లైంగికదాడికి పాల్పడి పెద్దపల్లి బస్టాండ్‌లో వదిలేశాడు. బాలికను గుర్తించిన ఓ వ్యక్తి ఆమె నివాసంలో పడేశాడు. తీవ్ర రక్తస్రావం, వాంతులు వచ్చిన బాలిక తన సోదరికి, ఇతర కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి వారు మధ్యప్రదేశ్‌ నుంచి తమను పని నిమిత్తం తీసుకొచ్చిన గోపాల్‌కు సమాచారం అందించారు. అయితే, ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి, పోలీసులను అప్రమత్తం చేయడానికి బదులుగా, గోపాల్ ఆగస్ట్ 15 న వాహనంలో అమ్మాయిని ఆమె స్వగ్రామానికి పంపించాడు. అయితే, ఆమె మార్గమధ్యంలో బాలిక మరణించింది. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టి నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నించారు. పౌరహక్కుల వేదిక విరసం, తెలంగాణ ప్రజాఫ్రంట్ సభ్యులు గురువారం బాలిక కుటుంబ సభ్యులతో సమావేశమై నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ముందే తెలిసినా, ఆలస్యంగా స్పందించిన పోలీసులు..
మధ్యప్రదేశ్ బాలికపై లైంగికదాడి ఘటన విషయం ఆగస్టు 15వ తేదీనే బయటకు వచ్చింది. ఈ విషయమై అదే రోజు ఓ ప్రజా ప్రతినిధి జరిగిన సంఘటన వివరిస్తూ పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు ఈ అంశమై పెద్దగా పట్టించుకోక పోవడం గమనార్వం. స్వతంత్ర దినోత్సవం రోజున ఈ లైంగికదాడి ఘటన బయటకు వచ్చిన పోలీసులు స్పందించనీ తీరు విమర్శలకు తావిస్తుంది. ఈ విషయమై మీడియాలో రావడంతో రామగుండం సిపి రెమ రాజేశ్వరి రంగంలోకి దిగి సత్వర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి ఏసిపి ఎడ్ల మహేష్ ఆధ్వర్యంలో పోలీసు బృందం మధ్యప్రదేశ్ కి వెళ్లి బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. రెండు బృందాలుగా విడిపోయిన సిఐలు జగదీష్, అనిల్ కుమార్ లు మొదట అనుమానితులను అదుపులో తీసుకొని విచారణ వేగవంతం చేశారు. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు.
పురుగుమందు షాపులో బాలిక ఎలుకల మందు కొనుగోలు… 
– ఆత్మహత్యగా ప్రచారం..
– సిసిటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ
మధ్యప్రదేశ్ చెందిన సదరు బాలిక పెద్దపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట గల ఓ పురుగుమందుల షాపులో ఎలుకల మందు కొనుగోలు చేసినట్టు సీసీటీవీ ఫుటేజి ఆధారంగా పోలీసుల విచారణలో వెళ్లడైంది. పోస్టుమార్టం రిపోర్ట్ లో క్రిమిసంహారక మందు సేవించడం వల్లనే బాలిక మృతి చెందినట్లు వైద్య నిపుణులు పోలీసులే లీకులు చేసినట్లు తెలుస్తుంది. అందుకు పెద్దపల్లి లోని ఒక దినపత్రిక లో మాత్రమే బాలిక ఎలుకల మందు కొనుగోలు చేసినట్లు వీడియో ఫుటేజ్ ఫోటో వచ్చింది. లైంగికదాడి జరిగినట్టుగానే బాలిక దేహం పై lఎలాంటి గాయాలు గాని లేవని వైద్యులు వెల్లడించినట్లు ప్రచారం అవుతుంది. ఈ నేపథ్యంలో బాలికపై సామూహిక లైంగికదాడి అంశం ఆత్మహత్య వైపు మళ్ళింది.
లైంగికదాడి ఘటనపై బాలిక ఆడియో రికార్డులు వైరల్…
అప్పన్నపేటలో గల శివపార్వతి నగర్ లో తన ఇంట్లో ఉండగా. వాచ్మెన్ వచ్చి నీకు పని ఉందని డబ్బులు ఇస్తా నాతో రా అంటూ తీసుకెళ్లాడని అక్కడికి వెళ్లిన తర్వాత తనపై నలుగురు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారని ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెబితే చంపేస్తామని బెదిరించారని మధ్యప్రదేశ్ కు చెందిన బాలిక మాట్లాడిన ఆడియో రికార్డులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాలిక చెప్పిన వాయిస్ ఆడియో రికార్డులు మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. వాటిపై పోలీసులు వివరణ ఇవ్వడం లేదు.
ఆస్పత్రికి కాకుండా, మధ్యప్రదేశ్ ఎందుకు వెళ్లారు…
బాలిక ఎలుకల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడి ఉంటే వెంటనే ఆసుపత్రికి కాకుండా హుటాహుటిన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు తీసుకెళ్లారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎలుకల మందు తాగిన బాలికను సకాలంలో ఆసుపత్రికి చేర్చి ఉంటే చనిపోయే అవకాశాలు ఉండేవి కావు. అయితే బాలికది ఆత్మహత్య కాదు అనేది స్పష్టం అవుతుంది. లైంగికదాడికి గురైన బాలికను ఆసుపత్రి తీసుకెళ్తే అసలు విషయం బయట పడుతుందని పలువురు ప్రభావం కారణంగానే ప్రత్యేక వాహనంలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. తీవ్ర రక్తస్రావం జరగడం వల్లనే బాలిక మృతి చెంది ఉంటుందని పలువురు భావిస్తున్నారు. బాలిక ఎలుకల ముందు కొనుగోలు చేసిన సమయానికి, లైంగికదాడి జరిగిన సమయాన్ని మధ్య గంటల తేడా ఉన్నట్టు తెలుస్తుంది.ఎన్నికలవేళ లైంగికదాడి హత్య ఘటన బయటకు వస్తే ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుందని ప్రభుత్వ పెద్దలు ఈ ఘటనను పక్కదారి మల్లిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వారం రోజులు గడుస్తున్నా మౌనం లేదని పోలీసులు..
ఈ సంఘటన జరిగి వారం రోజులు రోజులు కావస్తున్న, రాష్ట్రంలో సంచలన వార్తగా మారిన కూడా, ఇప్పటివరకు పోలీసులు నోరు విప్పాకపోవడం అడిగిన దాటవేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అదేవిధంగా మధ్యప్రదేశ్ కూలీల కుటుంబాలను పెద్దపెల్లి పోలీసులు డీసీపీ ఆఫీస్ లోకి తీసుకొచ్చి మూడు రోజులపాటు అందులోనే ఉంచుకోవడం బట్టి చూస్తే మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏ విషయమైనా తెలియజేస్తామని అప్పటివరకు మీడియాలో ఏది పడితే అది రాయకూడదు అని పెద్దపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ నవ తెలంగాణతో తెలిపారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ అంశంపై పోలీసులు త్వరలో మీడియా ముందు వచ్చి ఏం చెప్తారో అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Spread the love